నారాయణపేట నుంచి ముంబైకి వలస వెళ్తున్న కూలీలు
సొంత ప్రాంతాల్లో నమోదు చేసుకోవాలంటున్న నాయకులు
ఎన్యూమరేషన్ ఫామ్స్
ఇక్కడ సమర్పిస్తేనే మేలంట
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలోనూ ‘సర్’ టెన్షన్
గార్డియన్ సంరక్షణలో పెరిగిన వారి పరిస్థితిపై ఆందోళన
వలస
ఓటర్లలో
గుబులు
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది ‘సర్’ ప్రక్రియ. లక్షలాది ఓటర్లలో గుబులు రేపుతున్నది. ప్రజల్లో తమ ఓటు ఉంటుందో ఊడుతుందో అన్న ఆందోళనలున్నాయి. సర్ పేరుతో సంక్షేమానికి మంగళం పాడే అవకాశాలు ఉన్నాయనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితాలో డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, అనర్హుల ఓట్లు తొలగించడం కోసం ఉద్దేశించిన సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కొరవడింది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడాఁకి పడరాని పాట్లు పడుతున్నారు. బూత్ లెవల్ అధికారుల నిబద్ధత పైనే మొత్తం ప్రక్రియ ఆధారపడి ఉందని చెబుతున్నా.. తమగుర్తింపును ఎక్కడ కోల్పోతోమోననే ఆందోళన కూడా ప్రజల్లో నెలకొంది. ముందుగా బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత నింపిన పారాలు ఇవ్వాలని అడిగితే నింపని పేపర్లనే తిరిగి బీఎల్‌ఓలకు ఇస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధానంగా వలసలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడి ప్రజలు ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, పూణె, భీవండి, సూరత్ వంటి పట్టణాలకు వలసెళ్లి పనులు చేసుకుంటారు. కొందరు శాశ్వత ప్రాతిపదికన అక్కడ ఉంటున్నప్పటికీ.. సొంత ఊరిలో పొలం, ఇళ్లు ఉండడం, బంధుత్వాలతో సొంతూరులోనే ఓటర్లుగా కొనసాగుతున్నారు. కొందరికి ఆయా రాష్ట్రాలతో పాటు ఊరిలోనూ ఓట్లు ఉన్నాయి.
ఒకే రాష్ట్రంలో ఉన్న డబుల్ ఓట్లను తొలగించే అవకాశం ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇక్కడి వలస కూలీల ఓటర్లను తొలగించే అవకాశం లేదని చెబుతున్నా… వలసదారులను ఇక్కడ ఓటర్లుగా గుర్తించడానికి తీసుకోవాల్సిన చర్యలు కనబడటం లేదు. వలస ఓటర్లకు రేషన్ కార్డు, ఓటర్ కార్డు రూపంలో పుట్టిన ఊరితో సంబంధాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఆ ఓట్లు తొలగిపోయే అవకాశమున్నది. అక్కడ సెటిల్ అయిన వారు కేవలం సర్ ప్రక్రియపై ఇక్కడికి వచ్చి ఫారాలను సమర్పించే అవకాశం లేదు. దీంతో వారంతా అనర్హులుగా మారుతారనే ఆందోళన నెలకొన్నది.
వలస ఓటర్లను ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. ఇతర రాష్ట్రాలకు అభ్యర్థులు వెళ్లి ప్రచారం చేసేంత ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో వారందరినీ ఇక్కడే ఎన్యూమరేషన్ ఫారం పూరించి ఇవ్వాలని పార్టీలు సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో ఈఎఫ్‌లు పూరించి ఇస్తే తర్వాత ఫామ్-8 ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవడం ఇబ్బందవుతుందని చెబుతున్నారు.
మూడు సార్లు ఓటర్లను కలుస్తారు…
జిల్లాలో సర్ ప్రక్రియను పూర్తి చేయడానికి బీఎల్‌ఓలు మూడు సార్లు ఓటర్లను కలుస్తారు. అప్పటికీ రుజువు కాకపోతే పేర్లు ఓటర్ లిస్టులో ఉండవు. దీంతో అనేక మంది ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది. ప్రధానంగా వలస ఓటర్లు, దీర్ఘకాలికంగా గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలలో స్థిరపడి ఇక్కడే ఓటరుగా నమోదయ్యిన వారికి ఇబ్బందిగా మారింది.
ఇప్పుడు ఓట్లపైనే..తర్వాత..?
జిల్లాలో జరుగుతున్న సర్ ప్రక్రియ ఓట్లకే పరిమితం కాదు. క్రమంగా సంక్షేమ పథకాల కూ వర్తింపజేసే అవకాశాలు న్నాయనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఓటర్ లిస్టు లో పేరు ఉన్నవారికే సంక్షేమ పథకాలని కేంద్రం ప్రకటించే ప్రమాదముందనే చర్చ నడు స్తుంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డును ప్రమాణికంగా చూపుతున్నారు. రాబోయే కాలంలో సర్ ఓటరు కార్డుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తాయేమో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాలు వృత్తి చేయాలి
సర్ కార్యక్రమంతో సామా న్యులు, పేదలు, మైనార్టీల్లో గుబులుంది. సంబందం లేని అంశాలు పొందుప రచాలని చెబుతున్నారు. ఇప్పటికే నాలుగైఐదు సార్లు ఓటు వేసిన వారికి ఇప్పుడు పాత సమాచారం తీసుకరావాలని చెప్పుడం వెనక కేంద్రం కుట్ర దాగుంది. పేదలు, ముస్లిం ఓట్లను తొలగించి బీజేపీ రాబోయే కాలంలో గెలుపును సునాయసం చేసుకోవాలని చూస్తుంది.
-పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి , వనపర్తి
వలస వచ్చిన వారిలోనూ..
ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారే కాకుండా, ఇతర రాష్ట్రల నుంచి వలస వచ్చిన వారు కూడా తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు కూడా సర్-2002 జాబితాలో వారి సంబంధీకుల పేర్లు ఉండవు కాబట్టి ఎలా నిరూపించుకోవాలో తెలియడం లేదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు జీవించి ఉన్నవారికి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, మరణించిన వారి విషయంలో కొంత అయోమయం ఏర్పడుతోంది. గార్డియన్ సంరక్షణలో పెరిగిన వారు తమ తల్లిదండ్రుల పేర్లుగా ఎవరివి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పుట్టగానే అనాధ శరణాలయాల్లో పెరిగిన వారికి గార్డియన్‌గా ఉన్నవారి పేర్లు ఎస్‌ఐఆర్ 2002లో లేకుంటే ఏం చేయాలనే విషయంలో కూడా కొంత సందిగ్ధం నెలకొంది. అలాగే 2002 తర్వాత వివాహం చేసుకుని అత్తవారింటికి వచ్చిన వారు ఇప్పుడు సర్ లో తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలా? లేక అత్తమామల వివరాలు నమోదు చేయాలా? అనే విషయంపై కూడా కొంత అయోమయం ఉంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో 7,27,768 మంది ఓటర్లు ఉండగా..ఇందులో 2,35,275 మంది అనామలీస్‌గా ఫ్లాగ్ చేశారు. గద్వాల జిల్లాలో 5,04,002 మంది ఓటర్లు ఉంటే, 79.12 శాతం మ్యాపింగ్ పూర్తయ్యి..1,54,460 మందిని అనామలీస్ జాబితాలో చేర్చారు. వనపర్తి జిల్లాలో 2,75,570 మంది ఓటర్లు ఉంటే,82 శాతం మ్యాపింగ్ పూర్తి చేసి..97,387 మందిని అనామలీస్‌గా గుర్తించారు. నారాయణపేట జిల్లాలో 4,95,574 మంది ఓటర్లు ఉండగా,84.59 శాతం మ్యాపింగ్ పూర్తయ్యింది. 1,86,544 మందిని అనామలీస్‌గా పరిగణిస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 6,87,595 మంది ఓటర్లు ఉండగా, 76 శాతం మ్యాపింగ్ పూర్తి చేశారు. 2,13,154 మందిని అనామలీస్ జాబితాలో చేర్చారు.
‘సర్’తో సంక్షేమానికి మంగళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


