అన్యాయం చేసిన వాళ్లకి అవకాశమిద్దామా..?

To those who have done injustice Do we have a chance..?– కాంగ్రెస్‌ వస్తే ధరణి బంగాళాఖాతంలోకి..
– రైతులు అరేబియా సముద్రంలోకే
– ప్రజలను డివైడ్‌ చేయడమే బీజేపీ పాలసీ
– దళారుల రాజ్యం కావాలో.. సంక్షేమ రాజ్యం రావాలో ఆలోచించండి
– పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అనూహ్యమైన అభివృద్ధి : ప్రజాఆశీర్వాద సభల్లో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం
నవతెలంగాణ-బోధన్‌/కంఠేశ్వర్‌/లింగంపేట్‌/ మెదక్‌
‘ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌.. ఆ పార్టీ అనాలోచిత నిర్ణయం వల్లే 58 ఏండ్లు గోస పడ్డామని, తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇద్దామా… ఇచ్చి మళ్లీ దళారుల రాజ్యం తీసుకొద్దామా.. అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. 60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఎట్లుండే.. 10 ఏండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎలా మారిందో ప్రజలే ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్‌ గెలిస్తే ధరణిని బంగాళా ఖాతంలోకి.. రైతులను అరేబియా సముద్రంలోకి వేస్తారన్నారు. అభ్యర్థులు ఎవరు బరిలో నిలిచారో, వారి వెనకున్న పార్టీని చూసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌ నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఆ పార్టీ అభ్యర్థులు షకీల్‌, బిగాల గణేశ్‌గుప్త, జాజాల సురేందర్‌, పద్మాదేవేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు.
పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అనూహ్యమైన అభివృద్ధి
మెదక్‌ పట్టణంలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర తలసరి ఆదాయం, నాణ్యమైన విద్యుత్‌, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ 1 స్థానంలో ఉందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఐదు కార్యక్రమాలను చేపట్టినట్టు వివరించారు. మెదక్‌లో అప్పటి కలెక్టర్‌ సూచనల మేరకు నీటి తీర్వ బకాయి డబ్బులను రద్దు చేశామని, నీటి ట్యాక్స్‌ లేదని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే భవిష్యత్‌ ఉంటుందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. కేసీఆర్‌కు పని లేదని, ప్రజలు కట్టిన పన్నులతో రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని, 24 గంటల కరెంట్‌ వేస్ట్‌ అని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో మంజీరాను ఎండ బెట్టిందని, ఇప్పుడు ఘనపురం ఆనకట్ట కింద 40 వేల ఎకరాలు పండుతున్నాయి. నీళ్ళు కావాలంటే సంపూర్ణంగా తెచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు. సంపద పెంచుకుంటూ ప్రజలకు పంచుకుంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు పోతుందన్నారు. 2024 తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందన్నారు. సమావేశంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
30 లక్షల 10 హెచ్‌పీ మోటార్లు ఎవడు కొనివ్వాలి
ధరణి, రైతుబంధు ఎత్తేస్తామని, 24 గంటల కరెంట్‌కు బదులు 3 గంటల కరెంట్‌ ఇస్తామని, కాబట్టి 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని రేవంత్‌ రెడ్డి అంటున్నాడని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రైతుల వద్ద 10 హెచ్‌పీ మోటార్‌ ఉంటదా..? 3 హెచ్‌పీ, లేదంటే 5 హెచ్‌పీ పెట్టుకుంటారని, నీళ్లు బాగా ఉంటే 5 హెచ్‌పీ పెట్టుకుంటారని తెలిపారు. 30 లక్షల పంపు సెట్లు ఉన్న తెలంగాణలో 30 లక్షల 10 హెచ్‌పీ మోటార్లు కొనాలంటే రూ. 30 వేల కోట్లు కావాలని, అంత డబ్బు ఎవడు ఇవ్వాలని ప్రశ్నించారు. అందుకే బంగాళాఖాతంలో ఎవరిని వేయాలో రైతులు, ఓటర్లు ఆలోచన చేయాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, నీళ్ల కోసం ఏర్పడిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి రాలేదని, ప్రజాస్వామ్య పరిణితి సాధించిన దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. గతంలో మోసపోయిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు మోసపోవద్దన్నారు. బీజేపీ మత పిచ్చితో మంటలు పెట్టే పార్టీ అని, ప్రజలను విడదీయడమే బీజేపీ పాలసీ అని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలను, మతాలను బీఆర్‌ఎస్‌ పార్టీ కలుపుకొని పోతుందన్నారు. బీఆర్‌ఎస్‌ నూటికి నూరు శాతం లౌకికపార్టీ అని స్పష్టంచేశారు.

Spread the love