బి.వి.యన్.పద్మరాజు
అది 2024.. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారం, ఎలక్షన్ మ్యానిఫెస్టో…అందులోని 12వ పేజీలో ‘పీఎం ముప్తి బిజిలీ యోజన’ కింద దేశంలోని పేద కుటుంబాలన్నింటికీ ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రధాని మోడీ హామీనిచ్చారు. అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణ కు కూడా ఇది వర్తింస్తుందని ఆయన ప్రకటించా రు. ఇది జరిగి రెండేండ్లు. ఇప్పటికీ తెలంగాణలో ని ఒక్క కుటుంబానికి కూడా ప్రధాని చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచిత విద్యుత్ అందలేదు. ఎన్నికలప్పుడు ఇదంతా చేస్తామని చెప్పి.. ఆ తర్వాత ప్రతీ ఇంటిపై సౌర విద్యుత్ ను ఏర్పాటు చేసుకోండి, ఫ్రీ కరెంటు దానంతట అదే వస్తుందంటూ కేంద్రం కొర్రీలేసింది. మరోవైపు వినియోగ దారులకు మెరుగైన విద్యుత్ సేవలంటూనే డిస్కమ్ లను పూర్తిగా విక్రయిస్తోం ది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే వీటిని ప్రయివేటుపరం చేశారు. దీని వల్ల ఇటు వినియోగదారులు, అటు విద్యుత్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే విషయమై పుదుచ్చేరిలో విద్యుత్ ఉద్యోగులు రాజ్ భవన్ కు సైతం కరెంటు తీసేసి తమ నిరసన తెలిపారు. ఇలాంటివి మచ్చుకు మాత్రమే. అనేక వేదికల మీద తెలంగాణకు పలు హామీలివ్వటం, ఆ తర్వాత వాటిని గాలికొదిలేయటం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇప్పుడు మళ్లీ ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 10న ఇక్కడి పరేడ్ గ్రౌండ్‌లో ఆయన ‘అభివృద్ధి’ గురించి మరోసారి మాట్లాడనున్నారు. దాంతోపాటు మహబూబ్‌నగర్‌కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. మరి 2014 నుంచి ఇప్పటిదాకా మోడీ తెలంగాణకు ఇచ్చిన హామీలేంటి..? వాటి పరిస్థితేంటో చూస్తే విస్తుబోవటం ఖాయం.
యూపీఏ -2 ప్రభుత్వం 2013 లో ఆహర భద్రత చట్టం తెచ్చి దేశంలోని 81.31 కోట్ల మందికి రేషన్ కార్డులివ్వాలంటూ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పదమూడేండ్లయినా ఇప్పటికీ అదే సంఖ్య కొనసాగుతోంది. కొత్తగా అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా..జన గణన చేయలేదనే సాకుతో మోడీ సర్కార్ కొత్త కార్డులను మంజూరు చేయనివ్వటం లేదు. ఒకవేళ కొత్తవి ఇచ్చినా వాటికి సంబంధించిన బియ్యాన్ని మీరే సరఫరా చేయాలంటూ రాష్ట్రాల మెడపై కత్తి పెట్టింది. యూపీఏ మంజూరు చేసిన 81.31 కోట్ల మందికి మించి..అదనంగా రేషన్ బియ్యం ఇవ్వలేమని కేంద్రం ఆంక్షలు పెట్టింది. దీంతో ఒకరు చస్తే తప్ప మరో కుటుంబానికి రేషన్ బియ్యం వచ్చే పరిస్థితి లేదు. కుటుంబాలు పెరిగినా, కుటుంబ సభ్యులు పెరిగినా కేంద్రం రేషన్ కోటా పెంచడం లేదు. కొన్ని రాష్ట్రాలు పెరిగిన జనాభా దృష్ట్యా కొత్తగా కార్డులిస్తున్నా…కేంద్రం బియ్యాన్ని సరఫరా చేయటం లేదు. దీంతో తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాలు మార్కెట్ ధరకు బియ్యాన్ని కొని ప్రజలకు ఉచితంగా పంపిణి చేయాల్సి వస్తోంది. దేశంలో 60 ఏండ్లు దాటిన సన్న చిన్నకారు రైతులందరికీ పింఛన్ పథకాన్ని అమలు చేస్తామంటూ 2019 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ ప్రకటించింది. ‘పీఎం కళ్యాణ్ యోజన’ పథకం కింద దేశవ్యాప్తంగా ఈ పింఛన్లను అందజేస్తామని, తెలంగాణకూ ఇది వర్తిస్తుందని ప్రధాని మోడీ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క రైతుకూ పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. దీంతోపాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం సాగుకయ్యే ఖర్చుపై 50 శాతాన్ని కలిపి మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)ను చెల్లిస్తామంటూ 2016 ఏప్రిల్ 14న ప్రధాని తన రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఇది జరిగి పదేండ్లయినా ఎమ్‌ఎస్‌పీ ఎక్కడా కానరావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు తదితరులకు ఆసరా పింఛన్లు ఇస్తున్న సంగతి విదితమే. వీటికి సంబంధించి కేంద్రం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ) కింద ప్రతీనెలా వృద్ధులకు రూ.200, వికలాంగులకు రూ.300 చెల్లిస్తోంది. ఈ మొత్తం పోను మిగతా సొమ్మును కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను అమలు చేస్తోంది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారమే వాటిని కేంద్రం చెల్లించటం గమనార్హం. ఈ సాయాన్ని పెంచుతామని మోడీ వాగ్దానం చేశారు. కానీ దీన్ని పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు రాష్ట్రంలో 42 లక్షల ఆసరా పింఛన్లు ఉండగా.. వాటిలో కేవలం 5 లక్షల మందికే కేంద్రం తన సాయాన్ని అందిస్తోంది. మిగతా 37 లక్షల మందికి కేంద్రం ఇచ్చే వాటాను రాష్ట్ర ప్రభుత్వమే భరించి, పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో 2,722 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపడతామం టూ 2014లోనే పీఎం ప్రకటించారు. ‘భారత మాల’ ప్రాజెక్టులో భాగంగా రూ.38 వేల కోట్లతో వీటిని నిర్మిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు 1,719 కిలోమీటర్లే పూర్తి కావటం గమనార్హం. మోడీ హామీనిచ్చిన పన్నెండేండ్ల తర్వాత పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా 1,003 కిలోమీటర్లు పూర్తి కావటానికి ఇంకెంత కాలం పడుతుందో? తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్)ను ఏర్పాటు చేస్తామన్న ప్రధాని… పొరుగు రాష్ట్రం ఏపీకి ఐఐఎమ్‌తోపాటు ఐఐటీని కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఐఐఎమ్ ఊసే లేదు. నిత్యావసర వస్తువుల ధరలపై 30 శాతం తగ్గింపు, ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు, ప్రతీ ఇంటికీ ఒక ఉద్యోగం, రూ.50కే లీటరు పెట్రోల్, విద్యారంగానికి దేశ జీడీపీలో 6 శాతం నిధుల కేటాయింపు, ప్రతీ ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు తదితరాలు మోడీ ఇచ్చిన హామీల్లో ఉన్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 12 సార్లు తెలంగాణకు విచ్చేసిన ప్రధాని…వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. హైదరాబాద్‌కు ట్రిబుల్ ఐటీ, రాష్ట్రంలోని ప్రాజెక్టుల కు జాతీయ హోదా, వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయాలు (బీఆర్‌జీఎఫ్), కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర విభజన హామీలను సైతం కేంద్రం అటకెక్కించింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు… ఓవర్ హాలింగ్ యూనిట్‌ను మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, చేతులు దులుపుకున్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాబోదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించటం గమనార్హం. వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ… ఈ పాత హామీల గురించి ప్రస్తావిస్తారా? లేదంటే వీటిని పక్కనబెట్టి కొత్త రాగాలు ఎత్తుకుంటారా? వేచి చూడాలి.
వచ్చుడూ..పోవుడే..ఒరిగిందేమీ లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



