ఇంటర్మీడియట్ విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ లో వెరైటీలు…
వయస్సుకు తగిన పోషకాలు అందేలా రూపకల్పన
1.92 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం..
మధ్యాహ్న భోజనం… బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు ఏటా రూ.180 కోట్ల వ్యయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా
జూన్ 12న ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దోశ… పూరి.. మిల్లెట్ ఇడ్లీ… బోండా .. ఉప్మా.. ఇవి హోటల్ మెనూ కాదు…. ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న బ్రేక్ ఫాస్ట్. చట్నీ, సాంబర్, మిక్స్‌డ్ వెజిటబుల్ కుర్మాతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రుచికరమైన, పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందనుంది. కీలకమైన ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన బలవర్ధక ఆహారం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పించడంతో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు దేశంలో పాఠశాల విద్యార్థులకే మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. కళాశాల విద్యార్థులకు ఏ రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజన పథకం అమల్లో లేదు. కానీ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా దేశంలోనే తొలిసారి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. పెద్ద గ్రామాలు, మండల కేంద్రాల్లో ఉన్నత పాఠశాలలు ఉండడంతో విద్యార్థులు పదో తరగతి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా విద్యాభ్యాసం చేస్తున్నారు. జూనియర్ కళాశాలలు మండల కేంద్రాలు, ఆపై స్థాయి పట్టణాలు, నగరాల్లోనే ఉండడంతో గ్రామాలు, తండాలు, ఆదివాసీ గూడాల నుంచి విద్యార్థులు కళాశాలలకు వెళ్లడం కష్టమవుతోంది. ఉదయం సమయానికి బ్రేక్‌ఫాస్ట్ చేసే పరిస్థితి లేకపోవడం, బ్రేక్‌ఫాస్ట్ చేసినా మధ్యాహ్న భోజనం తీసుకెళ్లేందుకు సమయం లేకపోవడంతో అర్ధాకలితో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలోనే చాలా మంది కళాశాల విద్యకు దూరమవుతున్నారు. దానికి తోడు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో అత్యధికులు బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. ఆయా కుటుంబాల్లోని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి తర్వాత చదువు మానేసి పనులకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు.
జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సులకు అనుగుణంగా…
ఇంటర్మీడియట్ చదివే వారి వయస్సు 15 నుంచి 18 మధ్య ఉంటుంది. ఇది కౌమార దశ. విద్యార్థినీ,విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదిగే దశ. ఈ వయస్సులో వారికి పోషకాలతో కూడిన ఆహారం అవసరం. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్ ) సిఫారసుల ప్రకారం కౌమార దశలోని వారికి రోజుకు 1,029 కిలో కేలరీలు-30-32 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఎన్ ఐఎన్ సిఫారసులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు తగినంతగా పోషకాలు అందించేలా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకానికి రూపకల్పన చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న పోషకాహారం లోపాలు, విటమిన్ లోపాలు, ఐరన్ డెఫిషీయన్సీని అధిగమించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థినీలు కౌమార దశలో ఎదుర్కొనే పలు సమస్యలకు ఈ పోషకాహారంతో చెక్ పడనుంది. నాణ్యతతో కూడిన పోషకాహారం అందడంతో విద్యార్థినీ, విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టి రాణించే అవకాశం ఉంటుంది.
తొలి రోజు 64 కళాశాలల్లో….
ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్, 12వ తేదీన ప్రారంభిస్తారు.. తొలి రోజు 41,250 మంది విద్యార్థులు ఈ పథకంలో భాగస్వాములవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభమైన తర్వాత ఫస్టియర్, సెకండియర్ కలిపి రోజుకు 1.92 లక్షల మంది బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం చేయనున్నారు.. ఇంటర్మీయట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.100 కోట్లను వెచ్చించనున్నారు..ఈ మొత్తాన్ని విద్యార్థులపై చేసే వ్యయంగా కాకుండా భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత బ్రేక్ ఫాస్ట్ మెనూలో మరింత పోషకాలు అందించే వివిధ పదార్థాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన బ్రేక్ ఫాస్ట్ మెనూ ఈ విధంగా ఉంది.
రోజు…. మెనూ..
తొలి రోజు… దోశ+చట్నీ
రెండో రోజు…. మిల్లెట్ ఇడ్లీ+సాంబార్
మూడో రోజు… పూరీ+మిక్స్‌డ్ వెజిటెబుల్ కుర్మా
నాలుగో రోజు… బోండా+చట్నీ
అయిదో రోజు… ఇడ్లీ+చట్నీ
ఆరో రోజు…. ఉప్మా+చట్నీ/ సాంబార్
రోజు విడిచి రోజు 150 ఎం.ఎల్. పాలు…



