అన్నాడీఎంకే రెబల్
ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
మద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన షణ్ముగం
బలపరీక్ష నేపథ్యంలో షణ్ముగం, విజయ్ భేటీకి ప్రాధాన్యం
చెన్నై: తమిళనాడులో నూత నంగా ఏర్పడ్డ టీవీకే ప్రభుత్వం బలనిరూపణ చేసుకో వాల్సిన నేపథ్యంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. అన్నాడీఎంకే నేత, ఎమ్మెల్యే షణ్ముగం ఇంటికి టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ వెళ్లి కలిశారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు షణ్ముగం నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విజయ్‌కు మద్దతు ఇస్తామని షణ్ముగం ప్రకటించిన నేపథ్యంలో ఆయన వర్గంతో విజయ్ సమావేశమయ్యారు. బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌ను బహిష్కరించిన ఏఎంఎంకే
తమిళనాడు ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌ను ఏఎంఎంకే నుంచి బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ వెల్లడించారు. అధికార టీవీకే పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపి, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు పార్టీలోని అన్ని పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు. అతడి విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు కామరాజ్ ద్రోహం చేశాడని విమర్శించారు. అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కామరాజ్ మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే ఏఎంఎంకే అధినేత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
జ్యోతిష్యుడికి కీలక పదవి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఆస్థాన జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవిని కట్టబెట్టారు. రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాలకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విజయ్ ముఖ్యమైన పనులను చేపట్టే ముందు వెట్రివేల్‌ను సంప్రదిస్తారని తెలుస్తోంది. ఇటీవల మే 10న మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారం అనుకున్నప్పటికీ వెట్రివేల్ సూచనతో ముహూర్తాన్ని ఉదయం 10 గంటలకు విజయ్ మార్చుకోవడం విశేషం. తమిళ రాజకీయాల్లో చాలా కాలం నుంచి వెట్రివేల్ చక్రం తిప్పు తున్నారు. దివంగత సీఎం జయలలిత సైతం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈయననే సంప్రదిం చేవారని రాజకీయ వర్గాల్లో ప్రతీతి. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే నేతలకు ఈయన ఆస్థాన జ్యోతిష్యుడిగా మారారు. ఎన్నికలకు చాలాకాలం ముందే విజయ్ జాతకాన్ని విశ్లేషించిన వెట్రివేల్, ఆయనకు రాజకీయాల్లో అదృష్టం కలిసివస్తుందని జోస్యం చెప్పినట్టు తెలిసింది.
ప్రజలకు ఇబ్బంది కలిగించేవారిపై కఠిన చర్యలు: టీవీకే
మరోవైపు ప్రజలకు అసౌకర్యం కలిగించేలా లేదా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో పార్టీల బ్యానర్లు పెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు అధికార టీవీకే పార్టీ నిర్ణయించింది. ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చింది. పార్టీ ప్రచారాల గురించి కాకుండా, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.



