సర్ తొలగింపులు, ఈవీఎంలు, ఓట్ల లెక్కల్లో తికమకలూ ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాయని బీజేపీయేతర పార్టీలే గాక స్వతంత్ర పరిశీలకులు, మాజీ ఎన్నికల కమిషన్ అధికారులు కూడా అంగీకరిస్తున్న పరిస్థితి. ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల ఎన్నికలతో ఇది పరాకాష్టకు చేరింది. మిగిలిన వారంతా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఎన్నికల సంఘంతో పొత్తు పెట్టుకుందని ఒక సరదా రాజకీయ వ్యాఖ్య మీడియాలో కనిపించింది. ఇక పార్లమెంటుల ోనైతే ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిశంసన తీర్మానమే ప్రతిపాదించబడింది. ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళన పేరుతో సర్‌పై జరిగిన చర్చలోనూ ఎన్నికల కమిషన్ పాత్ర పదే పదే విమర్శకు గురైంది. తాజా ఎన్నికలలో సర్ తొలగింపుల వల్లనే ఓడిపోయామం టున్నవారి పిటిషన్లను విచారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సూత్రప్రాయంగా అంగీకరించారు కూడా. 2024 నుంచి ఇప్పటి వరకూ గత మూడేళ్లలో ఈ అంశం కోర్టు ఎదుట అనేక రూపాల్లో వస్తూనే వుంది. సరిగ్గా ఇలాంటి తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)తో పాటు కమిషనర్ల నియామక ప్రక్రియ కూడా అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండడం ఆసక్తికరమే గాక అనివార్య పరిణామం కూడా.దానిపై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మరింత కనువిప్పుగా వున్నాయి. ఎట్టి పరిస్తితులలోనూ ఎన్నికల వ్యవస్థ(సంఘం)పాలక పక్షానికి లోబడివుండే పరిస్థితి మంచిది కాదని జస్టిస్ దీపాంకర్ దత్తా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
వివిధ కమిటీల సిఫార్సులు
రాజ్యాంగంలో 324(2) అధికరణం సీఈసీని, ఈసీల నియామకాన్ని నిర్దేశిస్తున్నది. ప్రధాని సిఫార్సుపై రాష్ట్రపతి వారిని నియమిస్తారని ఈ అధికరణం చెబుతుంది. అయితే రాజ్యాంగం మౌలికంగానైతే పార్లమెంటు ఈ నియామకాలు జరపాలని నిర్దేశించింది, ఆచరణలో అది మంత్రివర్గ నిర్ణయంగా మారింది. ఎన్నికల కమిషనర్లపై ఒత్తిడి చేస్తున్నారనే కారణంగా వివిధ కమిటీలు కమిషన్లు రకరకాల మెరుగుదలకు సిపార్సులు చేశాయి. 1972లో పశ్చిమబెంగాల్‌లో సీపీఐ(ఎం)ను అడ్డుకోవడం కోసం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర బలగాలను దింపి ఎన్నికలను బూటకంగా మార్చివేసిన తర్వాత ఈ విషయంలో మరింత విమర్శ పెరిగింది. 1975లో జయప్రకాశ్ నారాయణ్ నియమించిన అనధికార తార్కుండే కమిటీ సీఈసీ నియామకంపై కొన్ని కీలక సిఫార్సులు చేసింది. 1990లో విపి సింగ్ ప్రభుత్వం హయాంలో నియమించబడిన గోస్వామి కమిటీ కూడా ముగ్గురితో ఎంపిక కమిటీ వుండాలనే చెప్పింది. సాహసోపేతంగా వ్యవహరించి అనేక మార్పులకు కారణమైనాడని అదేపనిగా ప్రశంసలు అందుకునే మాజీ సిఇసి టిఎన్ శేషన్ ఏకపక్ష దోరణులను నివారించడం కోసం మొదటిసారిగా 1991లోనే మరో ఇద్దరు కమిషనర్లను జోడించడం జరిగింది. వారి నియామకాన్ని కూడా శేషన్ గుర్తించడానికి నిరాకరిస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని సరిదిద్దాల్సి వచ్చింది. ఇది గత చరిత్ర. కాకపోతే ఆ బిల్లులో ఒక లోపమేమంటే నియామక ప్రక్రియకు సంబంధించి నిర్దిష్టమైన నిర్దేశం లేదు. దాంతో రాష్ట్రపతి నియమించే పద్దతి కొనసాగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే 2002, 2007లలో నియమితమైన వివిధ పాలనా సంస్కరణల కమిటీలు సీజేఐ కాకుండా లోక్‌సభ రాజ్యసభల సభాపతులో ఉపసభాపతులో వుండాలన్నాయి. ఈ సిఫార్సులన్నీ కూడా కేంద్రం ఇష్టానుసారం సీఈసీని నియమించి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా అడ్డుకోవడానికి విస్త్రత ప్రాతిపదిక కల్పించడం కోసమే వచ్చాయి. 2015లో జాతీయ లా కమిషన్ తార్కుండే గోస్వామి కమిటీలు చెప్పినట్టే సీఈసీ ఎంపిక కోసం ప్రధాని ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తిలతో కమిటీ వుండాలని చెప్పింది.
విధేయ కమిషనర్లు
మోడీ ప్రభుత్వ హయాంలో మిగిలిన వ్యవస్థలలాగే ఎన్నికల సంఘానికీ గ్రహణం పట్టింది. పదవీ విరమణ చేయబోయే అనుకూల అధికారులకు వీఆర్‌ఎస్ ఇప్పించి ఇక్కడ నియమించడం రివాజుగా మారింది. తన ముందు దాఖలైన పిటిషన్లను విచారించే క్రమంలో దీన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 2023లో అనూప్ బనర్‌లాల్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఈ నియామకం ఎలా జరగాలో పార్లమెంటు నిర్దిష్టంగా నిర్ణయించేవరకూ ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, సిజెఐలతో కూడిన కమిటీయే సీఈసీని, ఈసీలను ఎంపిక చేయాలని ఆదేశించింది. క్యాబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పడే అన్వేషణ కమిటీ అయిదు పేర్లను ఈ త్రిసభ్య కమిటీ ముందుంచితే వారు సీఈసీని, ఈసీలను ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సుకు చేయాలని చెప్పింది, ఈ విషయమై కోర్టు తుది తీర్పు ఇచ్చేలోగా పార్లమెంటు ఆదరాబాదరాగా నియామక ప్రక్రియ బిల్లు తీసుకొచ్చింది. అందులో సీజేఐ వుండాలనే సూచనను మార్చేసింది. ప్రధాని, అతి పెద్ద ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నియమించే కేంద్రమంత్రి ముగ్గురూ వుండాలని చెప్పింది. ఈ 2023 చట్టంలో అతి పెద్ద సమస్య ఏమంటే సీఈసీని, ఈసీని వారి తప్పొప్పులకు గాను ఎలాటి చర్య తీసుకునే అవకాశం లేకుండా మినహాయింపు కల్పించింది. వారిని తొలగించాలంటే జడ్జిల విషయంలో వలెనే 150 మంది ఎంపిలు సంతకం చేసి ఆభిశంసన తీర్మానం ఆమోదింపచేసుకోవలసి వుంటుంది. దాంతో నియామకంపైనా తర్వాత వారి నిర్వాకాలపైనా కూడా ఎవరికీ ఎలాటి అదుపు లేకుండా పోయింది. 2024 ఎన్నికలలో ఈవీఎంల వినియోగం, ఓటింతు వేళల నమోదు, భద్రపర్చడం, లెక్కింపులో సమస్యలు దేనికీ సమాధానం లేకుండా పోయింది. ఎందుకంటే పార్లమెంటు ఒక చట్టం చేశాక కోర్టు కాదంటే తప్ప అదే అమలవుతుంటుంది. సీఈసీ నియామకం అయితే చట్టం తీరు సుప్రీం కోర్లు చెప్పిన స్పూర్తికి విరుద్దంగా వుందని కోర్టులో సవాలు చేసినా విచారణ సాగుతూ వచ్చింది. ఈ లోగానే ఈసీలో ఖాళీలు వచ్చాయంటూ 2024 మార్చిలో అప్పుడే పదవీ విరమణ చేసిన గ్యానేష్ కుమార్‌ను, డా.వీవేక్ జోషీని కమిషనర్లుగా తీసుకున్నారు. కొన్నాళ్లలోనే సీఈసీ పదవీ కాలం ముగియడంతో గ్యానేష్ కుమార్‌కు ఆ పదవి దక్కింది. ఆ తరుణంలోనే జరుగుతున్న లొసుగులను ఎత్తిచూపిన అశోక్ లావాసా అనే ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసి బయిటకు వచ్చేయడంతో ఆ ఖాళీని కూడా భరితీ చేశారు.తర్వాత జరిగిన పరిణామాలు చూస్తున్నవే.
జస్టిస్ దీపాంకర్ వ్యాఖ్యలు
ఈ పూర్వరంగంలోన మే 15వ తేదీన సుప్రీం కోర్టు విచారణలో జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ పెత్తనంలో వుండకూడదని ఆయనన్నారు. 1950 నుంచి సుప్రీం కోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్పూర్తి ప్రకారం ఎన్నికలు న్యాయంగా స్వేచ్చగా జరగాలి. ఈసీ స్వతంత్రంగా వుంటనేఅది సాధ్యపడుతుందని తీర్పులన్నీ చెబుతూ వస్తున్నాయి. త్రిసభ్య కమిటీలో మీరు ప్రదాని ఎంపిక చేసిన కేంద్రమంత్రిని నియమిస్తే ఫలితం ఏమిటి? ఆయన ఆ బృందంలోనే సభ్యుడై వుంటారు కదా? మొత్తం 300 మంది ఎంపిలలో 25మందిని మంత్రులుగా ప్రధాని తీసుకుంటారు. మళ్లీ అందులో ఒకరిని తెచ్చి ఇక్కడ పెడతామంటారు. ఆ మంత్రి ప్రధాని మాట కాదనే ప్రసక్తి వుంటుందా? ఇక ప్రతిపక్ష నేత పాత్ర ఏమిటి? ప్రభుత్వం తరపు వారు ఇద్దరైతే ఇక ప్రతిపక్ష నేత మాట ఎలా చెల్లుతుంది? ఎప్పుడూ ఎంపిక కమిటీలో 2-1 నిష్పత్తి వుంటే నిష్పాక్షికంగా నియామకం ఎలా సాధ్యం? ఈవిధంగా ఎన్నికల సంఘం స్వతంత్రతను అడ్డుకోవడమేంటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
జస్టిస్ దీపాంకర్ వ్యాఖ్యలు కేంద్రం ఏకపక్ష సమర్థన
అటార్నీ జనరల్ వెంకటరమణి అడ్డు తగులుతూ ఆ కమిటీ నియమించినంతమాత్రాన ఎన్నికల కమిషన్ స్వతంత్రత కోల్పోతుందని మీరెలా చెప్పగలరని అడ్డు సవాలు విసిరారు. సుప్రీంకోర్టు మరో పార్లమెంటు సభగా ఆరిపోరాదని వ్యాఖ్యానించారు. ఏదో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే పార్లమెంటు చట్టాలు చేయాలని పిటిషనర్లు భావించరాదని కూడా తీసిపారేశారు. అనూప్ బన్వర్‌లాల్ కేసులో చెప్పింది ఒక మధ్యంతర ఏర్పాటు మాత్రమేనని, తుచ తప్పకుండా దాన్నే అనుసరించాలిస్న అగత్యం లేదని వాదించారు. దానిపై న్యాయమూర్తి ఃమీరు రాజ్యాంగం తర్వాత అంత ముఖ్యమైందిగా పరిగణించే చట్టం ఏమిటనిః ఆయన ఎజి వెంకటరమణికి ప్రశ్న వేశారు. తన ఉద్దేశంలో ఎన్నికల చట్టాలే అంత కీలకమైనవని తానే సమాధానమిచ్చారు. ఒక దశలో ధర్మాసనం ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించడం మంచిదనే సూచన కూడా వచ్చింది. అయితే 2023 చట్టాన్ని మామూలు తరహాలో సవాలు చేయడం తప్ప రాజ్యాంగపరమైన సమగ్ర ప్రశ్నల జోలికి తాము వెళ్లడం లేదని పిటిషనర్ స్పష్టం చేశారు. 2024లో అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు విచారణ ప్రారంబించబోతుందగా ఆఘమేఘాల మీద గ్యానేస్ కుమార్ నియామకం జరిగిందని పిటిషనర ఆరోపించారు. దాంతో వారి నియమకాల రికార్డులు సమర్పించవలసిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. సీబీఐ డెరెక్టర్, కేంద్ర సమాచార ప్రదాన కమిషనర్‌వంటి నియామక కమిటీలలో సీజేఐ సభ్యులైనప్పుడు ఎన్నికల కమిషనర్ విషయంలో మాత్రం మరోలా ఎందుకు చేయాలని ప్రశ్నించారు. అయితే సీఈసీ, ఈసీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దేశం తీవ్రమైన పరిస్తితులు ఎదుర్కొన్న ఉదంతాలేమీ లేవు గనక అనవసరంగా కంగారు పడనవసరంలేదని ఎజి వింతవాదన చేశారు. అంటే ఆయన దృష్టిలో ఇప్పుడు సర్‌పై జరుగుతున్న పోరాటం, ఈవీఎం వివాదాల వంటివి లెక్కలోనే లేవన్న మాట. అంతేగాక కేంద్రం అధికారికంగా సమర్పించిన అఫిడవిట్‌లోనైతే అసలు సీజేఐ ఆ ఎంపిక కమిటీలో వుండాలని ఎక్కడాల ఏదని కొట్టిపారేశారు. ఏదైనా తప్పుంటే కోర్టు చూసే అవకాశమున్నదా లేదా అనేది సమస్య తప్ప చట్టం ఎలా చేయాలో కోర్టు చెప్పజాలదని వాదించారు. మొత్తంపైన చూస్తే ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికల సంఘాన్ని తనకు నచ్చినవారితో నింపడం కొనసాగిస్తుందని స్పష్టమవుతుంది.
చివరికి ఏమైనా? అయిదు రాష్ట్రాల ఎన్నికల అవకతవకలపై పిర్యాదులే గాక మలి విడత సర్‌కు ఇసి పూరితిగా సిద్ధమవుత్నున తరుణంలోనే సుప్రీం ముందుకు ఈ కేసు రావడం గమనించదగింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో తొలగింపులు భారీగా జరిగాయి. అక్కడ ఓటమి తేడా తొలగించిన ఓట్ల కన్నాతక్కువ గా వుంటే మళ్లీ విచారణకు రమ్మని అప్పట్లో సీజేఐ సూర్యకాంత్ హామీ ఇచ్చారు. 30 సీట్లలో ఆ విధంగానే సర్ వల్ల ఓడిపోయామంటూ తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా వాటిని ఎన్నికల పిటిషన్టుగా విచారిస్తామన్నారు. ఈ విచారణ ఎప్పుడు ఎలా జరుగుతుందో చూడవలసే వుంది. ఈ లోగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలోసర్ సర్కస్ మళ్లీ మొదలవుతున్నది. ఏపీ తెలంగాణల్లో కూడా ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయంటున్నారు. ఇప్పటి వరకూ జరిగిన అనుభవాలు చూశాక ఇది ఎలా జరుగుతుందనేది పెద్ద సవాలుగానే మారింది. వామపక్షాలు కాంగ్రెస్ వైసీపీ బిఆర్‌ఎస వంటివి ఈ అంశంపై అప్రమత్తత తప్పదని భావిస్తున్నాయి. సర్ విషయంలో సుప్రీం కోర్టు ఇంతవరకూ సంతృప్తికరమైన విచారణ జరిపి సరైన ఉత్తర్వులు ఇవ్వలేదు, మరి సీఈసీ ఈసీల నియామకంపై కేంద్రం పెత్తనాన్ని గురించి చేసిన వ్యాఖ్యలైనా తుది ఉత్తర్వుల్లో పొందుపరుస్తుందాలేదా చూడాలి.
తెల్లకపల్లి రవి



