దానిపై చర్చలు, విస్తృత సంప్రదింపులు జరపాలి
ఏకాభిప్రాయసాధనకు
కేంద్రం కృషి చేయాలి.. దామాషా ఎన్నికల పద్ధతిపైనా చర్చ జరగాలి
ఉత్తర, దక్షిణ భేదం లేకుండా నిర్ణయాలుండాలి : సుందరయ్య
41వ స్మారకోపన్యాసంలో భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషీ
రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చడమే బీజేపీ లక్ష్యం : బివి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కు మిశ్రమ విధానమే ప్రత్యామ్నాయమని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషీ అన్నారు. దీనికోసం పరస్పర చర్చలు, విస్తృత సంప్రదింపుల ద్వారా ఏకాభ్రిపాయ సాధనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. డీలిమిటేషన్ అంటే సీట్లు పెంచడమే కాకుండా దామాషా ఎన్నికల పద్ధతిపైనా చర్చ జరగాలని చెప్పారు. 1952లోనే పుచ్చలపల్లి సుందరయ్య దామాషా ఎన్నికల పద్ధతిని పార్లమెంటులో ప్రస్తావించారని గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి కార్య్రకమాన్ని నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి ఎస్వై ఖురేషీ, బివి రాఘవులు, ఎస్ వినయకుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్ వినయకుమార్ తెలుగులోకి అనువాదం చేసిన ‘నా సొంతగడ్డపైనే నేనొక పరాయివాణ్ని’ అనే పుస్తకాన్ని ఖురేషీ విడుదల చేశారు. అనంతరం ‘ప్రతిపాదిత డీలిమిటేషన్-దక్షిణాది రాష్ర్టాల స్థితి’అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయాలే తమకు శాపంగా మారాయని ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. విద్యా, వైద్యం, జనాభా నియంత్రణ వంటి మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేసే అనేక అంశాల్లో గణనీయమైన పురోగతిని సాధించాయని వివరించారు.
అయినా పార్లమెంటులో తగినంత ప్రాతినిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని చెప్పారు. ఉత్తరాది రాష్ర్టాలు మరో ప్రశ్నను ముందుకు తెస్తున్నాయనీ, ఎప్పుడో సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా దేశంలో ప్రజా ప్రాతినిధ్యాన్ని ఎలా నిర్ణయిస్తారని అడుగుతున్నారని చెప్పారు. 1971లో డీలిమిటేషన్ జరిగినప్పుడు దేశ జనాభా 54.80 కోట్లనీ, ఇప్పుడు 150 కోట్లు పెరిగిందని వివరించారు. ఇది ఉత్తరాది, దక్షిణాది సమస్య కాదన్నారు. అయితే సీట్లు తగ్గుతాయన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళన హేతుబద్ధమైనదని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా కోల్పోయే సమస్య లేదని ప్రధాని, కేంద్ర హోం మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడున్న సీట్లకు 50 శాతం అదనంగా పెంచుతామని ప్రతిపాదిస్తున్నారనీ, దీనివల్ల ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120 సీట్లకు, తమిళనాడులో 39 నుంచి 60 సీట్లకు పెరుగుతాయని చెప్పారు.
కానీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, తమిళనాడు మధ్య వ్యత్యాసం 41 ఉంటే, సీట్లు పెరిగితే అది 60కి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా పార్లమెంటు అనుభవాలను చూశాక కొన్ని ప్రత్యామ్నాయాలను కేంద్రం పాటిస్తే బాగుంటుందని సూచించారు. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి అన్ని రాష్ట్రాల్లో ఒకే స్థాయికి చేరే వరకు డీలిమిటేషన్ను 10 ఏండ్లు, 15 ఏండ్లు, 25 ఏండ్ల వరకు వాయిదా వేయాలని సూచించారు. సమర్థవంతంగా పాలించడం వల్ల సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూనే జనాభాకు తగిన నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఇస్తూ మిశ్రమ విధానాన్ని అనుసరించాలని కోరారు. జనాభాకు 70 శాతం, జనాభా నియంత్రణ, మహిళల అక్షరాస్యత, శిశు మరణాల నియంత్రణ వంటి మానవాభివృద్ధికి 30 శాతం సీట్ల చొప్పున కేటాయించాలని సూచించారు. తన దృష్టిలో ఇది నిజాయితీతో కూడిన ప్రతిపాదన అని అన్నారు. డీలిమిటేషన్ను ఒకేసారి కాకుండా రెండు, మూడు సాధారణ ఎన్నికలు అంటే 10 ఏండ్లు, లేదా 15 ఏండ్ల వ్యవధిలో అమలు జరిగే వ్యూహాన్ని రూపొందించాలని చెప్పారు.
డీలిమిటేషన్ అంటే కేవలం లోక్సభ సీట్లపైనే చర్చ జరుగుతున్నదనీ, రాజ్యసభ సీట్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యసభ సభ్యులను ఏ రాష్ట్రంలోని సీట్లను ఆ రాష్ట్రం వారినే ఎన్నుకోవాలని సూచించారు. గతంలో ఉన్న పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే డబ్బున్న వారు, కార్పొరేట్లు వివిధ రాష్ర్టాల నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ర్టాల్లో రాజ్యసభ సభ్యులే ఇందుకు నిదర్శనమని అన్నారు. జనాభా ఆధారంగా కాకుండా ప్రజాతంత్ర యుతంగా సమాఖ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేలా డీలిమిటేషన్ వ్యవస్థ ఉండాలన్నారు. తొందరపాటు నిర్ణయాలు, హడావుడిగా అమలు చేస్తే ప్రాంతీయ భావావేశాలు, భావోద్వేగాలకు ఆజ్యం పోసేలా ఉండొద్దని సూచించారు. 1976లో రాజ్యాంగ సవరణకు ఆమోదం పొందిన తరహాలో బహుళ పార్టీ సంప్రదింపులు, చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించడమే ఈ సమస్యకు పరిష్కారమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థ ప్రయోజనాలను కాపాడాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు అంకితమవుదామని చెప్పారు.

దమాషా ఎన్నికల పద్ధతిపైనా చర్చ జరగాలన్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీఎస్పీకి 20 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా రాలేదన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువొస్తే గెలిచినట్టుగా ప్రకటిస్తున్నారని అన్నారు. అందుకే దామాషా ఎన్నికల పద్ధతి గురించి చర్చించాల్సిన అవసరముందన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు జి బుచ్చిరెడ్డి , నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ సంపాదకులు కె ఆనందాచారి, మేనేజర్ కృష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్వై ఖురేసీ ప్రసంగాన్ని కొండూరి వీరయ్య తెలుగులోకి అనువాదం చేశారు.
దేశాన్ని ఫాసిస్టు రాజ్యంగా మార్చాలనుకుంటున్న బీజేపీ : రాఘవులు
భారత దేశాన్ని ఫాసిస్టు రాజ్యంగా బీజేపీ మార్చాలనుకుంటున్నదని ఎస్వీకే ట్రస్టు చైర్మెన్ బివి రాఘవులు విమర్శించారు. దేశ జనాభా పెరుగుతుంది కాబట్టి డీలిమిటేషన్ చేయాలనుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలున్నాయని వివరించారు. పార్లమెంటు నియోజకవర్గాలకు సరిహద్దులను నిర్ణయిస్తే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. కానీ బీజేపీ ఉద్దేశం వేరే ఉందని చెప్పారు. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చడమే ఆపార్టీ లక్ష్యమన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. మెజార్టీ స్థానాలు కూడా రాలేదన్నారు. ఎన్నికల ద్వారా ఎక్కువ సీట్లు పొందే అవకాశం లేదని గ్రహించిన బీజేపీ డీలిమిటేషన్ను వాడుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఫెడరల్ దృక్పథం లేదన్నారు. భారత్ ఇప్పటికీ సమైక్యంగా ఉందంటే ఫెడరల్ వ్యవస్థే కారణమని అన్నారు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలనీ, దేశాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. దేశాన్ని ముక్కలు చేసి మత రాజ్యం తెచ్చేందుకు బీజేపీ డీలిమిటేషన్ను వాడుకుంటున్నదనీ, దీన్ని అడ్డుకోవాలని ఆయన చెప్పారు. రాజ్యాంగానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి నిరోధించేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే సుందరయ్య నుంచి నేర్చుకోవాలని అన్నారు.



