Wednesday, May 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమద్దతుదారులకు నజరానాలు

మద్దతుదారులకు నజరానాలు

- Advertisement -

1.776 బిలియన్ డాలర్లతో నిధిని ఏర్పాటు చేసిన ట్రంప్
బైడెన్ హయాంలో ఇబ్బందులు పడిన వారికి పరిహారం కోసమేనంటూ సమర్ధన

వాషింగ్టన్ : బైడెన్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడిన మిత్రులు, మద్దతుదారులను ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుం బిగించారు. అందుకోసం ఆయన 1.776 బిలియన్ డాలర్లతో ఓ నిధిని ఏర్పాటు చేశారు. అధ్యక్ష పదవికి మాయని మచ్చగా నిలిచే ఈ నిధిపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ట్రంప్ వెనుకాడడం లేదు. ఇది ఒ లంచగొండి నిధి అని విమర్శకులు మండిపడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై పగ పెంచుకోవడం, వారిపై ప్రతీకారం తీర్చుకోవడం ట్రంప్‌కు అలవాటే. ఆయన ఓటమిని ఎన్నడూ అంగీకరించరు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ తనపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను పక్కన పెట్టారు. రాజకీయంగా తాను వేధింపులకు గురయ్యానని భావిస్తున్న ట్రంప్…అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.

ట్రంప్ తన వ్యాపార జీవితంలో కూడా అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తనపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను ఆలస్యం చేయడానికి ట్రంప్ దేశాధ్యక్షుడిగా హక్కులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. చట్టాన్ని అమలు చేసే అత్యున్నత అధికారిగా తనకు తానుగా కల్పించుకున్న హోదాతో ఆయన న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. శత్రువులను శిక్షించి, మిత్రులకు నజరానాలు అందించడానికి ట్రంప్ తన అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఆయన ముందుకు తెచ్చిన నిధి దీనికి ఉదాహరణ. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తన ఇష్టానుసారం పందేరం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. ట్రంప్ తన ప్రణాళికకు కొంత చట్టబద్ధత కూడా కల్పించారు. క్లెయిములపై నిర్ణయం తీసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కమిషన్‌ను నియమిస్తారు. అయితే వారిని తొలగించే అధికారం ట్రంప్ చేతిలోనే ఉంటుంది.

బైడెన్ హయాంలో ఇబ్బందులు పడిన వారికి పరిహారం చెల్లించడమే ఈ నిధి ఉద్దేశమని ట్రంప్ చెబుతున్నారు. ఈ ప్రణాళిక ముందుకు సాగితే అమెరికా ప్రజాస్వామిక సంస్థలు, సంప్రదాయాలు నిర్వీర్యం అవుతాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత 2021 జనవరి 6న కాపిటల్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారులు ఈ నిధి ద్వారా క్షమాపణకు అర్హులు అవుతారు. పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఈ దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెయ్యి మందికి పైగా ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించారు. పోలీసులపై దాడులు, ఇతర హింసాత్మక నేరాలకు పాల్పడిన ఘటనలలో దోషులుగా తేలిన వందలాది మందికి ఆయన శిక్షలను తగ్గించారు. కొన్ని కేసులలో వాటిని రద్దు చేశారు. తనను అపఖ్యాతి పాలు చేసిన 2021 జనవరి 6వ తేదీని చరిత్ర పుటల నుంచి చెరిపేసేందుకు ట్రంప్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పుడు ఈ నిధి ద్వారా మద్దతుదారులకు ఆయన ధనవంతులను చేస్తున్నారు.
ట్రంప్ అవలంబిస్తున్న అనేక విధానాల మాదిరిగానే ఈ పరిహార నిధి కూడా న్యాయ పోరాటానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించాల్సింది ప్రతినిధిసభే కానీ అధ్యక్షుడు కాదు. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మద్దతుదారులను ప్రోత్సహించడానికే ట్రంప్ ఈ నిధిని ముందుకు తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ రేటింగ్ కనిష్ట స్థాయికి పడిపోయిన తరుణంలో ఆయన ఈ నిధిని ఆవిష్కరించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -