– భూముల చెరను విడిపించే పనిలో రెవెన్యూ అధికారులు షురూ
– కోట్ల విలువైన ప్రజా ధనాన్ని మింగేయాలని చూసిన భూబకాసురుల ఆటలకు ఇక చెక్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి రెవెన్యూ పరిధిలో సాగుతున్న సుదీర్ఘ అక్రమ దందాకు రెవెన్యూ శాఖ ఎట్టకేలకు చెక్ పెట్టింది. ప్రభుత్వ భూములపై జెండా పాతిన కబ్జాదారుల గుండెల్లో జేసీబీల గర్జన వణుకు పుట్టిస్తోంది. సర్వే నంబర్లు 13, 19 పరిధిలో బరితెగించి ఆక్రమించిన 4 ఎకరాల 19 కుంటల భూమిని రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్న తీరు బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలుకొని గురువారం ఉదయం వరకు సాగింది. కాజేయాలని చూసిన ఆ నేలను అధికారులు చుట్టూ ట్రెంచ్‌లు తవ్వి మరీ ప్రభుత్వ ఖాతాలో చేర్చారు. ప్రభుత్వ స్థలమే కదా.. అడిగే దిక్కు లేదనుకుంటే ఇక పప్పులో కాలేసినట్టే. ప్రభుత్వ స్థలమే కదా అడిగే దిక్కు లేదనుకుంటే పప్పులో కాలేసినట్టే లెక్క అని రెవెన్యూ అధికారులు నిజం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న అక్రమార్కులకు ఈ చర్యతో మైండ్ బ్లాక్ అయింది.
గ్రామకంఠం భూమిని గుటుక్కున మింగేయాలని చూసిన కొందరు కేటుగాళ్ల గుట్టు రట్టయింది. దాదాపు 10 గుంటల గ్రామకంఠం స్థలంలో వెలసిన అక్రమ సామ్రాజ్యాలను జేసీబీలతో ధ్వంసం చేశారు. అక్కడ నిర్మించిన అక్రమ షెడ్లు, ఇల్లీగల్ కట్టడాలను క్షణాల్లో నేలమట్టం చేశారు. ప్రభుత్వ సొమ్మును దోచుకుందామనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు చేతల్లో రుజువు చేశారు. కబ్జాదారుల గుండెల్లో అసలు సిసలైన వణుకు పుట్టిస్తూ తదుపరి వేట కూడా మొదలైంది. వేషకాంతల చెరువును ఆనుకుని ఉన్న 14 ఎకరాల మహా భూమిపై కన్నేసిన వారికి కోలుకోలేని దెబ్బ తగలనుంది.
ఈ 14 ఎకరాలకు కూడా వెంటనే ట్రెంచ్‌లు తవ్వి, హద్దులు గీసి ఇనుప కోటలా భద్రపరచనున్నారు. కోట్లాది రూపాయల విలువైన మరో 36 కుంటల భూమిపై కూడా త్వరలోనే కొరడా ఝుళిపించనున్నారు. చట్టాన్ని చుట్టం చూపుగా భావించి భూములను మేసేసిన కబ్జాకోరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. కేవలం భూములు గుంజుకోవడమే కాదు… ఆక్రమణదారుల వీపు విమానం మోత మోగేలా కఠిన కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఇక జైలు ఊసలు లెక్కించాల్సిందే. ప్రభుత్వ భూమి వైపు కన్నెత్తి చూసినా, మళ్లీ ఆక్రమణలకు పాల్పడినా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల ఈ విశ్వరూపం చూసి సత్తుపల్లిలోని ఇల్లీగల్ దందా లీడర్లు పలాయనం చిత్తగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు సాగుతున్న ఈ వేట మున్ముందు మరింత ఉగ్రరూపం దాల్చనుంది.
ఇకనైనా కబ్జాలు ఆపకపోతే మీ అక్రమ సామ్రాజ్యాలపై జేసీబీలు పరుగెత్తడం ఖాయమని రెవెన్యూ శాఖ అధికారులు సంకేతాలు ఇస్తున్నారు.



