యూఏఈ పర్యటనలో మోడీ
ఐదు దేశాలు , ఆరు రోజుల టూర్ లో ప్రధాని చర్చలు, సంప్రదింపులకే భారత్ ప్రాధాన్యం
హార్ముజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని స్పష్టీకరణ
అబుదాబి: ఐదు దేశాలు, ఆరు రోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్న ప్రధాని మోడీ.. యూఏఈ అధ్యక్షుడు నహ్యాన్తో శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లటంతోపాటు పశ్చిమాసియా సంక్షోభంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతోపాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌లో మౌలిక సదుపాయాల రంగంలో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్టు యూఏఈ ప్రకటించింది. అలాగే, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యూఏఈతో ఎంవోయూతో ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈపై ఇరాన్ దాడిని మోడీ ఖండించారు.
“పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉంది. అయితే, భారత్ ఎప్పుడూ చర్చలు, సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుంది. చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలి. అదేవిధంగా హర్మూజ్‌పై అంతా అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలి. అలాగే, ఇరాన్, యూఏఈని లక్ష్యంగా చేసుకున్న తీరు ఆమోదయోగ్యం కాదు. కానీ, ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కోవడం ప్రశంసనీయం. భారత్ ఎప్పుడూ యూఏఈతో చేతిలో చేయి వేసే నడిచింది. యూఏఈతో భారత్ అనుబంధం ఇకముందూ కొనసాగుతుంది.” అని ప్రధాని మోడీ చెప్పారు.
ఇంధన భద్రతపైనే ఫోకస్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని ఐదు దేశాల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, యూఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో పశ్చిమాసియా యుద్ధంతో నెలకొన్న పరిస్థితులపై ఇరుదేశాధినేతలు చర్చించారు. అలాగే, యూఏఈలో నివసిస్తున్న 45లక్షల మంది భారతీయుల భద్రతపై చర్చలు జరిపారు. గుజరాత్‌లోని ద్వారక జిల్లా వాడినార్‌లో భారీ నౌకా మరమ్మతుల క్లస్టర్‌ను ఏర్పాటు చేసే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత మౌలిక సదుపాయాల రంగంతోపాటు ఆర్బీఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్‌లో దాదాపు 40వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు యూఏఈ ప్రకటించింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్‌కు యూఏఈ అత్యంత విశ్వసనీయమైన ఇంధన భాగస్వామిగా నిలుస్తుందని ఈ ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి.



