Saturday, May 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌రెడ్డి.. ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం..

రేవంత్‌రెడ్డి.. ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం..

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ సీఎం కాదని, ఆయన ఆర్‌.ఎస్‌.ఎస్‌. సీఎం అని టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వే టు న్యూస్‌ కాంక్లేవ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ, పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కవిత తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్‌ తో తమకు సమస్య లేదన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ ఎస్‌ అధినేతగా ఉన్న ప్రస్తుత కేసీఆర్‌తోనే అసలైన సమస్యలు ఎదురయ్యాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ అంశంలో తన అమ్మతోపాటు కుటుంబం నుంచి కూడా సరైన సపోర్ట్‌ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అంతర్గతంగా చెప్పిన అభిప్రాయాలను బయటపెట్టి బలవంతంగా బయటకు వెళ్లేలా చేశారని వాపోయారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే.. తెలంగాణ రక్షణ సేనదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేయాలన్నదే తన లక్ష్యమని, అలా చరిత్రలో తన పేరు నిలిచిపోవాలని ఆమె ఆక్షాంక్షించారు. చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులతో తనలో మార్పు వచ్చిందని వివరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు.
కేంద్ర మంత్రి బండి సంజరు కుమారుడి మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని తెలంగాణ మహిళలు గమనిస్తున్నారని కవిత ఈ సందర్భంగా విమర్శించారు. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు ఉన్న కేసుల్లో కూడా అరెస్ట్‌ చేయకుండా బండి సంజరు కు రేవంత్‌ రెడ్డి మేలు చేసి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లో ఇప్పటిదాక బండి సంజరు బలమైన నాయకుడిగా ఉన్నారు.. కానీ తన కుమారుడి మీద వచ్చిన ఆరోపణలతో ఒక్కసారిగా ఆయన పరిస్థితి ఎలా మారిందో చూడాలని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో హామీలను అమలు చేయని కాంగ్రెస్‌.. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. అవసరమైనప్పుడు కచ్చితంగా రాష్ట్ర మహిళలు ఆ పార్టీకి బుద్ది చెబుతారని హెచ్చరించారు. తమిళనాడులో విజరు గెలిచినట్టు తెలంగాణలో రానున్న ఎన్నికల్లో తాము కూడా గెలుస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -