మే 18న గ్రామ గ్రామాన పని బంద్కు పిలుపు
నవతెలంగాణ-కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ విధానాలను రద్దు చేసి, 2005 నాటి ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొడ్డు కిషోర్ డిమాండ్ చేశారు.ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. కొత్త విధానాల వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పని ప్రదేశాల్లో యాప్లు, ఫొటోలు వంటి నిబంధనలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కూలీలకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించి, తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు వంటి కనీస వసతులు కల్పించాలని అన్నారు.
ప్రతి కుటుంబానికి 200 రోజుల పని, రూ.600 కూలీ, కూలీలకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల పెండింగ్ వేతనాలు విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం మే 18న గ్రామ గ్రామాన ఉపాధి హామీ కూలీలు పని బంద్ చేసి నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించాలని బొడ్డు కిషోర్ పిలుపునిచ్చారు.



