Sunday, May 10, 2026
E-PAPER
Homeచౌరస్తావర్క్‌ ఫ్రం హోమ్‌

వర్క్‌ ఫ్రం హోమ్‌

- Advertisement -

వారం రోజుల్దాకా డ్యూటీ అని కదా వెళ్లారు. అప్పుడే వచ్చేశారేం అంది శ్రీమతి. ఈ మండే ఎండల్లో ఏం డ్యూటీ చెయ్యగలం. డ్యూటీకని వెళ్లినప్పుడు అక్కిడి వాహనం వాడాలా? దానికి పెట్రోల్‌ ఎక్కడిది? అక్కడి తిండి తినాలా? గ్యాసు బండ వెల నెత్తిన ఢాం అనడంతో రేట్లు రెచ్చిపోయినవి. అలవెన్సు చాలనే చాలదు. అందువల్ల బాస్‌ని బతిమాలి ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ సంపాదించా. ఇక ఇంటినుంచే డ్యూటీ అంటూ తలమీది నుంచి కొమ్ములు, నోటి నుంచి కోరలూ తీసి బల్లమీద పెట్టాడు శ్రీమతి హజ్‌బెండ్‌.

ఇక ఈ కోరలూ కొమ్ములూ అక్కర్లేదు కదా. కప్‌బోర్డ్‌లో పెట్టేయనా? అసలు వీటిని పెట్టుకుని డ్యూటీకి వెళ్లడం అవసరం అంటారా అంది ఆవిడ. మరదే! మనం చేసేపనికి అవి అవసరమే. మనం వెళ్లి ఎదురుగ్గా నిలబడితే చాలు, వంద కేజీల మనిషి కూడా బెంబేలెత్తి బేజారయ్యి, చెమట్లు కక్కి, గుండె పగిలి చావాల్సిందే! పోలీసువాడికి లాటీ, యంభట్టుకి కోరలూ, కొమ్ములూ, యంపాశమూ వుండి తీరాల్సిందే అని అతను అంటూ వుంటే లోపలికి వచ్చాడు యంభట్టు అసిస్టెంట్‌ ‘యంప్యూటర్‌’ మోసుకుంటూ.

వచ్చావా! రారా! ఈ వారం డ్యూటీ ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ నే మనకు. యంప్యూటర్‌ని టేబుల్‌ మీద సెట్‌ చెయ్యి. నేను కాస్త సోమరసం పుచ్చుకు వస్తానన్నాడు యంభట్టు. సోమరసం కోటా అయిపోయింది. యంలోకపు చీప్‌ లిక్కర్‌ వుంది ఇంట్లో అంటూ లోపల్కి వెళ్లిపోయింది శ్రీమతి. చీప్‌ లిక్కర్‌తో చచ్చేవాళ్లమేం కాదు కదా, చంపేవాళ్లం అదేం చేస్తుందిలే.. సరే పని మొదలుపెడదాం అన్నాడు యంభట్టు. యంప్యూటర్‌ స్క్రీన్‌ వెలుగులు విరజిమ్మింది. తెరమీద ఓ జంతు ప్రదర్శనశాల కనిపించింది. పులి పచ్చిక మీద పచార్లు చేస్తున్నది. ఫెన్సింగ్‌ బయట ఓ కుర్రాడు సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. వీడే వీడే అన్నాడు అసిస్టెంటు. అవును నాకిచ్చిన లిస్టులో వీడే టాపర్‌. వీడి పంచప్రాణాలు ప్యాక్‌ చేసి పట్టుకురావడానికి చెమట్లు కక్కుతూ, గిర్రున తిరుగుతున్న భూలోకం వెళ్లి నానా అవస్తలూ పడ్డం అవసరం లేదు. యంప్యూటరూ, ఏఐ ఎందుకున్నయి.

మీటలు నొక్కు అన్నాడు యంభట్టు. అసిస్టెంట్‌ కీ బోర్డు మీద వేళ్లు అటూ ఇటూ తిప్పాడు. లోపల పులి, బయట కుర్రాడు. పులి అప్పుడప్పుడు తలెత్తి చూస్తున్నది. కుర్రాడి మనసు పులి పక్కనే నిలబడి సెల్ఫీ తీసుకోమని పోరు పెట్టింది. ఎత్తి పులి ముందు పడేసి వాడి కోరిక తీర్చు అన్నాడు యంభట్టు. అసిస్టెంట్‌ తల ఊపాడు. కుర్రాడు ఫెన్సింగ్‌ ఎక్కి దూకాడు. పులికి వాడు తన పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవడం అస్సలు నచ్చలేదు. లిస్టులో ఓ పేరు కొట్టేశాడు యంభట్టు. తెర మీద ఓ హాలు, హాలులో జనం కేకలు కనబడి వినపడుతున్నవి. బల్ల మీద బర్త్‌ డే కేక్‌ వుంది. పుట్టిన రోజు జరుపుకునేవాడి చేతిలో కేక్‌ కోసే కత్తి వుంది. జనం హేపీ బర్త్‌డే పాడారు. కేకు కట్టయింది. కేక్‌ కట్‌ చేసినవాడి ఫ్రెండ్స్‌ ముగ్గురున్నారు.

వాళ్లు కేక్‌ని పిడికిళ్లతో పిసికి పుట్టిన్రోజు బారు మొహాన పూశారు సరదాగా, హుషారుగా. నొక్కు మీట నొక్కు. వాడికి కోపం నషాళానికి తాకింది. వాడి నెత్తురు వరద పోటెత్తుతున్నది. అసిస్టెంట్‌ తలూపాడు. బర్త్‌ డే బారు చేతిలో పిస్టల్‌ ట్యూబ్‌ లైట్‌ వెలుతురులో తళుక్కుమంది. ఆ తర్వాత మూడు సార్లు ఢాం అంది. వాడి ముఖాన కేక్‌ పూసిన వాళ్లకు కేక్‌ తినే ఛాన్సు లేకుండా పోయింది. లిస్టులో మూడు పేర్లు కొట్టేశాడు యంభట్టు. తెర మీద రోడ్డు పొడుగ్గా, విశాలంగా, ఖాళీగా వుంది. అప్పుడే డ్యూటీకి వచ్చిన సూర్యుడు బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్నాడు. రోడ్డు మీద ఉరుకులూ పరుగులూ పెడ్తున్నది ఓ కారు. కారులో తల్లీ, తండ్రీ, కూతురూ, కొడుకూ, మరో ఇద్దరు. ఒక్క మీట నొక్కితే ఆరు, ఐదుతో హెచ్చవేస్తే ముప్పయి పంచప్రాణాలు. మన పని ఎంత తేలికయిందో, మీట నొక్కు అన్నాడు యంభట్టు. అసిస్టెంట్‌ తలూపాడు.

ఆవురావురంటూ పెట్రోలు తాగుతూ రోడ్డు మీద ఆగివున్న లారీ కనిపించనే లేదు. అరడజన్‌ పేర్లు లిస్టులో కొట్టేశాడు యంభట్టు. పదహారేళ్ల అమ్మాయి ఆదుర్దాగా, ఆందోళనగా, భయం భయంగా గదిలో చిరాగ్గా, అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నది. తెల్లవారితే అమ్మాయి పరీక్ష రిజల్టు వస్తుంది. తను ఫెయిల్‌ అవుతానేమోనని ఆమె భయం. రిజల్టు రాకుండానే తను లేకుండానే పోవాలనుకుంటున్నది అన్నాడు యంభట్‌. ఒకరోజు ఆగితే తెలుస్తుంది కదా. పాసవుతుందేమో అన్నాడు అసిస్టెంట్‌. అవుతుంది, కచ్చితంగా పాసవుతుంది. కానీ అది చూసుకునే టైం ఆమెకి లేదు. మన డ్యూటీ మనం చెయ్యాల్సిందే అన్నాడు యంభట్టు. అసిస్టెంట్‌ తల వూపాడు. చున్నీ ఏ కాదు అమ్మాయి కూడా ఫ్యాన్‌కి వేలాడసాగింది. లిస్టులో మరో పేరు కొట్టేశాడు అసిస్టెంటు.

తను సీరియల్‌ చూడకుండా భర్త రిమోట్‌ లాక్కున్నాడని ఓ భార్య, అప్పుల బాధ భరించలేక ఓ మధ్యతరగతి కుటుంబం, పెళ్లి చేసుకుంటానని ఓ మగాడు మోసం చేశాడని ఓ అమ్మాయి, తండ్రి మందలించాడని ఓ కొడుకు, నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి కుదరలేదని ఓ బ్రహ్మచారి, ఎవరికి వారు సెల్ఫ్‌గోల్‌ చేసుకుని ప్రాణాలు గాలిలో ఊదిపారేస్తుంటే అసిస్టెంట్‌ మీట నొక్కడం, యంభట్టు లిస్టులో పేర్లు కొట్టేయడం కంటిన్యూ అవసాగింది. వస్తువులకే కాదు మనుషులకూ ఓ ఎక్ప్‌పైరీ డేట్‌ వుంటుంది. కానీ, జీవితపు ఆటుపోటులను ఎదుర్కొలేక, మనం పర్సనల్‌గా వెళ్లే టైమూ ఇవ్వకుండా రెప్పపాటు కాలంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు గనుక మనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశం దొరుకుతున్నది అన్నాడు యంభట్టు. తల ఊపాడు అసిస్టెంటు.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -