నియామక పరీక్ష
నోటిఫికేషన్ ఆలస్యానికి నిరసన
బీహార్ ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆందోళనలపై ఉక్కుపాదం
పాట్నా : బీజేపీ అధికారంలోకి రాగానే బీహార్ లో ఖాకీ జులుం ప్రదర్శించింది. నిరుద్యోగ అభ్యర్థులపై లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. బీపీఎస్పీ టీఆర్ఈ పరీక్ష తేదీని ప్రకటించటంలో ఆలస్యమవుతుండటంతో, నిర్ణీత గడువు నాటికి అభ్యర్థుల వయస్సు దాటిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం పాట్నాలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు
ప్రదర్శన నిర్వహించారు. నిరసన చేస్తున్న అభ్యర్థులు పాట్నా కళాశాల నుంచి తమ యాత్రను ప్రారంభించారు. డాక్ బంగ్లా చౌరహా వైపు వెళ్తుండగా.. గాంధీ మైదాన్ సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ పాలకుల దృష్టికి తమ సమస్యలు విన్నవించుకుంటామని ప్రాధేయపడ్డారు. కనీసం వారితో చర్చించటానికి మంత్రులు, అధికారులు నిరాకరించారు. దీంతో “నిరసనకారులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లాలని ఉద్యోగార్థులు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టడానికి స్వల్ప బలప్రయోగం చేశాం,” అని ఎస్పీ (సెంట్రల్) దీక్ష తెలిపారు. పోలీసులు తమపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారని పలువురు నిరసనకారులు ఆరోపించారు.
అసలేం జరిగింది..?
46,000కు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సన్నద్ధమైందిస బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్ఈ-4ను ఏప్రిల్ 2026లో ప్రకటించాల్సి ఉంది. ఈలోపు రాజకీయ సమీకరణలు మారాయి. నితీశ్ సర్కార్ గద్దెదిగి బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. రాజకీయంగా మార్పులు జరుగుతున్నాయే తప్ప పరీక్షల నిర్వహణ మాత్రం పట్టించుకోవటంలేదంటూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ బాధ్యతలు స్వీకరించారు. నిరుద్యోగ అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడుతున్న తీరుపై మీడియా కథనాలు వచ్చాయి. దీంతో బీపీఎస్సీ టీఆర్ఈ-4తో సహా పెండింగ్‌లో ఉన్న అన్ని నియామకాలను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.



