వీళ్లకంటే దొంగలు నయం. మోసగాళ్లూ నయమే. వాళ్లేమీ, మేము గొప్ప వాళ్లమని, పవిత్రులమనీ కితాబులిచ్చుకోరు. వీళ్ళు మాత్రం చాలా ప్రమాదం. అవసరార్థం పలికే మాటలకు, అసలు ఆచరణ సిద్ధాంతాలకు పొంతనే ఉండదు. చిన్నపుడు నక్క, తోడేళ్ల కథలు గుర్తుకు వస్తుంటాయి, వీళ్లను చూస్తుంటే! ఇంత నిస్సిగ్గుగా రెండు నాల్కలను ఎలా ఉపయోగిస్తున్నారో జాగ్రత్తగా గమనిస్తే, మనకే సిగ్గేస్తుంది. ఇంత దరిద్రులను, నీతిమాలిన వారిని, నిజాయితీలేని మనుషులను నాయకులుగా చూస్తున్నందుకు, పరిపాలకులుగా ఉన్నందుకు, మనమే ఎన్నుకున్నం దుకు. ప్రజలు గమనిస్తున్నారనే భయంకూడా వారికి లేదు. ఇంకా మాట్లాడితే, దబాయింపుకూ దిగుతారు. వీరి రెండు నాల్కల మోసపు మాటలను సమర్థించే వంది మాగాదులే కాదు, సామాజిక మాధ్యమంలో చెల్లింపు సైన్యం ఒకటి ఉందిలే, వాళ్లు, వీళ్లేమి చేసినా వెనుకేసుకొస్తారు. వీళ్లేకాదు, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ వ్రాతగాళ్లూ అమ్మకమయిపోయాక, అంతా భజన… మేథోభజన….
ఇక రెండు నాల్కల మోసాలను చూద్దాం. బీహార్ రాష్ట్రంలో కొత్తగా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మిథిలేష్ తివారి చేసిన వ్యాఖ్యలు వింటే, ఇతను మతిలేని తివారి అని అనుకోలేం. సరైన మతితోనే, వారి నిజమైన ఆలోచనలనే చెప్పాడు. ఏంచెప్పాడో తెలుసా! ”అసలు అమ్మాయిలకు చదువుకోవలసిన అవసరం ఏముంది! వాళ్లు ఇంట్లోనే ఉండాలి. మన కుమార్తెలు మన ఇంటి బలం. మన సంపదకు పునాదులు. మహిళల సాధికారత కోసం మోడీ నిలుచుండగా మన కుమార్తెలు వీధుల్లోకి రావలసిన అవసరం ఏముంది?” అని బహిరంగంగానే సెలవిచ్చారు. ఇదీ సంఘపరివార శిష్యగణం మెదడులో పాతుకుపోయిన మనువాద భావజాలం. దేశ ప్రధాని శ్రీ మహాన్ మోడీ గారు ఇచ్చిన బేటీ పడావ్ నినాదం అసలు తాత్పర్యం తివారి గారు చెప్పారన్నమాట.
అసలే బీహార్ రాష్ట్రం బాలికల విద్యలో తీవ్రంగా వెనుకబడి ఉంది. ఇక ఈ విద్యామంత్రి మరింత వెనుకబాటును పెంచేట్టు ఉన్నాడు. ఇక అందులోని మరో వాక్యం ‘బేటీ బచావ్’ ఇది కూడా మోడీ గారే స్వయంగా నినాదించారు. కాపాడండీ అంటూ రోడ్డెక్కిన రెజ్లర్లను కాపాడలే. కతువా ఘటనలో బచ్ పాయా! ఉన్నావ్‌లో కాపాడలే. మొన్న ఢిల్లీ, హర్యానాల్లోనూ కాపాడలే. మణిపూర్‌లోనూ కాపాడలేదు. కాపాడకపోగా కాపాడే ప్రయత్నం చేస్తున్న వారినే అంతమొందిస్తున్నారు. ఇక ఇప్పుడు బండి భగీరథుని విషయమూ తీసుకోండి. సాక్షాత్తూ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజరు తనయుడు, ఒక మైనరు బాలికపై లైంగికదాడి నేరం చేస్తే, తిరిగి అమ్మాయిపైనే కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొడుకును తండ్రి వెనకేసుకొస్తున్నాడు. ఆ తండ్రికి మోడీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
కూతుళ్లను కాపాడే నినాదం, ఆచరణ ఇలా ఉంది. సామాన్యుడైతే రోడ్డు మీదనే కాల్చిపడేసే పోలీసులు పది రోజులైనా నేరస్తున్ని పట్టుకోలేక పోతున్నాయి. అధికార కాపలా! ఇక నటసార్వభౌముడు వాక్ చతురరత్న మన మోడీ గారు ఒక ఉచిత సలహా ఇచ్చారు. అదీ ఐదురాష్ట్రాల ఎన్నికలయి ఫలితాలు వెలువడ్డాక. మీరు బంగారం కొనకండి. విహారయాత్రలు మానండి. దుబారా ఖర్సులు చేయకండి. పొదుపు పాటించమని ప్రజలను కోరారు. యుద్ధం వల్ల సంక్షోభం రానుందని హెచ్చరించారు. తానుమాత్రం వెంటనే ఐదుదేశాల విహారానికి వెళ్లారు. ఫోటోషూట్ ఎప్పటిలానే. ఇక ఎనిమిది వేల కోట్ల విమానం ఆయనకు ప్రత్యేకం. ఆయన వేసుకునే కోట్లకే అనేక కోట్ల ఖర్చు. మంత్రులకు బోలెడన్ని కార్లతో కాన్వారులు. అసలు ఏ అధికారం, పదవి లేని, వారి సంఘ్ అధిపతి మోహన్ భగవత్‌కు జెడ్ కేటగిరి రక్షణ, ముప్పయి కార్లతో కాన్వారు. వీటి రోజు ఖర్చులు లెక్కలోకి రాదు! అందుకోసమే కవి అన్నట్టు, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.
ఆయన గారు పొదుపు మంత్రం వల్లించడానికి పదిరోజుల ముందు ఎన్నికలలో గెలవడానికి ఎన్ని హెలికాప్టర్లు? ఎంతడబ్బు ఖర్చు చేసారు! నీతులేమో జగానికోసం, అవినీతి, తమ ప్రయోజనం కోసం. ఇక ఎన్నికల ముందువరకూ చమురు ధరలు పెంచేది లేదన్నారు. ఇప్పుడు పెంచారు. ఏం పెంచితే తప్పేంటని దబాయింపు కూడా. రాజ్యాంగం ప్రకారం ఎన్నికయి, కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తారు. రెండోవైపు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడతారు గాంధీకి దండవేసి దండంపెడతాడు. గాడ్సే మహా దేశభక్తుడని కొలుస్తారు. ఒక్కటేమిటి! ఇలా ఎన్నయినా చెప్పుకుపోవచ్చు. ముందు ఒకటి, వెనకొకటి, ఇది ఇప్పటిదేకాదు, వందేండ్ల నుండీ సాగుతున్న మేకవన్నెపులి మోసాలు!
రెండునాల్కల మోసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



