Saturday, May 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య

విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య

- Advertisement -

నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసిన దుండగులు
కీలకపాత్ర పోషించిన పనిమనిషి
పథకం ప్రకారమే హత్య
నేపాలీ గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

నవతెలంగాణ సిటీబ్యూరో
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో దారుణ హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఐపీఎస్(డీజీ) అధికారి భార్య నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి దుండగులు హత్యచేశారు. బంగారం, డబ్బుల కోసం అదును చూసుకుని పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ శుక్రవారం మీడియాతో వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో కొద్ది నెలలుగా రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్‌రాయ్ తన సతీమణి తనూజ(55), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. రిటైర్డ్ డీజీ తల్లి అనారోగ్యంతో ఉండడంతో చికిత్స కోసం వీరు హైదరాబాద్ రాగా ఇటీవల ఆమె మృతిచెందారు. ఈక్రమంలోనే కొద్దినెలల కింద నేపాల్ దేశానికి చెందిన కల్పన అనే మహిళ వారింట్లో పనిమనిషిగా చేరింది. ఇంట్లో దోపిడీ చేసేందుకు ఎదురుచూస్తున్న ఆమె పథకం ప్రకారం మరో ఇద్దరితో చేతులు కలిపింది. వినయ్ రంజన్‌రాయ్ బెంగళూర్ వెళ్లడంతో అదే
అదునుగా భావించిన నిందితులు గురువారం తెల్లవారు జామున వెనుకాల గేటు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో పిల్లలు ఇద్దరు పై ఫ్లోర్‌లో పడుకున్నారు. తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. నిందితుల రాకతో శబ్దానికి తనూజ మేల్కొవడంతో ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అయితే పై అంతస్తులో నిద్రిస్తున్న పిల్లలకు ఈ విషయం తెలియలేదు. హత్య అనంతరం ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను తీసుకొని ముగ్గురు నిందితులు పరారయ్యారు. తనూజ హత్యకు గురైనట్టు పోలీసులకు తెల్లవారుజామున సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్‌టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. ఇంట్లోని సీసీకెమెరాల ఫుటేజీలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలను రంగంలోకి దించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సీపీ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీజీపీ సీవీ ఆనంద్‌తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు పరిశీలించారు. హత్య జరిగిన తీరుపై ఆరా తీశారు. తనూజ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం ప్రశాసన్ నగర్‌లోని ఐపీఎస్(రిటైర్డ్) అధికారి నివాసానికి తరలించారు.

ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్ కు..
హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ… పని మనిషి కల్పన అండ్ గ్యాంగ్ కదలికలపై నిఘా పెట్టారు. పోలీసులను అప్రమత్తం చేశారు. దోపిడీ అనంతరం ఇంటి వెనుక భాగంలోని పార్క్ నుంచి దుండగులు పరారయ్యారు. అక్కడి నుంచి వారంతా ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్టు సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్టు పరిశీలనలో తేలింది. దాంతో కొన్ని పోలీస్ బృందాలు ఢిల్లీకి, మరిన్ని పోలీస్ బృందాలు నేపాల్ కు వెళ్లాయి. ఇదిలావుండగా, ఈ నిందితులకు గతంలో నందగిరిహిల్స్‌లో దోపిడీకి పాల్పడిన నేపాలీ ముఠాతో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ మరో బృందం విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.

నేపాలీ గ్యాంగ్‌ల పట్ల జాగ్రత్త
దేశవ్యాప్తంగా నేపాలీ గ్యాంగ్‌లు నేరాలకు పాల్పడుతున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. బెంగళూర్, ముంబయి, పుణేతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ నేపాలీ గ్యాంగ్‌లు నేరాలకు పాల్పడ్డాయని వివరించారు. ఎంతో నమ్మకంగా పని చేస్తున్నట్టు నటించే నేపాలీ పని మనుషులు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నేరాలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. ఇంట్లో పనిలో చేరే వారు ఏడాది, రెండో ఏడాది పనిచేసినా వారిపై నిఘా ఉంచాలఁనిసూచించారు. ఈ హత్య కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కేసులో ఎంత బంగారం, నగదు పోయిందనే అంశాలపై ఆరా తీస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -