Thursday, May 21, 2026
E-PAPER
Homeఆటలుక్వాలిఫయర్‌1‌పై కన్నేసి..

క్వాలిఫయర్‌1‌పై కన్నేసి..

- Advertisement -

సొంతగడ్డపై ఫేవరేట్‌‌గా సన్‌‌రైజర్స్‌
హైదరాబాద్‌, బెంగళూరు ఢీ నేడు
రాత్రి 7.30 నుంచి 
 స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో..

డిఫెండింగ్ చాంపియన్‌ ‌రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు, మాజీ చాంపియన్‌ ‌సన్‌‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌‌లో చోటు సాధించాయి. లీగ్‌ ‌దశలో ఇరు జట్లు ఆఖరు సమరానికి సై అంటున్నాయి. ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతున్నా.. ఫైనల్‌‌కు చేరుకునేందుకు రెండు అవకాశాలు దక్కించుకోవాలనే ఆలోచన ఇరు జట్ల శిబిరాల్లోనూ సుస్పష్టం. విజయం బెంగళూర్‌‌కు అగ్రస్థానం ఖాయం చేయనుండగా.. హైదరాబాద్‌ ‌టాప్‌-2లో నిలిచే అవకాశాలు బలపర్చుకోనుంది. సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు ఢీ నేడు.

నవతెలంగాణ-హైదరాబాద్‌ 

ఐపీఎల్‌19 ‌ప్లే ఆఫ్స్‌ ‌ముంగిట అగ్ర జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇటు సన్‌‌రైజర్స్‌ ‌హైదరాబాద్, అటు రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు రెండో టైటిల్‌‌పై కన్నేశాయి. లీగ్‌ ‌దశ ఆఖరు మ్యాచ్‌‌లో విజయంతో క్వాలిఫయర్‌-1‌లో ఆడే అవకాశం దక్కించుకునేందుకు ఇరు జట్లు దృష్టి నిలిపాయి. క్వాలిఫయర్‌1 ‌బెర్త్‌‌తో పాటు ప్లే ఆఫ్స్‌‌కు ముంగిట విజయోత్సాహం సైతం ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌‌లో ఫలితం ఇరు జట్లను ప్రతికూలంగా ప్రభావితం చేయలేదు, కానీ ప్లే ఆఫ్స్‌‌కు ముంగిట కొండంత ఆత్మవిశ్వాసం ఇవ్వగలదు. దీంతో ఇరు జట్లు నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

​నిలకడ కీలకం
ఐపీఎల్‌‌లో అత్యంత ప్రమాదకర బ్యాటింగ్‌ ‌లైనప్‌ ‌సన్‌‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌ ‌సొంతం. తమదైన రోజున అలవోకగా 300 బాదగల సత్తా సన్‌‌రైజర్స్‌‌కు ఉంది. అయినా, నిలకడ లేకపోవటంతో ప్రధాన బలహీనతగా మారింది. ఇటీవల సన్‌‌రైజర్స్‌ ఓడిన మ్యాచ్‌‌ల్లో బ్యాటర్లు నిరాశపరిచారు. అభిషేక్‌ ‌శర్మ, ట్రావిశ్‌ ‌హెడ్‌, ఇషాన్‌ ‌కిషన్‌‌లు మంచి ఫామ్‌‌లో ఉన్నారు. పరుగుల వేటలో, ఆరెంజ్‌ ‌క్యాప్‌ ‌రేసులో ముందంజలో కొనసాగుతున్నారు. కానీ నిలకడగా రాణించటంలో ఈ త్రయం నిరాశపరుస్తోంది. ప్లే ఆఫ్స్‌ ‌ముంగిట టాప్‌ ఆర్డర్‌ ‌నుంచి జట్టు మేనేజ్‌‌మెంట్‌ ‌నిలకడ ఆశిస్తోంది. విధ్వంసక ఆటగాడు హెన్రిచ్‌ ‌క్లాసెన్‌ ‌హైదరాబాద్‌కు అతిపెద్ద బలం. మిడిల్‌ ఆర్డర్‌‌లో ఆడుతూ 500కు పైగా పరుగులు సాధించిన క్లాసెన్‌ ఈ సీజన్లో ఇరగదీస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌‌లోనూ నిలకడగా రాణిస్తూ విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. ఆల్‌‌రౌండర్‌ ‌నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సైతం నిలకడగా ఆకట్టుకుంటున్నాడు. ఫీవర్‌‌తో ఓ మ్యాచ్‌‌కు దూరమైన నితీశ్‌ ఆ తర్వాత జోరందుకునేందుకు కాస్త తడబాటు చూపిస్తున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఇద్దరూ మెరిస్తే సన్‌‌రైజర్స్‌‌కు మిడిల్‌ ఆర్డర్లో ఎదురులేదు.

యువ బ్యాటర్లు సలీల్‌ అరోరా, అనికెత్‌ ‌వర్మలు భయమెరుగని క్రికెట్‌ ఆడుతున్నారు. ఉత్కంఠభరిత మ్యాచ్‌‌లను ముగించిన అనుభవం సలీల్‌, అనికెత్‌ ‌సొంతం. ప్లే ఆఫ్స్‌‌లో ఈ ఇద్దరు బ్యాటర్లకు సన్‌‌రైజర్స్‌‌కు ఎక్స్‌ ‌ఫ్యాక్టర్‌‌గా మారనున్నారు. బౌలింగ్‌ ‌విభాగంలో సన్‌‌రైజర్స్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కెప్టెన్‌ ‌పాట్‌ ‌కమిన్స్‌ ‌ముందుండి నాయకత్వం వహిస్తున్నాడు. వికెట్ల వేటలో, పరుగుల నియంత్రణలో పాట్‌ ‌కమిన్స్‌ ‌బాధ్యత తీసుకున్నాడు. యువ పేసర్‌ ‌ఈషన్‌ ‌మలింగ ఈ సీజన్‌లో హైదరాబాద్‌‌కు కీలక బౌలర్‌‌గా ఎదిగాడు. క్రమంగా వికెట్లు పడగొడుతూ, కీలక సమయంలో పరుగుల పొదుపు పాటిస్తూ బ్యాటర్లపై మలింగ ఒత్తిడి పెంచుతున్నాడు. యువ పేసర్లు సకిబ్‌ ‌హుస్సేన్‌, ప్రఫుల్‌ ‌హింగే సహా హర్ష్‌ ‌దూబె రాణించటం సైతం సన్‌‌రైజర్స్‌‌కు బాగా కలిసొచ్చింది. బ్యాటర్లు, బౌలర్లు కదం తొక్కితే నేడు ఉప్పల్‌‌లో బెంగళూరుకు భంగపాటు అనివార్యమే.

​జోరు కొనసాగేనా?
రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు వరుసగా రెండో సీజన్లో రాణిస్తోంది. రజత్‌ ‌పటీదార్‌ ఆర్‌‌సీబీని గొప్పగా నడిపిస్తున్నాడు. రజత్‌ ‌పటీదార్‌, దేవదత్‌ ‌పడిక్కల్‌ ఎదురుదాడి చేస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. వేగంగా ఆడుతూ బౌలర్లను ఒత్తిడికి గురి చేయటంలో ఈ ఇద్దరు విజయవంతం అయ్యారు. విరాట్‌ ‌కోహ్లి నిలకడకు సరికొత్త నిర్వచనం చెబుతూ మరోసారి 500 ప్లస్‌ ‌పరుగులు సాధించాడు. ఓపెనర్‌‌గా అదిరే ఆరంభాలు అందిస్తున్నాడు. కృనాల్‌ ‌పాండ్య ఆల్‌‌రౌండర్‌‌గా గొప్పగా రాణిస్తున్నాడు. టిమ్‌ ‌డెవిడ్‌ ‌సీజన్లో తనదైన విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడకపోయినా.. కీలక భాగస్వామాలు నిర్మిస్తూ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బంతితో బెంగళూరు మెరుగ్గా కనిపిస్తోంది. స్వింగ్‌‌స్టర్‌ ‌భువనేశ్వర్‌ ‌కుమార్‌, స్పీడ్‌‌స్టర్‌ ‌జోశ్‌ ‌హాజిల్‌‌వుడ్‌ ‌ద్వయం పవర్‌‌ప్లేలోనే ప్రత్యర్థుల కోరలు పీకేస్తున్నారు. సుయాశ్‌ ‌శర్మ, కృనాల్‌ ‌పాండ్య, రొమారియో షెఫర్డ్‌ ‌ఫామ్‌‌లో ఉన్నారు. గత మ్యాచ్‌‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ ‌ఫామ్‌‌లోకి రావటం ఆర్‌‌సీబికి అదనపు బలం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -