– వాహన తనిఖీల్లో పోలీసులకు పట్టుబడిన వైనం
నవతెలంగాణ – సత్తుపల్లి
ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన లారీ ఒకటి సత్తుపల్లి పోలీసులకు రేషన్ బియ్యం లోడుతో మంగళవారం తెల్లవారుజామున వాహన తనిఖీల క్రమంలో పట్టుబడింది. ఈ బియ్యాన్ని చత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ మోహన్ వర్మన్ విచారణలో తెలిపాడు. రాజమండ్రి, చింతలపూడి, ఎన్టీఆర్ జిల్లాల నుంచి వచ్చిన బడా సేట్లు సత్తుపల్లిలో డేరా వేసి బియ్యం సేకరణకు అడ్వాన్సులు ఇచ్చారు. ప్రతిరోజూ దాదాపు 10 నుంచి 15 వాహనాల్లో ఈ రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో వేరే రాష్ట్రాలకు తరలుతోందని తెలుస్తోంది. పోలీసులు పట్టుకుంటే తప్ప సివిల్ సప్లై అధికారులు ఈ అక్రమ రవాణాపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కిలో రూ. 23 చొప్పున కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, వాటిని రీసైకిలింగ్ చేసి రూ. 70 నుంచి రూ.100 ధరకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు డబ్బులు ఆశ చూపి, తంబ్ వేయించుకుంటూ ఈ మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సత్తుపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేరుతున్న ఈ బియ్యం అక్కడి నుంచి వైజాగ్ పోర్ట్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు తరలుతోంది.
బియ్యం కొనుగోలు చేసే వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు పెరిగి, సరిహద్దుల గొడవలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాయి. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి ఈ బియ్యం మాఫియాను అరికట్టకపోతే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు.



