ఫార్ముల ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్,
అరవింద్‌కుమార్,బీఎల్‌ఎన్ రెడ్డి,
కిరణ్‌రావుకు ఏసీబీ కోర్టు నోటీసులు.
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన పార్ముల ఈ కార్ రేస్ కేసును ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే జులై 31తేదీన తమ ఎదుట హాజరుకావాలనీ ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు ఐదుగురు నిందితులకు గురువారం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో ఈ కేసులో ప్రధాన నిందితుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్‌ఎండీఏ మాజీ ప్రత్యేక కార్యదర్శి, ప్రస్తుత మున్సిపల్ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈఓ బీఎల్‌ఎన్‌రెడ్డి, క్రీడల ప్రత్యేక సలహాదారు కిరణ్ మల్లేశ్వర్‌రా వుతో పాటు ఎఫ్‌ఈఓ సంస్థలు ఉన్నాయి. 2023లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పార్ములా ఈ కార్‌రేసు నిర్వహణకోసం హెచ్‌ఎండీఏ రూ. 56కోట్లను లండన్‌లోని ఎప్‌ఈఓ సంస్థకు పంపించి ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందని ఏసీబీ అధికారులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఎలో ఉన్న ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, సీఈఓ బీఎల్‌ఎన్ రెడ్డిలు అంత పెద్ద మొత్తంలో డబ్బులను ఎప్‌ఈఓకు పంపించారనీ ఏసీబీ కోర్టులో వేసిన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ మేరకు కోర్టులో చార్జిషీట్ వేయటమేగాక, కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌లను ప్రాసిక్యూట్ చేయటానికి ఇటు గవర్నర్, అటు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఏసీబీ అనుమతి తీసుకుంది. గత కొంత కాలంగా స్థబ్దంగా ఉన్న ఈ కేసు విచారణను చేపట్టిన ఏసీబీ ప్రత్యేక కోర్టు చార్జిషీట్‌ను పొందుపర్చిన నిందితులను విచారించటానికి కూడా సన్నద్ధమైంది. ఈ మేరకు పై ఐదుగురిని కోర్టులో జూలై 31న హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.



