పనులలో నాణ్యత, వేగం పెంచాలి
తల్లిదండ్రుల వెయిటింగ్ స్థలం స్వాధీన ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ సందర్శన
డిసెంబర్ నాటికి స్కూలును పూర్తి చేస్తాం: ఈడబ్ల్యుఐడీసీ ఈ ఈ బుగ్గయ్య
నవతెలంగాణ – బోనకల్
విద్యార్థుల తల్లిదండ్రుల వెయిటింగ్ స్థలం స్వాధీనం ఆలస్యంపై ఈ డబ్ల్యు ఐ డి సి ఈ ఈ బుగ్గయ్య పనితీరుపై జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం రెవిన్యూ పరిధిలో సుమారు 200 కోట్లతో నిర్మించనున్న ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ మ్యాపుని ఈ ఈ బుగ్గయ్య కలెక్టర్ కు మ్యాపు ద్వారా నిర్మాణ పనులను వివరించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి, నిర్మాణాలు ఎంతవరకు పూర్తి అయ్యాయని బుగ్గయ్యను జిల్లా కలెక్టర్ అడిగారు. ఇదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు వెయిటింగ్ కోసం, పార్కింగ్ కోసం మరో మూడు ఎకరాల స్థలాన్ని ఎక్కడ చూశారు ఎంతవరకు వచ్చిందని ఈ ఈ బుగ్గయ్యను ప్రశ్నించారు. దీంతో ఆయన స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో పాటు ఆ స్థలం మాకు ఇంకా రెవిన్యూ అధికారులు అప్పగించలేదని సమాధానం చెప్పడంతో ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అంటూ కలెక్టర్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తహసిల్దార్ మద్దెల రమాదేవిని ఆ స్థల విషయంపై కలెక్టర్ ప్రశ్నించారు.
దీంతో ఆమె మూడు ఎకరాల నాలుగు కుంటల భూమిని సర్వే చేసి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కి అప్పగించామని సమాధానం చెప్పింది. దీంతో కలెక్టర్ వెంటనే ఇదేమి సమాధానం అంటూ ఈ ఈ పై మరోసారి ఆగ్రో వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు నిర్మాణ విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ ఈ ని ఆదేశించారు. భవన నిర్మాణ పనులను ఎప్పటిలాగా పూర్తి చేస్తారని కలెక్టర్ బుగ్గయ్యను ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో బుగ్గయ్య డిసెంబర్ నాటికి మొత్తం నిర్మాణ పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ కు తెలిపారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ విషయంపై అలసత్వం వహించవద్దని, నాణ్యత ప్రమాణాలతో నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఈ ఈ ని కలెక్టర్ ఆదేశించారు.
రెండు రోజులలో లారీల, కొనుగోళ్లు సమస్య పరిష్కారం అవుతుంది: జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం బయటకు వస్తుండగా గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ మంద కరుణ కలెక్టర్ కు ఎదురుగా వెళ్ళింది. దీంతో కలెక్టర్ స్పందిస్తూ మీ మండలంలో మొక్కజొన్న కొనుగోలు ఎలా ఉన్నాయి అంటూ ఆమెను ప్రశ్నించారు. ఆమె వెంటనే లారీల, కొనుగోళ్ల సమస్య తీవ్రంగా ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. 20 రోజులకు పైగా కొనుగోలు చేసిన బస్తాలను గోదాములకు తరలించలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంద కరుణ, రామాపురం మాజీ సర్పంచ్ కొమ్మినేని బాబు కలెక్టర్ కు తెలిపారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ వ్యవసాయ శాఖలో సెలవులు పెట్టిన వారందరినీ వెంటనే సెలవల రద్దు చేసుకొని విధుల్లో చేరాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా లారీల సమస్య ఉందని బోనకల్ మండలం నుంచే సోషల్ మీడియాలో ఎక్కువగా లారీల కొరత, కొనుగోలు చేసిన మొక్కజొన్నలను తరలించడం లేదని పోస్టింగ్ లు వస్తున్నాయన్నారు. రెండు రోజులలో బోనకల్ మండలంలో నెలకొన్న లారీల, మొక్కజొన్న కొనుగోళ్ల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం చేస్తామని రెండు రోజులు ఓపిక పట్టాలని రైతులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈ డబ్ల్యు ఐ డి సి బుగ్గయ్య, మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి, ఎంపీడీవో రురావత్ రమాదేవి, ఈ డబ్ల్యూ ఐ డి సి ఏఈ బోయిన నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.



