Saturday, May 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం

తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం

- Advertisement -

ఆర్థిక ఇబ్బందులున్నా పూర్తిచేస్తాం
మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత 
బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలదే
స్వలాభం కోసమే కేసీఆర్ కాళేశ్వరానికి
ప్రాజెక్టు తరలింపు
ఎక్సైజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు
మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యేలతో కలిసి ‘ప్రాణహిత’ నిర్మిత స్థల సందర్శన

నవతెలంగాణ`కాగజ్‌నగర్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ను కట్టి తీరుతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిత స్థలాన్ని శుక్రవారం గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, సిర్పూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్‌బాబు, గడ్డం వినోద్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మిస్తేనే గ్రావిటీ ద్వారా రోజుకు రెండు టీఎంసీల చొప్పున 22 వేల క్యూసెక్కుల నీటిని తరలించొచ్చని చెప్పారు. ఈ బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత తెలంగాణలోని 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు తీసుకోవాలని సూచించారు. 2008లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.35వేల కోట్లు కేటాయించి, అందులో రూ.13వేల కోట్లతో కాలువల నిర్మాణం చేపట్టిందని వివరించారు. మరో రూ.20వేల కోట్లు వెచ్చిస్తే బరాజ్ నిర్మాణం పూర్తయ్యేదని, కానీ కేసీఆర్ సొంత లాభం కోసం దీన్ని ఇక్కడి నుంచి తరలించారని ఆరోపించారు.

కాసుల కోసమే కాళేశ్వరానికి ప్రాజెక్టు తరలింపు : మంత్రి వివేక్
కాసుల కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్టు ను కాళేశ్వరానికి తరలించి ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని మంత్రి వివేక్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ రైతుల కోసం ఈ ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పారు. దీనికి ముందు బరాజ్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పరిశీలించారు. బరాజ్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం గురించి ఇరిగేషన్ సీఈ సత్యరాజచంద్ర, ఈఈ ప్రభాకర్, డీఈలు వెంకటరమణ, తిరుపతి, భద్రయ్య ఆర్‌వి అసోసియేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధి ఎంవివి సారధి మంత్రులకు, ఎమ్మెల్యేలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నికితాపంత్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

నోరు మెదపని సిర్పూరు ఎమ్మెల్యే హరీష్‌బాబు
బరాజ్ ఎత్తు నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విషయంలో సిర్పూరు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడాలని ఇద్దరు మంత్రులు కోరినా ఆయన నోరు మెదపలేదు.
150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణం కోసం మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకోవాలని, దీనిపై స్పందించాలని అక్కడే ఉన్న హరీష్‌బాబును పదే పదే కోరినా ఆయన మాట్లాడడానికి నిరాకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -