నవతెలంగాణ-బెజ్జంకి : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు చేయాలని సీపీఐ(ఎం)పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు ఏర్పాటుచేసిన సమావేశానికి సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కాముని గోపాలస్వామి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. మండలంలో ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయి. ఆకాలంగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయి రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని.. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఎలాంటి అంక్షల్లేకుండా కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
రైస్ మిల్లర్లు, అధికారులు కలిసి రైతులను మోసం చేస్తున్న పరిస్థితి మండలంలో నెలకొందని అగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు, అధికారుల తీరు వల్ల మండల రైతాంగం గోస పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మిల్లర్లకు కొమ్ముకాస్తూ వారికి లాభం చేకూర్చేల వ్యవహరించడం మానుకుని రైతాంగం పక్షాన నిలబడి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తరలించి రైతులను అదూకోవాలి.లేనిపక్షంలో సీపీఐ(ఎం) పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.



