నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
విద్యావ్యవస్థ ప్రతి విద్యార్థికీ
సమాన అవకాశాలు కల్పించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్
నాగోల్‌లో విద్యార్థులతో ముఖాముఖి
నవతెలంగాణ -నాగోల్
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ విమర్శించారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ “ఛాత్రోన్ కా గూంజ్” కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ ఉమ్మడి డివిజన్ పరిధిలోని రాక్‌హిల్స్ కాలనీలో గురువారం విద్యార్థులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను నిరసిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వేషధారణలో యువజన కాంగ్రెస్ నాయకులు వినూత్న నాటిక ప్రదర్శించారు. నీట్ పేపర్ లీకేజీతో నష్టపోయిన విద్యార్థులు వేదికపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీల ప్రభావాన్ని పీపీటీ ద్వారా యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు వివరించారు. విద్యను వ్యాపారంగా కాకుండా ప్రతి విద్యార్థికీ సమాన అవకాశాలు కల్పించే వ్యవస్థగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రి మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ పాలనలో పేపర్ లీకులు, నియామక కుంభకోణాలు సాధారణమయ్యాయని, కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్
మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ
నీట్ పేపర్ లీకేజీ ఘటనల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి విద్యార్థికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా విధానాన్ని అమలు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు, రాష్ట్ర ఇన్‌చార్జీలు ఖాలీద్, భవ్య, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.


