Thursday, May 21, 2026
E-PAPER
Homeజాతీయంయూపీ, బీహార్‌‌లో 
అత్యధిక వరకట్న మరణాలు

యూపీ, బీహార్‌‌లో 
అత్యధిక వరకట్న మరణాలు

- Advertisement -

2023లో దేశవ్యాప్తంగా 6159 కేసులు
ఒక్క యూపీలోనే 
2,122.. బీహార్‌‌లో 1143
ఎన్‌‌సీఆర్‌‌బీ గణాంకాలు వెల్లడి
చట్టాలున్నా మహిళలపై 
ఆగని హింస
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు
ప్రభుత్వాల ఉదాసీన వైఖరిపై మహిళా సంఘాల ఆందోళన


​న్యూఢిల్లీ
: దేశంలో బీజేపీ పాలనలో మహిళలకు భద్రత కరువవుతోంది. వరకట్నం పేరుతో వారిపై అనేక ‌దారుణాలు పెరుగుతున్నాయి. దీంతో వారు భర్త, ఆయన కుటుంబీకుల నుంచి హింస, వేధింపులు, హత్యకు గురవడమేగాక బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటి దారుణాలు ఆపడానికి అనేక చట్టాలున్నా.. మహిళలకు మాత్రం భద్రతను కల్పించలేకపోతున్నాయి. ప్రభుత్వాలు సైతం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత యూపీ, బీహార్‌ ‌రాష్ట్రాల్లో అత్యధిక వరకట్న మరణాలు నమోదవడం అక్కడి ప్రభుత్వాల వైఫల్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

​ఉన్నత విద్యావంతులు, 
ఉద్యోగులైనా ఆగని బలవన్మరణాలు
చదువు, ఉద్యోగం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వంటివి కూడా మహిళలకు రక్ష‍ణ కల్పించలేకపోతున్నాయి. వివాహం జరిగిన 17 నెలలకే దీపికా నగర్ (24) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక టయోటో ఫార్చునర్‌ కారు, రూ.50 లక్షల నగదు కోసం భర్త కుటుంబం వేధించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో పాటు ఇటీవల వెలుగుచూసిన మరికొన్ని వరకట్న మరణాలు (హత్యలు, ఆత్మహత్య కేసులు) భారత్‌‌లో మహిళల భద్రతపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తున్నాయి. యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన దీపికా నగర్‌కు పెండ్లై 17 నెలలే గడిచింది. ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి మరణించింది. పోస్టుమార్టం నివేదికలో ప్లీహం చిట్లిపోవడం, మెదడులో రక్తం గడ్డకట్టడం, అంతర్గత రక్తస్రావం, శరీరంపై గాయాల మచ్చలు ఉన్నట్టు వెల్లడైంది. ఆమెను టెర్రస్‌పై నుంచి తోసేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ఆమె భర్తను, మామను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఒక్కటే కాదు. కొద్ది రోజుల క్రితం మధ్య్రపదేశ్‌‌లోని భోపాల్‌లో ట్విషా శర్మ అనే ఎంబీఏ పట్టభద్రురాలు, మాజీ మిస్ పూణే వివాహం జరిగిన ఐదు నెలలకే ఉరేసుకుని మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. అయితే ఆమె కుటుంబం… వరకట్న వేధింపుల కారణంగానే తమ కూతురు తనువు చాలించిందని ఆరోపించింది. ఇక గతేడాది ఆగస్టులో నిక్కీ భాటి అనే మహిళను అదనంగా రూ.36 లక్షలు కావాలని డిమాండ్ చేస్తూ సజీవదహనం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే నగదు, బంగారం, ఒక కారు కట్నం కింద ఇచ్చినప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ పోలీస్ స్వాట్‌ కమాండో కాజల్ చౌదరి కూడా భర్త వేధింపుల కారణంగా మరణించిందని ఆమె కుటుంబం ఆరోపించింది. అయితే ఈ కేసులు చదువుకున్న, ఉద్యోగాల్లో ఉన్న మహిళలు కూడా వరకట్న హింస నుంచి తప్పించుకోలేకపోతున్నారనే వాస్తవాలను చూపిస్తున్నాయి.

​బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు
యూపీలో యోగి ప్రభుత్వం ‘లా అండ్ ఆర్డర్’పై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కానీ మహిళలపై వరకట్న హింస, గృహ హింస, హత్యలు ఇంత పెద్ద సంఖ్యలో కొనసాగుతుండటం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని బయటపెడు తోందని విశ్లేషకులు చెప్తున్నారు. కఠిన చట్టాలు ఉన్నా అమలు బలహీనంగా ఉండడం, బాధిత మహిళలకు తక్షణ రక్షణ లేకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోందని అంటున్నారు.అలాగే బీహార్‌లో కూడా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శలు వస్తున్నాయి. వరకట్నం సామాజిక సమస్య అయినప్పటికీ, చట్ట అమలు, పోలీసు స్పందన, వేధింపులపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం పరిస్థితిని మరింత విషమం చేస్తోందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలు మహిళల భద్రతపై రాజకీయ నినాదాలకంటే బలమైన అమలు వ్యవస్థ, వేగవంతమైన న్యాయం, సామాజిక అవగాహన ఎంత అవసరమో మరోసారి గుర్తుచేస్తున్నాయని మేధావులు అంటున్నారు.

​బీజేపీ 
పాలిత 
రాష్ట్రాల్లో 
అధికం
జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌‌సీఆర్‌‌బీ) ప్రకారం 2014లో దేశంలో 8,455 వరకట్న మరణాలు నమోదయ్యాయి. 2023 నాటికి ఈ సంఖ్య 6,156కి తగ్గింది. అయితే పరిశోధకులు మాత్రం ఈ తగ్గుదల నిజమైన సామాజిక మార్పును సూచించదని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని వరకట్న మరణాల కేసులు ‘మర్డర్’ కేసులుగా నమోదవుతూ అధికారిక గణాంకాల్లో కనిపించకుండా పోతున్నాయని అజీమ్‌ ‌ప్రేమ్‌‌జీ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు. 2023లో వరకట్న నిషేధ చట్టం కింద నమోదైన కేసులు 14 శాతం పెరిగి 15,489కు చేరాయి. అందులో ఒక్క యూపీలోనే 2,122 వరకట్న మరణాలు నమోదయ్యాయి. ఇక బీహార్‌‌లో 1,143 కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌ (468), హర్యానా (211)లు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -