– రూ. 80 వేల నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతు కుటుంబం..
– ఆదుకోవాలని బాధితుడి ఆవేదన
నవతెలంగాణ -చిన్నకోడూరు : మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న పిడుగుపాటు ఘటనలో ఓ పేద రైతుకు చెందిన పాడి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు జాలిగామ సారయ్య తన వ్యవసాయ పనుల కోసం, జీవనాధారం కోసం ఓ ఎద్దును పెంచుకుంటున్నాడు. రోజులాగే మంగళవారం రాత్రి కూడా ఇంటి ప్రాంగణంలో ఎద్దును కట్టేసి ఉంచారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలో ఉన్న ఎద్దుపై పిడుగు పడటంతో అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మృతి చెందిన ఎద్దు విలువ సుమారు రూ. 80,000 వరకు ఉంటుందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. తన వ్యవసాయ సాగుకు, కుటుంబ పోషణకు ఎంతో ఆసరాగా నిలిచిన ఎద్దు అకాల మరణం చెందడంతో ఆ రైతు కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. చేతికొచ్చిన మూగజీవం కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం, సంబంధిత రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేయాలని బాధితుడు కోరాడు. ప్రభుత్వం తమకు తగిన నష్టపరిహారం అందించి, ఆర్థికంగా ఆదుకోవాలని రైతు సారయ్య ఆవేదనతో వేడుకుంటున్నాడు.



