Wednesday, May 27, 2026
E-PAPER
Homeజాతీయంరూ.50 వేల కోట్ల డీల్ వెనుక..?

రూ.50 వేల కోట్ల డీల్ వెనుక..?

- Advertisement -

ఐదేండ్లు ఒప్పందం.. తలొగ్గిన మోడీ సర్కార్.. భారత ప్రయోజనాలకు విఘాతమే
వాణిజ్య లోటును పెంచనున్న అమెరికా వస్తువుల కొనుగోలురూపాయిపై పెరగనున్న మరింత ఒత్తిడి

న్యూఢిల్లీ :అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో నాలుగు రోజుల భారత పర్యటన మంగళవారం ముగిసింది. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వందల బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా వస్తువులను భారత్‌ కొనుగోలు చేస్తుందంటూ ఆయన ఆదివారం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గార్‌, దౌత్యవేత్తలు చేసిన కృషికి ధన్యవాదాలు. వారి కృషి కారణంగానే ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ రంగాలలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వందల బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా వస్తువులను కొనుగోలు చేయడానికి భారత్‌ నిబద్ధత చూపింది’ అని ఆయన అందులో రాసుకొచ్చారు.

సుప్రీం తీర్పుతో కూలిపోయిన వాణిజ్య ఒప్పందం పునాది
భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీటిపై ఫిబ్రవరి 6న సంయుక్త ప్రకటన వెలువడింది. అందులోనే ఐదు వందల బిలియన్‌ డాలర్ల అమెరికా వస్తువులను కొనుగోలు చేస్తానని భారత్‌ తెలిపింది. భారత ప్రభుత్వం కల్పించిన అనేక రాయితీలకు ప్రతిఫలంగా మన ఎగుమతులపై ప్రతీకార సుంకాన్ని పాతిక శాతం నుంచి పది శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ ఒప్పందం పునాది కూలిపోయింది. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పు చెప్పింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్‌ ప్రభుత్వం మరో ఆదేశాన్ని జారీ చేసింది. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 122 ప్రకారం వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి జరుగుతున్న దిగుమతులపై ఏకరీతిగా పది శాతం సుంకాన్ని విధిస్తున్నామని అందులో తెలిపింది. ఈ టారిఫ్‌ ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి వచ్చింది. ఇది జూలై చివరి వారం వరకూ అమలులో ఉంటుంది.

విదేశీ మారక ద్రవ్యంపై మరింత ఒత్తిడి తప్పదు
బయటి నుంచి వస్తున్న ఒత్తిడులు,అలాగే రూపాయిపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఈ సమస్య మన దేశానికి చాలా సున్నితమైనదిగా మారింది. పెరుగుతున్న దిగుమతి వ్యయాలు, అధిక చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు బయటికి పోవడం, నిరంతర చెల్లింపుల బ్యాలెన్స్‌ ఒత్తిడులు వంటి పరిణామాల కారణంగా గత 12 నెలల కాలంలో అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి తన విలువలో దాదాపు 12 శాతం కోల్పోయింది. ప్రతీకార సుంకాలను అమెరికా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన తర్వాత భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం యొక్క ఆర్థిక తర్కమే కనుమరుగైంది. కాబట్టి ఐదు వందల బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా వస్తువుల కొనుగోలు ఒప్పందం అసంబద్ధం అవుతుంది. రుబియో చేసిన ట్వీట్‌పై భారత్‌ తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మన విదేశీ మారక ద్రవ్య పరిస్థితి ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. ఈ తరుణంలో అమెరికా వస్తువుల కొనుగోలు వ్యవహారం మన దేశం నుంచి డాలర్ల తరలింపును గణనీయంగా పెంచుతుంది. అమెరికా నుంచి ఇంధనం, రక్షణ పరికరాలు, విమానాలు, వ్యవసాయోత్పత్తులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటే మన వాణిజ్య లోటు మరింతగా పెరిగి రూపాయిపై ఒత్తిడిని పెంచుతుంది.

హేతుబద్ధత ఏది?
అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నా, కుదుర్చుకోకపోయినా ప్రతి దేశం ఇప్పుడు సాధారణ సుంకానికి తోడు ఆ దేశ మార్కెట్‌లో ప్రవేశించడానికి అదనంగా పది శాతం టారిఫ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాకు భారీగా రాయితీలు ఇచ్చి టారిఫ్‌ ప్రయోజనాలు పొందుదామని అనుకున్న భారత్‌ వంటి దేశాలకు ఇది ఎదురు దెబ్బే. వ్యవసాయం, డిజిటల్‌ వాణిజ్యం, సేకరణపై పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చినా ఇవ్వకపోయినా భారత్‌కు అదే పది శాతం సుంకం విధానం వర్తిస్తే ఇక ఒప్పందం వెనుక ఉన్న వాణిజ్య హేతుబద్ధత ఎలా సమర్ధనీయం అవుతుంది?. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం నుంచి ఈ ఏడాది మార్చి 15న మలేసియా వైదొలిగింది. అంతకుముందు మలేసియా నుంచి జరుగుతున్న దిగుమతులపై అమెరికా 19 శాతం టారిఫ్‌ విధించింది. ఏకరూప సుంకం అమలులోకి రావడంతో వాణిజ్య ఒప్పందం నుంచి మలేసియా తప్పుకుంది.

పునరాలోచన అవసరం
రాబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం వాణిజ్య చర్చలపై పునరాలోచన జరపాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రతీకార సుంకాల విధానానికి గ్రహణం పట్టింది. ఫలితంగా వాణిజ్య ఒప్పందానికి ఆర్థిక సమర్ధన కూడా కనుమరుగైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -