Thursday, July 16, 2026
E-PAPER
Homeఖమ్మంగత దోపిడీని సరిదిద్ది.. ‘సీతారామ’ను శరవేగంగా పూర్తి చేస్తాం.!

గత దోపిడీని సరిదిద్ది.. ‘సీతారామ’ను శరవేగంగా పూర్తి చేస్తాం.!

- Advertisement -

– డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
– లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చినట్లు బీఆర్‌ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారు
– నీటి పారుదల శాఖ మంత్రి నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి
– యాతాలకుంట సొరంగ కాలువ మార్గాన్ని పరిశీలించిన మంత్రుల బృందం 
నవతెలంగాణ-సత్తుపల్లి
1
గత దోపిడీని సరిదిద్ది  ‘సీతారామ’ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సత్తుపల్లి మండలం యాతాలకుంటకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి యాతాలకుంట సొరంగ కాలువ మార్గాన్ని (టన్నెల్) ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో ప్రజాధనాన్ని పదేళ్లపాటు విచ్చలవిడిగా దోపిడీ చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ, జూలూరుపాడు టన్నెల్‌ను శరవేగంగా పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో  నింపడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచి ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేందుకు ఇందిరమ్మ సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు రూపొందించారని, కేవలం రూ.1,500 కోట్లతో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి సీతారామ ప్రాజెక్టును తీసుకొచ్చిందన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు భూసేకరణ కోసం వెంటనే రూ.135 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామని, అవసరమైన బిల్లులు సిద్ధం చేసి టోకెన్లు వెంటనే పంపాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చినట్లు బీఆర్‌ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారు: ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చినట్లు బీఆర్‌ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల గోదావరి జలాల అనుమతులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వం సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా నిర్మించడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిందని, మిగిలిన రెండు బ్యారేజీలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా తెలిపిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూడు బ్యారేజీల రిపేర్ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ విధానం ప్రకారం వేగంగా చెల్లింపులు చేయాలని నిర్ణయించామని, జిల్లా కలెక్టర్లు, అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

బీఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల శాఖను సర్వనాశనం చేశారని, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి గత పాలకుల హయాంలో నిర్వీర్యమైన ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వడం లేదని అనవసరంగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.

ఒంటి నిండా విషం నింపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్  బురద జల్లుతున్నారు: రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కరువు కాలంలో కూడా గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు అందిస్తూ బేషజాలు లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.  ఒంటి నిండా విషం నింపుకున్న బీఆర్‌ఎస్ నేతలు రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని పవర్‌ఫుల్ నాయకత్వంతో జిల్లాలో మొదలుపెట్టిన అన్ని ఇరిగేషన్ పనులను నిజాయితీగా పూర్తి చేసి తీరుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జునసాగర్ ప్రాజెక్టు, వైరా-లంకసాగర్ ప్రాజెక్టు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో సాధ్యమైనంత మేరకు ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా కరువు కాలంలో కూడా 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని స్పష్టం చేసిన మంత్రి, గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను డిజైన్ మార్పుల పేరుతో తాత్సారం చేయకుండా వేగంగా పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, జారే ఆదినారాయణ, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్, ఖమ్మం సీపీ సునీల్ దత్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత, సత్తుపల్లి,  కల్లూరు ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్ బాబు, బాగం నీరజదేవి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వైసీపీ వసుంధర యాదవ్ ఫారెబి, ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎన్పిడిసిఎల్ డైరెక్టర్ వి. మోహన్ రావు, ఇరిగేషన్ సీఈలు శ్రీనివాస రెడ్డి, ఎం. వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ యుగంధర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -