ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ కు బెయిల్ నిరాకరణను అంగీకరించలేం
2021లో విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును అనుసరించలేదు.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ’’ కింద నమోదైన కేసుల్లోనూ బెయిల్ పొందడం ఒక నియమమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ కు బెయిల్ నిరాకరిస్తూ జనవరిలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూఏపీఏ కేసుల విచారణలో తీవ్ర జాప్యం, విచారణకు ముందు సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం వంటి సమయాల్లో బెయిల్ మంజూరు చేయవచ్చని, 2021లో కెఎ నజీబ్ కేసులో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఈ తీర్పును జనవరిలో బెయిల్ పై తీర్పు ఇచ్చిన సమయంలో ధర్మాసనం సరిగా అనుసరించలేదని పేర్కొంది. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది ధర్మాసనాలు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మాదకద్రవ్యాల సరఫరాతో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ అయ్యి, ఆరేండ్లుగా జైలులో ఉన్న జమ్మూకాశ్మీర్ కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జగింది. కింది కోర్టులు, హైకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు మాత్రం ఆయన సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసన సంచలన వ్యాఖ్యలు చేసింది. ”2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయవ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు. దిగువ బెంచ్ లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో విస్తృత ధర్మాసనం నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. విస్తృత ధర్మాసనం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న ధర్మాసనాలు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
గతంలో ధర్మాసనం అనుసరించిన విధానాన్ని అంగీకరించడం కష్టమని పేర్కొంది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు పూర్తిగా విరుద్ధంగా ఉందని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చిన్న బెంచ్ లు వాటిని తక్కువ చేయడం న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘిం చడమేనని స్పష్టం చేసింది. యూఏపీఏ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ”బెయిల్ ఇవ్వడమే నియమం. జైలులో ఉంచడం మినహాయింపు’’ అనే సూత్రం వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును యూఏపీఏ చట్టంలోని కఠినమైన సెక్షన్ 43డి (5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. కేవలం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో నిందితులను ఏండ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం అనేది వారికి శిక్ష విధించినట్టే అవుతుందని ధర్మాసనం హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది.
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన ఘటనకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ యూఏపీఏ కింద చార్జిషీట్ నమోదు చేశారు. వీరిలో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ సహా ఏడుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు గతేడాది సెప్టెంబర్ లో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జనవరిలో విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ కు మాత్రం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. ఈ తీర్పును జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది.కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యాన్ని బెయిల్ కు ఒక కారణంగా గుర్తించిన కె.ఎ.నజీబ్ కేసులోని ముగ్గురు జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సరిగా పాటించలేదని పేర్కొంది. మాదకద్రవ్యాల ఉగ్రవాద ఆరోపణలపై యూఏపీఏ కింద నమోదైన కేసులో ఐదేండ్లకు పైగా కస్టడీలో ఉన్న సయ్యద్ ఇఫ్తికార్ అండ్రాబి బెయిల్ పిటిషన్ ను అనుమతిస్తూ, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు
ఆశాకిరణంలా నిలుస్తోంది
సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
దేశంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య సుప్రీంకోర్టు ఇప్పటికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తోందని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ వ్యాఖ్యానించారు. యూఏపీఏ కేసులో బెయిల్ ను అనుమతిస్తూ సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ దేశంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నిరాశ, నిస్పృహల నడుమ సుప్రీంకోర్టు ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది’’ అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జేఎన్‌యూ నేత ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్ లకు బెయిల్ నిరాకరిస్తూ గుల్ఫిషా ఫాతిమా కేసులోని తీర్పుపై సుప్రీంకోర్టు సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యాన్ని బెయిల్ కు ఒక కారణంగా గుర్తించిన కె.ఎ.నజీబ్ కేసులోని ముగ్గురు జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సరిగా పాటించలేదని పేర్కొంది. మాదకద్రవ్యాల ఉగ్రవాద ఆరోపణలపై యూఏపీఏ కింద నమోదైన కేసులో ఐదేండ్లకు పైగా కస్టడీలో ఉన్న సయ్యద్ ఇఫ్తికార్ అండ్రాబి బెయిల్ పిటిషన్ ను అనుమతిస్తూ, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసుల్లో శిక్షలు 4 శాతమే
94 నుంచి 98 శాతం నిర్దోషులుగా విడుదలకు అవకాశం
సుప్రీంకోర్టు ధర్మాసనం
చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కేసుల్లో కేవలం 1.5 శాతం నుంచి 4 శాతం వరకే శిక్ష పడుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సోమవారం ఒక కేసు విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరాత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 2019-2023 మధ్య దేశవ్యాప్తంగా యూఏపీఏ శిక్షా రేటు 1.5 శాతం నుంచి 4 శాతం మధ్య ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లో శిక్షా రేటు కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉందని పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటు ముందు ఉంచిన ఎన్‌సీఆర్‌బీ డేటాను ప్రస్తావిస్తూ విచారణ ముగిసే సమయానికి ఇటువంటి కేసుల్లో నిర్దోషులుగా విడుదలయ్యే అవకాశం అధికంగా ఉందని స్పష్టం చేసింది. ‘‘అందువల్ల శిక్ష పడే రేటు 2 శాతం నుంచి 6 శాతం వరకు ఉంది. అంటే, దేశంలో ఇటువంటి కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం 94 శాతం నుంచి 98 శాతం వరకు ఉంది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి, వార్షిక శిక్షా రేటు ఎల్లప్పుడూ 1 శాతం కంటే తక్కువగా ఉంది. అంటే విచారణ ముగిసే సమయానికి ఇటువంటి కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం 99 శాతం ఉంది” అని ధర్మాసనం స్పష్టం చేసింది.



