మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని వెట్‌ల్యాండ్స్ (చెరువులు, నీటి వనరులు) పరిరక్షణ, వాటి అధికారిక నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయంలో అంబేడ్కర్ సచివాలయంలో ఆమె అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర వెట్‌ల్యాండ్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెట్‌ల్యాండ్స్ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వెట్‌ల్యాండ్స్ (పరిరక్షణ మరియు నిర్వహణ) రూల్స్ — 2017 నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలనీ, వెట్‌ల్యాండ్స్ సరిహద్దుల గుర్తింపు, డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 12,249 వెట్‌ల్యాండ్స్‌పై గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు సమావేశంలో వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 4,023 వెట్‌ల్యాండ్స్‌కు సరిహద్దుల నిర్ధారణ పూర్తైందని తెలిపారు.
మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వేలను వేగంగా పూర్తి చేసి ”బ్రీఫ్ డాక్యుమెంట్స్” సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. జిల్లా వెట్‌ల్యాండ్ అథారిటీల నుంచి ఖచ్చితమైన నివేదికలు వచ్చేలా శాఖల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఖమ్మం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రధాన వెట్‌ల్యాండ్స్ సహా 28 ప్రాంతాలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమావేశంలో వెల్లడించారు. ఇవి త్వరలో గెజిట్ నోటిఫికేషన్, ప్రజాభిప్రాయ సేకరణ దశలకు వెళ్లనున్నట్టు తెలిపారు. మంజీరా వన్యప్రాణి అభయారణ్యాన్ని అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన రామ్‌సార్ సైట్‌గా గుర్తింపు పొందేందుకు పంపిన ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇరిగేషన్ శాఖ వద్ద తుది అభిప్రాయాల కోసం ఉందనీ, అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు పంపనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సువర్ణ, వైల్డ్ లైఫ్ చీఫ్ వినరు కుమార్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వెట్ ల్యాండ్ పరిరక్షణను వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


