Tuesday, May 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇటుక బట్టీలకు చెరువు మట్టి

ఇటుక బట్టీలకు చెరువు మట్టి

- Advertisement -

నవతెలంగాణ – నర్సింహులపేట : అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లోపం కారణంగా లక్షలాది రూపాయలు విలువ చేసే చెరువు మట్టి అక్రమంగా ఇటుక బట్టీలకు చేరుతుంది. మండలంలోని జయపురం శివారు అక్కిరాల చెరువు నుండి కౌసల్యదేవిపల్లి బ్రిడ్జి పక్కన ఇటుక బట్టీలకు, నర్సింహులపేట శివారు పెద్ద చెరువు నుండి పెద్దనాగారం స్టేజీ వద్ద ఉన్న ఇటుక బట్టీలకు రాత్రి వేళల్లో పొక్లెయిన్లతో తవ్వి దర్జా తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. కొన్నేళ్లుగా వేసవికాలంలో వేలాది ట్రిప్పుల చెరువు మట్టిని అడ్డూ అదుపు లేకుండా చాటుమాటుగా ట్రాక్టర్ల ద్వారా బట్టీలకు తరలిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా స్థానిక అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా అక్రమార్కులను వదిలివేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం వేలాది రూపాయలు పెట్టి ఇటుకలు కొనుగోలు చేస్తున్నామని, గ్రామంలో చెరువు మట్టి ఉచితంగా తరలించడం ఏంటని ప్రజలు ప్రశ్నించారు. ఇప్పటివరకు సుమారు తరలిపోయిన సుమారు 500 ట్రిప్పులు మట్టి తరలిపోయినట్టు సమాచారం. అధికారులు మామూళ్లు అందుతుండటం వల్లే చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువు మట్టి అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయంపై డిఈ రాజ్ కుమార్ ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -