నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజకవర్గంలో పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో మండల కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే నుంచి వివిధ శాఖల అధికారుల వరకు ప్రజా పరిపాలన వ్యవస్థ మండల కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో నెలకొన్న ఉద్యోగుల కొరత ప్రజాపాలనపై ప్రభావం చూపుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఈ కార్యాలయంలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలన,అభివృద్ధి కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయని సమాచారం. ఎంపీడీవో అప్పారావు పదోన్నతిపై బదిలీ కావడంతో ప్రస్తుతం ఎంపీఓ రామకోటరెడ్డి అదనపు బాధ్యతలతో ఇంచార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తున్నారు.
మండలంలోని మొత్తం 27 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం కేవలం 17 మంది కార్యదర్శులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో 6 మంది రెగ్యులర్ కార్యదర్శులు, 9 మంది ఓపీఎస్ సిబ్బంది, ఇద్దరు కొత్తగా నియమితులైన వారు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 20 మంది కార్యదర్శులు ఉండగా,ఇటీవల జరిగిన బదిలీల్లో ఐదుగురు ఇతర మండలాలకు వెళ్లారు. అదనంగా ఈ మండలానికి చెందిన మరో ఏడుగురు కార్యదర్శులు ఇతర మండలాల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ కేంద్రంగా ఉండటంతో పాటు విస్తారమైన వ్యవసాయ, అటవీ ప్రాంతాలను కలిగి ఉన్న అశ్వారావుపేట మండలానికి పూర్తి స్థాయిలో కార్యదర్శులను నియమించాలని మండల ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజలకు సేవలు వేగవంతంగా అందించాలంటే ఖాళీల భర్తీతో పాటు పరిపాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



