Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రణాళికాబద్ధ పాలనతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం

ప్రణాళికాబద్ధ పాలనతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం

- Advertisement -

గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర
16వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగించాలి: 
మంత్రి దనసరి అనసూయ
ములుగు జిల్లాలో
 సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమం

నవతెలంగాణ-ములుగు
గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని పంచాయతీరాజ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని లీలా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, సర్పంచ్‌ల శిక్షణా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకపాత్ర పోషించాలన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని సూచించారు. గ్రామాభివృద్ధి పనులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వార్షిక ప్రణాళిక ఆధారంగా చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులు అమల్లోకి వస్తున్న తరుణంలో ప్రతి సర్పంచ్‌ మార్గదర్శకాలు, నిధుల వినియోగ విధానం, అనుమతించబడిన పనులు, వ్యయ నియమాలను పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు. గతంలో అవగాహన లోపంతో కొందరు సర్పంచులు నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను మంత్రి గుర్తు చేశారు. టైడ్‌ ఫండ్స్‌, అన్‌టైడ్‌ ఫండ్స్‌, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీల స్వంత ఆదాయ వనరుల వంటి ప్రతి నిధికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, వాటికి అనుగుణంగానే ఖర్చు చేయాలని సూచించారు.

గ్రామ పంచాయతీల స్వంత ఆదాయాన్ని పెంపొందించేందుకు పన్నులు, ఫీజుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామ అవసరాలను గుర్తించి, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, హరితహారం, పర్యావరణ పరిరక్షణ, గ్రామ రహదారులు, మురుగు నీటి పారుదల, ప్రజా ఆరోగ్యం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులకు ప్రత్యేక విధానాలు ఉంటాయని, వాటిని గ్రామ పంచాయతీ నిధులతో కలిపి వినియోగించరాదని స్పష్టం చేశారు. మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) సంపత్‌రావు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌, ములుగు జిల్లా ప్రత్యేక అధికారి సురేష్‌ బాబు సర్పంచులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌, రేగ కళ్యాణి, వైస్‌ చైర్మెన్ సారంగం, డీపీఓ వెంకయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ అజరు కుమార్‌, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -