నవతెలంగాణ-హైదరాబాద్ : హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి నెత్తురు పారింది. కాంగ్‌పోక్పి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు జరిపిన మెరుపుదాడిలో ముగ్గురు చర్చి నేతలు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాష్ట్రంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయా సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి.
థాడౌ బాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు చురచంద్‌పూర్‌లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొని రెండు వాహనాల్లో తిరిగి వస్తున్నారు. బుధవారం కాంగ్‌పోక్పి-చురచంద్‌పూర్ మార్గంలోని కోట్జిమ్, కోట్లెన్ గ్రామాల మధ్య వీరి వాహనాలపై సాయుధ దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వాహనాలను అడ్డగించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో మణిపూర్ బాప్టిస్ట్ కన్వెన్షన్ మాజీ జనరల్ సెక్రటరీ వి.సిట్లౌ, పాస్టర్లు కైగౌలున్ లౌవుమ్, పావ్‌గౌలెన్ సిట్లౌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని ఇంఫాల్‌లోని షిజా ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడి వెనుక జెలియన్‌గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్, లోయ ప్రాంత ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉందని కుకీ సంఘాలు ఆరోపించాయి. చర్చి నేతలను లక్ష్యంగా చేసుకోవడం క్రూరమైన చర్య అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ డిమాండ్ చేసింది.
అయితే, ఈ ఆరోపణలను జెలియన్‌గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది అమానవీయమైన, పిరికిపంద చర్య అని ఓ ప్రకటనలో తెలిపింది. తమ పేరును వాడుకుని కొందరు జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దీని వెనుక నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఇసక్-ముయివా) వర్గం హస్తం ఉండవచ్చని ఆరోపించింది.



