పంట కోతలు పూర్తయి 45 రోజులు అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని, మిగిలిన ఇరవై శాతం పంటను సేకరిస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పటికీ సేకరించింది సగం మాత్రమే. ఇంకా సగం ధాన్యం తెలంగాణ రాష్ట్రమంతటా కొనుగోలు కేంద్రాలలో, రోడ్ల వెంట పొలాల్లో లక్షలాది పంటకుప్పలు ఉన్నాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానల నుండి, 46 డిగ్రీల భగభగ మండే ఎండల్లో తమ పంటలను రక్షించుకోవడంలో అనేక మంది రైతులు మరణించారు. మెదక్ జిల్లాలో గాయంతి రాజయ్య అనే రైతు ఇరవై రోజులైనా పంట కొనుగోలు చేయడం లేదని ఉరేసుకుని చనిపోయారు. సిద్దిపేట జిల్లాలో బోన కల్లూరి వెంకటేష్ దిగుబడి రాక అప్పులు పెరిగి ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా ఆలంపల్లికి చెందిన డాకి వెంకటేశం వ్యవసాయ అప్పులు పెరిగి ఉసురు తీసుకున్నాడు. గోనె సంచులు లేక, కొనేవారు లేక, మక్కలు, జొన్నలు పండించిన రైతుల దుస్థితి కూడా మరింత దయనీయంగా ఉంది. మిల్లులో లారీల్లోని ధాన్యం దించడానికి హమాలీలు లేరు. ప్రతి మిల్లు వద్ద 20 నుంచి 30 లారీలు అనేక రోజుల పాటు నిలబడి ఉంటున్నాయి. కొద్దిమంది మిల్లర్లు రోజుకు మూడు నాలుగు లారీల ధాన్యమే దించుతున్నారు.
ప్రతి క్వింటాలు ధాన్యానికి మిల్లర్లు ఎనిమిది కిలోలు దోచుకుంటున్నారు. ప్రతి నలభై కిలోలకు ఏడు రూపాయలు మిల్లు వద్ద హమాలీ దించడం కోసం అంటే క్వింటాకు రూ.17 చెల్లిస్తున్నారు. మరి కొన్ని చోట్ల రైతులు క్వింటాకు 19 మిల్లుల వద్ద ఇస్తున్నారు. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి నలభై కిలోల బస్తాకు మిల్లు వద్ద హమాలీలు, లారీ డ్రైవర్ల సంయుక్త వసూళ్లు రూ.10, ప్రతి క్వింటాకు హమాలీ డ్రైవర్ల వసూళ్లు రూ.22కు చేరాయి. మిల్లుల వద్ద లారీలు నిలిచిపోవడంతో, లారీల కొరత తీవ్రమైంది. వివిధ రూపాల్లో లారీ డ్రైవర్ల డిమాండ్లు కూడా పెరిగాయి. ప్రతి రైతు సగటున 200 క్వింటాళ్లకు ఒక క్వింటాల్ వడ్లు హమాలీలకు కాంట వేసినందుకు ఇవ్వాలి. ప్రభుత్వం చెల్లించే హమాలీ రైతుకు అందడం లేదు. అధికారులో, మధ్య దళారులో మింగేస్తున్నారు. హమాలీ కాంటా వేసినందుకు 200 క్వింటాళ్లకు రూ.12వేలు, 200 క్వింటాళ్లకు మిల్లర్ల దోపిడీలో పది క్వింటాళ్లు. అనగా రూ.23,690 నష్టపోతున్నారు. మిల్లు వద్ద డ్రైవర్, హమాలీల మామూళ్లకు క్వింటాకు రూ.10 చొప్పున 5వేలు, రైతు 200 క్వింటాళ్లకు రూ.53,059 నుంచి 54వేలు బహుముఖ దోపిడీకి గురవుతున్నాడు. ప్రతి క్వింటాకు రూ.265 దోపిడీకి చేయబడుతున్నాడు. ఒక వర్షం పడితే ఈ దోపిడీ అనేక రెట్లు పెరుగుతుంది. మిల్లులో లారీల్లోని ధాన్యం దించడానికి హమాలీలు లేరు.
ప్రతి మిల్లు వద్ద 20 నుండి 30 లారీలు అనేక రోజులుగా నిలబడి ఉంటున్నాయి. కొద్దిమంది మిల్లర్లు రోజుకు మూడు నాలుగు లారీల ధాన్యమే దించుతున్నారు. పంట కోతల సమయానికి ముందే అంచనాతో హమాలీలను సమకూర్చుక ోవడంలో ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఉద్ధరిస్తున్నామనే పేరిట వివిధ పథకాలు కొనసాగిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి రైతుకు చెల్లించే పథకం మొత్తాన్ని మించి సేకరణలో దోపిడీ సాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుబంధు, సన్నరకం వడ్లకు చెల్లించే బోనస్‌ల మొత్తాన్ని మించి, రైతులు నేడు పంటలను అమ్ముకో వడంలో అనేక రెట్లు రైతులు నష్టపోతున్నారు. నేటి దోపిడీలో కేంద్ర,రాష్ట్ర పథకాలు పనికి రాకుండా పోయాయి. గత దోపిడీ వ్యవస్థీ కతంగా, క్రమక్రమంగా, తగ్గడానికి బదులు భారీ ఎత్తున పెరుగుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేవలం మద్దతు(ఎంఎస్‌పి) ధరలను ఊరికే ప్రకటిస్తోంది. కానీ ఆ ధరలకు కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి వేగంగా వైదొలుగుతోంది. కొనుగోళ్లకు యంత్రాంగాన్ని, ఏజెన్సీలను ఏర్పాటు చేయలేదు.
నిధులు కేటా యించడం లేదు. పైగా పంటల కొనుగోళ్ల విషయంలో అనేక కఠిన ఆంక్షలు, షరతులు పెడుతోంది. మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం పంటలు కొనుగోళ్లకు పటిష్టమైన యంత్రాంగాన్ని, నిలువ గోదాములను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది. మద్దతు ధరలిచ్చి పంటలను కొనుగోలు చేయని ఫలితంగా మక్కల రైతులు ప్రతి క్వింటాలుకు రూ.800 నుంచి వెయ్యి నష్టపోతున్నారు. వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయని మారుమూల ప్రాంతాలలో కొందరు రైతులు రూ.2వేలు క్వింటాలు చొప్పున ధాన్యం అమ్ముతున్నారు. వివిధ జిల్లాలలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం మోడీని ఒప్పించి, కేంద్ర కొనుగోలు ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా విదేశాల నుంచి పంటల, వంటనూనెల దిగుమతులను ఆపివేయాలి. ఆ పంటలకు ప్రోత్సాహకాలు ఇచ్చి మన రైతులచే పండించాలి. అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా మోడీపై ఒత్తిడి తేవాలి. ‘ప్రతి గింజ గింజనూ కొంటామని’ ఎన్నికల్లో ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అవే గింజలను అమ్ముకోవడానికి రైతు పడుతున్న భయంకరమైన కష్టాలను మాత్రం విస్మరిస్తున్నాయి.
రైతు రాజ్యం తెస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పంటల సేకరణలో పూర్తిగా విఫలమైంది. మిల్లర్ల దోపిడీని అంతం చేస్తామని ప్రవేశపెట్టిన కొత్త సాప్ట్‌వేర్‌ను మిల్లర్లు ఐక్యంగా అడ్డుకున్నారు. పాత పద్ధతిలోనే మాన్యువల్‌గా ట్రక్ షీట్స్ రాయడం కొనసాగుతోంది. మిల్లర్ల అడకత్తెరలో చిక్కిన ప్రభుత్వానికి ఊపిరి ఆడడం లేదు. మిల్లర్ల దోపిడీకి బార్లా తెరిచింది. మిల్లర్లను నియంత్రిసామన్న ప్రభుత్వం మిల్లర్ల గుప్పిట్లోకి వెళ్లింది. ఈ వేసవి పంటల సేకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధ్వాన్నమైన ప్రణాళికను, అనేక లోపాలను బయటపెట్టాయి. రైతాంగాన్ని దోపిడీ గుండంలోకి నెట్టాయి. భవిష్యత్తులో బీహార్ నుంచి బెంగాల్ నుంచి హమాలీలను తెప్పించడం సాధ్యం కాదు. ఇంత భారీ ఎండలకి మిల్లుల్లో గోదాముల్లో 25 అడుగుల ఎత్తుకు బస్తాలను మోసుకెళ్లడం అంటే తెలంగాణ హమాలీలు వణికి పోతున్నారు. ఇప్పటికే ఇక్కడ వడదెబ్బకు తాళలేక రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారు.తీవ్రమైన హమాలీల సమస్యతో ధాన్య సేకరణ నిలువ పరిస్థితి భవిష్యత్తు ఏమిటి? ఎక్కడికక్కడ గోదాములు నిర్మించి పూర్తి అత్యాధునిక యాంత్రీకరణతో ధాన్యం ఎత్తడం, ధాన్యం గోదాముల్లో దించడం తప్ప మరొక మార్గం లేదు. ఈ వ్యవసాయ యాంత్రీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలి. చేపట్టనట్లయితే ఎక్కడి పంటలు అక్కడే వర్షాలకు మొలకలు వస్తాయి.
వ్యవసాయం రైతాంగం మరింత సంక్షోభంలోకి వెళుతుంది. బీఆర్‌ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పదేళ్ల అనుభవాల రీత్యా నాటి ప్రభుత్వ పెద్దలు, మిల్లర్లు సంయుక్తంగా భారీ ఎత్తున వేలకోట్ల రూపాయలకు దోపిడీకి పాల్పడ్డారు. మిల్లర్ల వద్ద వేలకోట్ల పంటను ఎలాంటి పూచికత్తు లేకుండా అన్ని ప్రభుత్వాలు సేకరించి నిలువ చేస్తున్నాయి. ప్రభుత్వ ధాన్యాన్ని స్వేచ్ఛగా సొంత సొమ్ములా అమ్ముకునీ మిల్లర్లు వేల కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ప్రజల డబ్బు రికవరీ లేదు. చర్యలు నిర్వీర్యమయ్యాయి. గత బీఆర్‌ఎస్ పద్ధతుల్లోనే సాగుతున్న ధాన్య సేకరణలో మళ్లీ అలాంటి కుంభకోణాలు తలెత్తవనే గ్యారెంటీ లేదు. ధాన్యం సేకరణలో అవినీతిని పూర్తిగా నిర్మూలించాలంటే, రైతుల ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్న పారదర్శకత, నిజాయితీగల సహకార సంఘాలకు మిల్లులను ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందించాలి. రైతులు తమ పంటలను తామే ప్రాసెసింగ్ నిలువ చేసుకోనంత కాలం వర్ణనాతీతమైన ఈ దోపిడీ బాధలు తప్పవు. లేనట్లయితే బహుముఖ దోపిడీలో బానిసలుగా మారవలసిందే. తెలంగాణలో పండించిన మక్కలు, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలను కేంద్రం మద్దతు ధరల వ్యవస్థ (పిఎసఎస్) పరిధిలో చేర్చలేదు. ఇందువల్ల రైతులకు కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు అందకుండా పోతూ, కారు చౌకగా అమ్ముకొనే దుస్థితి ఏర్పడింది. 20.3 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తే 47.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగు బడి వచ్చింది.
ప్రభుత్వం సేకరించింది 11.45 లక్షల టన్నులు మాత్రమే. మక్కల మద్దతు ధర రూ.2400 అయితే, ప్రయివేటు వ్యాపారస్తులు 1600-1800కు ధరలు దించారు. అయినా కొనేవారు లేరు. గతంలో నేరుగా రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేసేవి. మోడీ ప్రభుత్వం పంటల కొనుగోళ్ల నుండి క్రమంగా ప్పుకుంటోంది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్‌ను కలిసి 14.9 లక్షల టన్నుల మక్కలు , 2.01 లక్షల టన్నుల జొన్నలు, 15,262 టన్నుల పొద్దు తిరుగుడు పంటలను కేంద్ర ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని విన్నవించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకున్న దాఖలా లేదు. తెలంగాణ రైతులు పండించిన పంటలను మోడీ స్నేహితులైన రిలయన్స్ అంబానీ, డీమార్ట్, టాటా స్టార్, వాల్ మార్ట్, మెట్రోలకు కారు చౌకగా అమ్ముకోండి అని మన రైతులకు కేంద్ర బీజేపీ ఉరివేస్తోంది. రేవంత్ రెడ్డి మిల్లర్ల దోపిడీకి బలి పెడుతున్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని’ ప్రగల్భాలతో గత బీఆర్‌ఎస్ నేటి కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటీలుపడి ప్రకటిస్తున్నాయి. పండించిన పంటల కొనుగోళ్లలో రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా, దోపిడీ లేకుండా ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ప్రాజెక్టుల్లో కూడా దోపిడే. పంటలు కొనుగోళ్లలోనూ దోపిడే.నేటి పంటల కొనుగోళ్లలో అస్తవ్యస్తతకు, రైతుల దుస్థితికి రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యులు. చేయాల్సిందంత చేసి, ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు, ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నాయి.
నైనాల గోవర్దన్, 9701381799



