– పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
– కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
నవతెలంగాణ – బల్మూరు : ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆకస్మికంగా ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏఎన్ఎం కిట్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కిట్‌లో ఉన్న వైద్య పరికరాలు, మందులు, అత్యవసర సేవలకు ఉపయోగించే సామగ్రి గురించి సంబంధిత వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఏఎన్ఎం కిట్టులో పాము కాటు, కుక్క వ్యాక్సిన్ లు, పిల్లలకు అందించే వ్యాక్సిన్లు ఉన్నాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అనంతరం ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయానికి అందుబాటులో ఉంటున్నారా, మందులు సరిపడా ఉన్నాయా, రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాలపై ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైద్య అధికారులను హెచ్చరించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని సూచించారు. గర్భిణీలు, చిన్నారులకు అందించే వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ సందర్భంగా కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



