9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా
వ్యవసాయ అనుబంధ రంగాల కోసం
రూ.1,67,877 కోట్లు
రైతు భరోసా, ఆశీర్వాద సభ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం గ్రామం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద నేడు (శుక్రవారం) నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు ప్రతి రైతూ హాజరై విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని అందించిన నేపథ్యంలో జులై 10న రైతు ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 3 లక్షల మంది రైతులు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రతి రైతూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
రైతులే రాష్ట్రానికి వెన్నెముక అని, రైతులకు ప్రతి అడ అడుగులో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పదేండ్లలో మొత్తం రూ.72 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని, తమ ప్రభుత్వం కేవలం రెండున్నరేండ్లలోనే కింద రూ.35,830 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1, 67, 877 కోట్లను వెచ్చించినట్టు చెప్పారు. రైతు రుణమాఫీ, ధాన్యానికి బోనస్, పంటల బీమా, పంట నష్టపరిహారం, ఉచిత విద్యుత్, విద్యుత్ సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పలు రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ నిధులను వినియోగించినట్టు వివరించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని వేశామని అన్నారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, భవిష్యత్తులో రైతులకు మరింత మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


