సన్నిహితుడి ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచార సేకరణ
సిట్ కు వాంగ్మూలం ఇచ్చిన రేవంత్‌రెడ్డి సన్నిహితుడు మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ -ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనంరేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులను విచారించడం ద్వారా సిట్ అధికారులు అనేక కొత్త విషయాలను రాబడుతున్నారు. తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ప్రతిరోజు అతని కదలికకు సంబంధించి సన్నిహితుడి ఫోన్‌ను ట్యాపింగ్ చేయడం ద్వారా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని అధికారులు సమాచారం రాబట్టారని తాజా విచారణలో బయటపడింది. బుధవారం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా బావించే మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తిని సిటి అధికారులు బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విచారించారు. బాధితుడిగా ఉన్న మధుసూదన్‌రెడ్డి తన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులకు వివరించారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో తాను కూడా ఆయన వెంట ఉండేవాడినని మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆ సమయంలో తన ఫోన్‌ను ట్యాపింగ్ చేయడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రతి రోజు ఎక్కడికి? ఏ ప్రాంతానికి వెళ్లుతున్నారు..? ఎవర్ని కలుస్తున్నారు..? ఎవరితో సమావేశం అవుతున్నారనే సమాచారాన్ని అప్పటి ఐజీ ప్రభాకర్‌రావు ద్వారా ఎస్‌ఐబీలో నియమించబడ్డ ఫోన్ ట్యాపింగ్ టీమ్ అధికారులు ఈ సమాచారాన్ని సేకరించేవారని సిట్ దర్యాప్తులో బయటపడినట్టు తెలిసింది. దీని కోసం మధుసూదన్‌రెడ్డి ఫోన్‌ను ఎక్కువగా ట్యాపింగ్ చేసేవారని గుర్తించినట్టు సమాచారం. దాదాపు రెండున్నర గంటలపాటు మధుసూదన్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు దాదాపు 400 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల నుంచి సిట్ అధికారులు వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. ప్రతి రోజు ఐదు నుంచి పది మంది బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేస్తూ వచ్చారు. మరో 50 మంది వరకు బాధితుల నుంచి స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు నమోదు చేయనున్నట్టు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ తో.. రేవంత్‌రెడ్డి ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



