న్యూఢిల్లీ : పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభం, గగనతల ఆంక్షలు మరియు ఆకాశాన్నంటుతున్న విమాన ఇంధన ధరల నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుండి ఆగస్టు 2026 వరకు 29 అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయడమో లేదా వాటి ఫ్రీక్వెన్సీని తగ్గించడమో చేస్తున్నట్లు ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న అస్థిరత వల్ల తమ కార్యకలాపాల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ సర్దుబాట్లు జరిగినప్పటికీ.. ఐదు ఖండాల్లో తన పట్టును నిలబెట్టుకుంటూ ప్రతి నెలా 1,200కు పైగా అంతర్జాతీయ విమానాలను నడుపుతామని తెలిపింది. ప్రస్తుతం ఉత్తర అమెరికాకు వారానికి 33, యూరప్‌కు 47, బ్రిటన్‌కు 57, ఆగ్నేయాసియా ప్రాంతాలకు 158 విమానాలను నడుపుతున్నామని, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో పటిష్టమైన ఉనికిని కొనసాగిస్తామని ఎయిరిండియా తెలిపింది.



