పుత్రికోత్సాహము తలిదండ్రులకు
పుత్రిక జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రికని గనుగొని పొగడగ
పుత్రికోత్సాహంబు నాడు పొందెదరు సుమతీ!
నేను రాసింది పద్యం కాదు. నాకు పద్యం రాయడం రాదు. అది రాజులకాలం నాటి, భూస్వామ్య కాలం నాటి ప్రక్రియ. అప్పుడేం రాసినా పద్యాల్లో ఉంటుంది కాబట్టి చదువుకుంటాం కాని ఇప్పుడున్న కొత్త ప్రక్రియల్లో రాస్తాం. మహాకవులు మనకు అదే మార్గం చూపించారు కూడా. అదీ కాక అప్పుడు పితృస్వామ్య వ్యవస్థ అందుకే పుత్రోత్సాహము అన్నారు. మనం పుత్రికోత్సాహం అని మార్చుకోవాలి. ఇప్పుడు పుత్రికైనా, పుత్రుడైనా ఒకటే. ఇంకా చెప్పాలంటే పుత్రికే నయం అనే రోజుల్లో ఉన్నాం. అది ఎవరి ఇష్టాఇష్టాలనుబట్టి ఉంటుంది, ఎవరి అనుభావలనుబట్టి వారికి అభిప్రాయాలుంటాయి. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, సమర్ధింపులుంటాయి, సర్దుబాట్లుంటాయి. జనూలా పుత్రుని కనుగొని పొగడగ అని సుమతి శతకం పద్యంలో ఉంది కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఆ పుత్రులను వివిధ పరిస్థితుల్లో కనుగొంటున్నారు.
ఐనా వాళ్ళు పొగడడం లేదు. ఆ పుత్రులు పొగిడించుకునే స్థితిలో లేరు. తలిదండ్రులు మాత్రం పొగుడుతున్నారు, వెనకేసుకొస్తున్నారు. కొడుకైతే చాలు, మావాడు మంచోడు నోట్లో వేలు పెట్టినా కొరకడు, వేలు తీసెయ్యండంకుల్ అంటాడే తప్ప అసలు నా నోట్లో వేలెందుకు పెట్టారంకుల్ అనే రకం కూడా కాదు అని బుకాయిస్తారు. తామెక్కడున్నది, ఏమి మాట్లాడుతున్నది పక్కనబెట్టి తమ కొడుక్కు తామే స్కూళ్ళలో ఇచ్చే సర్టిఫికేట్ లాగ అసలిలాంటి పిల్లోడు బూతద్దం, మైక్రోస్కోపులాంటివి పెట్టి వెదికినా దొరకడు అని కితాబులిస్తారు. వాడేమో పోలీసులకు దొరికిపోయుంటాడు. వెంటనే అది రాజకీయ కుట్రగా మారిపోతుంది. ఇప్పుడంతా రాజకీయం నడుస్తోంది మరి. ఇంతమందికి కొడుకులుండగా నా కొడుకు మీదే ఈ అభియోగాలేమిటి భయ్యా అని ఎక్కడికిపోయినా అరుస్తారు.
తోటకూరనాడే అన్న కథ చాలామంది వినే ఉంటారు. ఐనా ఒక్కసారి యాద్ చేసుకుందాం. ఓ పిల్లోడు ఎవరిదో తోటకూర దొంగిలించి తెచ్చి అమ్మకిచ్చాడట. అమ్మ మెచ్చుకొని దాంతో వంటవండి పెట్టింది. అలాగే వాడు అవీ, ఇవీ దొంగిలిచి తెచ్చి చివరికి పెద్ద దొంగైపోతాడు. పెద్ద బందిపోటుగా మారి హత్యలు కూడా చేస్తాడు. రాజు వాడికి మరణదండన వేస్తున్నాను చివరికోరిక ఏమైనా ఉందా అంటాడు. మా అమ్మను ఒక్కసారి చూసి మాట్లాడాలి అంటే పిలిపిస్తారు. వాళ్ళమ్మ చెంప ఛెళ్ళుమనిపిస్తాడు. తోటకూరనాడే నేను చేసే పని తప్పు అని చెప్పి ఉంటే నేనింత పెద్ద దొంగనయ్యేవాడిని కాదు కదా అని ఏడుస్తాడు. ఇది కథే కావచ్చు, జరిగింది కూడా కావచ్చు. అలా తోటకూరనాడే కొడుకును బాగా చూసుకొని ఉంటే బాగుండేది కదా!
వెయ్యి సీసీ బైకు అడిగితే ఇంకా పెద్దది కొనిస్తారు. యాభై లక్షల కారు అడిగితే కోటిరూపాయలది ఇప్పిస్తారు. వాడెక్కడో ప్రమాదంలో పోతాడు.
అప్పుడు బాధపడి ఏమిటి లాభం. అటు సమాజానికి, ఇటు కుటుంబానికి ఎంతటి నష్టం? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కొన్నబండికంటే మనది బాగుండాలన్న ఒక్క ఫార్ములా ఎంతవరకు తెస్తుంది. వాడోక్కడే పోకుండా ఇంకా మిత్రులను, ఇతర వాహనాల వాళ్ళను కూడా పరలోకానికి తీసుకుపోతాడు. పబ్బులు, రేసులు, మత్తు మందులు ఇలా ఎన్ని ఉంటే అన్నింటిలో మనోడు ఫస్టు ఉంటాడు ఒక్క చదువులో తప్ప. పిల్లోడంటే ప్రేమ ఉండాలి పిచ్చి ప్రేమ కాదు. తాము కుదురుగా చెప్పలేనప్పుడు మంచి విషయాలు చెప్పే మిత్రులు, బంధువులు ఉంటారు. వాళ్ళతో చెప్పించాలి. ఇవన్నీ వదిలేసి ఆసుపత్రిలోని ఐ.సి.యు దగ్గర బాధపడితే ఫలితమేమీ ఉండదు. జాగ్రత్తరా కన్నా అని చిన్నప్పుడు మూడు గానుల సైకిలిచ్చినప్పటినుండే నేర్పించాలి. మాకూ తెలుసు పిల్లల్ని పెంచడం అని సలహాలిచ్చేవాళ్ళతో అంటే ఇంక వాళ్ళూ మానుకుంటారు చెప్పడం.
ఓ సినిమాలో తప్పు జవాబు రాసిన విద్యార్థిని పట్టుకొని అధ్యాపకుడు ప్రశ్నిస్తుంటాడు. ఈలోగా ప్రిన్సిపాలు అటువైపుగా వస్తాడు. ఇందులో ప్రవేశించి పేపర్ చూసి పిల్లోడు రాసిన సమాధానమే కరెక్టు, నీ ప్రశ్నే తప్పు అని తీర్పు చెప్పి పోతాడు. అది జోకుగా అనిపించొచ్చు నవ్వుకోడానికి బాగుంటుంది. ఆ విద్యార్థి కాలేజి పెట్టినతని కుమారుడే కావచ్చు కూడా. ఇక్కడ నష్టపోయేది వాడే, అధ్యాపకుడు కాదు. వాడిని అక్కడే మందలించి బాగుచేస్తే చిన్న రిపేరుతో వాడి గాఢి జీవితకాలం సాఫీగా సాగిపోతుంది..
పైన పద్యంలాంటిది రాసుకున్నప్పుడు కూతురైనా, కొడుకైనా వాళ్ళని సక్రమంగా పెంచి పెద్దచేస్తే ఆ ఊరికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తెస్తారు. వాళ్ళమీద అతి ప్రేమ ప్రదర్శించి, గోము చేస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. యువతా దివస్ అని, స్వతంత్రదినమని, రిపబ్లిక్ దినోత్సవమని విద్యార్థులకు, యువజనులకు బోధలు చేసే నాయకులే వాళ్ళకు మాఫియాల ద్వారా మత్తుమందులు, ఇతర అలవాట్లు నేర్పిస్తుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని ప్రశ్నించే గురజాడ ఇప్పుడు లేడు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అన్న మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు లేడు. ఐతే వాళ్ళ మాటలు నిలిచిపోయాయి. అలాగే ఇలాంటివాటిని ఆపేవరకు విశ్రమించమనే యువతా ఉన్నారు. వాళ్ళే కాపాడాలి దేశాన్ని.
జంధ్యాల రఘుబాబు 9849753298



