న్యూయార్క్ : వెనిజులాలో నికోలస్ మదురో పాలనను అంతంచేసిన అమెరికా తదుపరి టార్గెట్‌లో పొరుగుదేశం క్యూబానే ఉన్నట్టు కనిపిస్తోంది. ‘క్యూబాకు విముక్తిని కల్పిస్తున్నాం’ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అదే దిశగా సంకేతాలను ఇస్తోంది. మరోవైపు అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ నిమిట్జ్, దాని స్ట్రైక్ గ్రూప్ కరీబియన్ సముద్రంలోకి ప్రవేశించింది. ఈవిషయాన్ని అమెరికా సౌతెర్న్ కమాండ్ (సౌత్ కామ్) బుధవారమే ప్రకటించింది. 90 యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లతో పాటు 5వేల మందికిపైగా ఆర్మీ సిబ్బందితో కూడిన యూఎస్ఎస్ నిమిట్జ్ మోహరింపుతో అమెరికా – క్యూబా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీంతో మళ్లీ నికోలస్ మదురో అరెస్టు తరహా పరిణామాలను క్యూబాలోనూ చూడాల్సి రావచ్చనే చర్చ సర్వత్రా మొదలైంది.
క్యూబా గురించి చాలా ముఖ్యమైన ఆలోచనతో ఉన్నాం : ట్రంప్
క్యూబా మాజీ అధ్యక్షుడు 94 ఏండ్ల రౌల్ క్యాస్ట్రోపై నేరారోపణల నమోదుకు అమెరికాలోని మియామిలో ఉన్న ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ 2026 ఏప్రిల్ 23 నాడే ఆమోదం తెలిపింది. ఈ చారిత్రక నేరారోపణ వివరాలను అమెరికా న్యాయశాఖ 2026 మే 20న (బుధవారం) అధికారికంగా బహిరంగపర్చిన వెంటనే, క్యూబాకు విముక్తిని కల్పిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.
“అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ఆధ్వర్యంలోని అమెరికా న్యాయశాఖ రౌల్ క్యాస్ట్రోపై నేరారోపణలు నమోదు చేయడం అభినందనీయం. మేం క్యూబాకు విముక్తిని కల్పిస్తున్నాం. క్యూబాలో సీఐఏ ఉనికి బాగానే ఉంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు క్యూబా మూలాలు ఉండటంతో ఆ దేశంపై అమెరికాకు లోతైన అవగాహన ఉంది. మియామి నగరంలోని క్యూబా సంతతి ప్రజలతో పాటు అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న క్యూబన్లు అటార్నీ జనరల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మేం క్యూబా గురించి చాలా ముఖ్యమైన ఆలోచనతో ఉన్నాం. ఇది కేవలం క్యూబన్ అమెరికన్లకే కాకుండా, క్యూబా నుంచి అమెరికాకు వచ్చి తమ కుటుంబాల్ని చూడాలి అనుకుంటున్న ప్రజలకు కూడా ఒక గొప్ప సందర్భం. క్యూబా పతనమవుతున్న దేశం. వాళ్ల దగ్గర చమురు లేదు. మేం అక్కడి కుటుంబాలకు, ప్రజలకు సహాయం చేయడానికి ఉన్నాం. మానవతా దృక్పథంతో, మేం సహాయం చేస్తాం. క్యూబాలో ఎలాంటి ఉద్రిక్తతలు ఉండవు. వాళ్లు నిజంగా క్యూబాపై నియంత్రణ కోల్పోయారు”అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.
సైనిక దురాక్రమణ కోసమే ఆ నేరారోపణలు : క్యూబా అధ్యక్షుడు
‘రౌల్ క్యాస్ట్రోపై అమెరికాలో నేరారోపణలను నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేకుండా రౌల్ క్యాస్ట్రోపై నేరారోపణలను నమోదు చేశారు. ఇదొక రాజకీయ ఎత్తుగడ. క్యూబాపై సైనిక దురాక్రమణ చేయాలనే వైఖరిని సమర్థించుకోవడానికే నేరారోపణలు అనే కల్పిత పత్రాలను అమెరికా పాలకులు తెరపైకి తెచ్చారు. ఇది క్యూబా విప్లవపు అచంచల సంకల్పం పట్ల అమెరికా అహంకార భావాన్ని, నైరాశ్యాన్ని మాత్రమే బయటపెడుతోంది’ అని పేర్కొంటూ క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ బెర్ముడెజ్ ట్వీట్ చేశారు.
కరేబియన్ సముద్రంలోకి
యూఎస్ఎస్ నిమిట్జ్
అమెరికా, క్యూబా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ నిమిట్జ్, దాని స్ట్రైక్ గ్రూప్ కరీబియన్ సముద్రంలోకి ప్రవేశించిందంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. క్యూబాకు విముక్తిని కల్పిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో యూఎస్ఎస్ నిమిట్జ్ మోహరింపు ప్రాధాన్యాన్ని సంతరించుకుందని ఆ కథనం పేర్కొంది. యూఎస్ఎస్ నిమిట్జ్ కరీబియన్ సముద్రంలోకి ప్రవేశించిందనే విషయాన్ని వెల్లడిస్తూ బుధవారం రోజు అమెరికా సౌతెర్న్ కమాండ్ ట్వీట్ చేసింది.



