ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ సక్సెస్ సాధిస్తోంది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించారు. కొత్తగా సైబర్ నేరస్థులకు టెలీకాం ఏజెంట్లు, ఇతరులు వెన్నెముకగా నిలుస్తున్నారు. వారి ఆటకట్టించేందుకు పోలీసులు ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరస్థులకు సిమ్‌సప్లయ్ దారులపై ఈ ఆపరేషన్ ఉక్కుపాదం మోపింది. 13 రాష్ట్రాల్లో
ఏడు రోజుల పాటు దాడులు కూర్చున్నచోటే రూ.లక్షలు, కోట్లు సంపాదిస్తున్న సైబర్ నేరస్థులు.. బ్యాంక్ అధికారులను, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు, ఏజెంట్లను పట్టుకుని బ్యాక్ ఖాతాలు, పెద్ద ఎత్తున సిమ్‌కార్డులు సేకరిస్తున్నారు. ఇది గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారాలను సేకరించారు. పక్కా సమాచారం అందుకుని పోలీసులు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 18 ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తంగా 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్ సిమ్ లు ఉండగా, 112 ఓపెన్డ్ సిమ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులతోపాటు 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులను ఆరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాల్లో వీరు భాగస్వాములైనట్టు తేలింది.
కీలక విషయాలను
రాబట్టిన పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సిమ్‌కార్డుల సేకరణ, కార్డు దారులకే తెలియకుండానే సిమ్ యాక్టివేట్ కావడంపై పోలీసులు రహస్యంగా విచారించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో సిమ్‌లు సేకరిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు 13 రాష్ర్టాల్లో దాడులు నిర్వహించారు. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు.. వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో.. ‘నెట్‌వర్క్ సరిగా లేదు’, ‘సర్వర్ డౌన్ అయ్యింది’, ‘వేలిముద్ర సరిగా పడలేదు’ అంటూ ఏజెంట్లు నమ్మబలికి, రెండు, మూడు సార్లు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి, నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్ నెట్ ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ లు అమ్మితే అంత కమిషన్ తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు.
ఈ-సిమ్ లుగా మారుస్తూ విదేశాల్లో నేరస్థులకు చేరవేత
అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు అత్యంత ఆధునిక సాంకేతికతతో ఈ-సిమ్ లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వారు మన దేశపు మొబైల్ నెంబర్లను స్వేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇదంతా పక్కా వ్యూహంతో జరుగుతోంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారు.
సీరియస్‌గా
తీసుకున్న పోలీసులు
సైబర్ నెట్‌వర్క్‌పై సీపీ ఆదేశాలతో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు సలహాలతో ఏసీపీ శివ మారుతి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. టెలికాం సంస్థల నుంచి కూడా ‘ఘోస్ట్ సిమ్’ సమస్యను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వారికి సూచిస్తామని తెలిపారు. ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్టు గుర్తిస్తే ఆ మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కంగారు పడకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయాలన్నారు.
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



