బరిలో నొవాక్ జకోవిచ్ సైతం
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
ఈ ఏడాది ముచ్చటగా మూడో గ్రాండ్‌స్లామ్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆస్ర్టేలియన్ ఓపెన్, వింబుల్డన్‌లో మెరిసిన కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) గాయంతో పారిస్‌కు ఫైట్‌కు దూరం అయ్యాడు. ఏటీపీ మాస్టర్స్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న జానిక్ సినర్ (ఇటలీ) పురుషుల సింగిల్స్‌పై కన్నేయగా.. రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సైతం నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కొకొ గాఫ్ (అమెరికా), నాలుగుసార్లు విజేత ఇగా స్వైటెక్ (పొలాండ్) టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ నేటి నుంచి ఆరంభం కానుంది. మే 24 నుంచి పోటీలు షురూ కానుండగా, జూన్ 7న మెన్స్ సింగిల్స్ ఫైనల్‌తో టోర్నమెంట్ ముగియనుంది. ఈ ఏడాది తొలి రెండు గ్రాండ్‌స్లామ్స్‌లో టైటిల్ వేటలో మేటి క్రీడాకారులు పోటీపడగా.. గాయాలు, ఫామ్ లేమితో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేటలో బహుముఖ పోటీ కనిపించటం లేదు. సంచలన ఫలితాలకు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు చిరుమానాగా నిలుస్తాయి. మరి, ఫ్రెంచ్ ఓపెన్ స్టార్స్ సొంతమవుతుందా? అన్‌సీడెడ్ ఆటగాళ్లు దక్కించుకుంటారా? ఆసక్తికరం.
సినర్‌పైనే ఫోకస్
ఇటలీ ఆటగాడు, వరల్డ్ నం.1 జానిక్ సినర్ కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నమెంట్లను అన్నింటిని గెల్చుకున్న సినర్ సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. వరుసగా ఐదు ఏటీపీ మాస్టర్స్ టైటిల్స్ సాధించిన సినర్.. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ప్రియ ప్రత్యర్థి కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) గాయంతో దూరం కావటంతో సినర్‌కు సవాల్ విసిరే మరో ఆటగాడు కనిపించటం లేదు. ఆల్ టైమ్ రికార్డు 25వ గ్రాండ్‌స్లామ్ కోసం ఎదురుచూస్తున్న నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సైతం బరిలో నిలిచాడు. కుర్ర సినర్‌ను ఎదుర్కోవటం జకోవిచ్‌కు అంత సులువు కాదు. జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్, రష్యా స్టార్ డానిల్ మెద్వదేవ్ టైటిల్‌పై కన్నేసినా.. సినర్‌ను ఎదుర్కొనే సత్తా ఈ ఇద్దరికీ లేదు. యువ ఆటగాళ్లు ఆర్థర్ ఫిల్స్, రఫేల్ జోడార్‌లు సంచలన విజయాలపై ఆశలు పెట్టుకున్నారు.
స్వైటెక్ ఫేవరేట్
గ్రాండ్‌స్లామ్ చరిత్రలో మహిళల సింగిల్స్ ఎప్పడూ సంచలనాలకు తలుపులు తెరిచే ఉంచుతుంది. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాలుగు సార్లు గెల్చుకున్న ఇగా స్వైటెక్ 2022, 2023, 2024లో హాట్రిక్ టైటిల్స్ సాధించి ఔరా అనిపించింది. గత ఏడాది అమెరికా చిన్నది కొకొ గాఫ్ చాంపియన్‌గా నిలిచింది. వరల్డ్ నం.1 అరినా సబలెంక, ఉక్రెయిన్ భామ ఎలెనా స్విటోలినా, మిర్రా అండ్రీవ సైతం టైటిల్ వేటలో కొనసాగుతున్నారు. అమెరికా అమ్మాయి డానిల్ కొలిన్స్, ఇంగ్లాండ్ స్టార్ ఎమ్మా రెడుకాను ఆరోగ్య సమస్యలతో ఫ్రెంచ్ ఓపెనకు దూరమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రైజ్‌మనీని గత ఏడాదితో పోల్చితే భారీగా పెంచారు. కానీ గత ఏడాది నిర్వాహకులు ఆర్జించిన ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది పెంచిన ప్రైజ్‌మనీ ఎంతో తక్కువని ఆటగాళ్లు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్‌లను భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తుంది.



