Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్మిట్ రూముల పేర క్యాంటీన్ల నిర్వహణ

పర్మిట్ రూముల పేర క్యాంటీన్ల నిర్వహణ

- Advertisement -

వైన్స్ క్యాంటీన్ లలో కానరాని క్వాలిటీ
నవతెలంగాణ – పరకాల 

పరకాల పట్టణంల్లోని వైన్స్ క్యాంటీన్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ క్యాంటీన్ల నిర్వహణలో నాణ్యత అన్న పదమే కానరావడం లేదు. మందు బాబుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న నిర్వాహకులు, నాసిరకం ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పరకాల పట్టణంలో ఎనిమిది వైన్స్ లు ఉండగా ప్రతి వైన్ షాపు పర్మిట్ రూముల పేరుతో క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంటీన్లకు ట్రేడ్ లైసెన్సులతో పాటు ఎలాంటి అనుమతులు లేక పోవడం గమనార్హం.

నాసిరకం ఆహారం.. అధిక ధరలు
క్యాంటీన్లలో విక్రయించే చికెన్, మటన్ ముక్కలు ఎప్పుడు వండారో తెలియని పరిస్థితి నెలకొంది. నిల్వ ఉంచిన మాంసాన్నే మళ్ళీ మళ్ళీ వేడి చేసి వడ్డిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. నాణ్యత లేని నూనెలు, హానికరమైన రంగులు వాడుతూ సిద్ధం చేస్తున్న ఈ ఆహారానికి విచ్చలవిడి ధరలు వసూలు చేస్తున్నారు. బయట హోటళ్ల కంటే రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యాడంటూ మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ఈ క్యాంటీన్లో కనీసం మంచి నీటి సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడం విడ్డూరం.

కానరాని సుచీ శుభ్రత
క్యాంటీన్ల పరిసరాలు చూస్తేనే అసహ్యం వేసేలా ఉంటున్నాయి. ఈగలు, దోమల మధ్యే ఆహారం వండటం, ఆయా పర్మిట్ రూములలో మూత్రశాలలు లేకపోవడం మందుబాబులు పరిమిట్ రూమ్ లోపలే మూత్ర విసర్జన చేస్తుడడంతో తీవ్ర దుర్గంధం మధ్య మద్యం సేవించాల్సిన దుస్థితి ఉందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా క్యాంటీన్లలో మురికిగా ఉన్న పాత్రలను వాడటం నిత్యకృత్యమైంది. వ్యర్థాలను ఎక్కడికక్కడ పారబోయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ అపరిశుభ్రత వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అడిగితే దిక్కున్న చోట చెప్పుకో అంటున్న నిర్వాహకులు
ఆహారం బాగాలేదని లేదా ధరలు ఎక్కువగా ఉన్నాయని, పరిసరాలు దుర్గన్నంగా ఉన్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే, క్యాంటీన్ నిర్వాహకులు బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారు. “నచ్చితే తినండి లేకపోతే లేదు.. ఎవరికైనా చెప్పుకోండి, మాకు ఎవరూ అడ్డులేరు” అంటూ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. కొందరు నిర్వాహకులు రాజకీయ పలుకుబడిని చూపిస్తూ వినియోగదారులను నోరు మెదపనివ్వడం లేదంటు పలువురు ఆరోపిస్తున్నారు.

పట్టించుకోని ఎక్సైజ్ & ఫుడ్ సేఫ్టీ అధికారులు
ఇంత జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ గానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే నిర్వాహకులు బరితెగిస్తున్నారని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి చూసి శుభ్రత లేని, నాసిరకం ఆహారం అమ్ముతున్న క్యాంటీన్లపై, అపరిశుభ్రంగా ఉన్న పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

క్యాంటీన్లు నిర్వహించడానికి అనుమతి లేదు: పరకాల ఎక్సైజ్ సిఐ తాతాజీ 
పరకాల పట్టణంలోని వైన్ షాపులలో పర్మిట్ రూములకు మాత్రమే అనుమతి ఉంది. క్యాంటీన్లకు అనుమతి లేదు. పర్మిట్ రుచులలో తగినన్ని మూత్రశాలలు, మంచి నీటి సౌకర్యం కల్పించాలి, పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిబందనలు పాటించని వైన్ షాపులపై చర్యలు తప్పవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -