Thursday, May 28, 2026
E-PAPER
Homeఆటలుసన్‌రైజర్స్‌ కథ ముగిసే

సన్‌రైజర్స్‌ కథ ముగిసే

- Advertisement -

ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు భంగపాటు
వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్
రాజస్తాన్‌ 243/8, హైదరాబాద్‌ 196/10

సన్‌రైజర్స్‌ కథ ముగిసింది. టైటిల్‌ ఫేవరేట్‌గా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌లో తేలిపోయింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బౌలర్లు తేలిపోగా.. ఛేదనలో బ్యాటర్లు నిరాశపరిచారు. ఫలితంగా, ఎలిమినేటర్‌లో 47 పరుగుల తేడాతో పరాజయం పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌19 నుంచి నిష్ర్కమించింది. వైభవ్‌ సూర్యవంశీ (97, 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగటంతో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత 243 పరుగుల భారీ స్కోరు చేసింది. జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చాడు. ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 196 పరుగులకే ఆలౌట్‌ కాగా రాయల్స్‌ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. శుక్రవారం ఇక్కడే జరుగనున్న క్వాలిఫయర్‌2లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆడనుంది.

నవతెలంగాణ-న్యూ చంఢీగడ్‌
ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను మట్టికరిపించిన రాజస్తాన్‌ రాయల్స్‌ దర్జాగా క్వాలిఫయర్‌2కు చేరుకుంది. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం నాకౌట్‌ తరహా మ్యాచ్‌లను నెగ్గుతూ వచ్చిన రాయల్స్‌ మంగళవారం జరిగిన ఎలిమినేటర్‌లో రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కింది. వైభవ్‌ సూర్యవంశీ (97, 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లు) అసమాన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సిక్సర్ల సునామీ సృష్టించిన సూర్యవంశీ సన్‌రైజర్స్‌ బౌలర్ల భరతం పట్టాడు. ధ్రువ్‌ జురెల్‌ (50, 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిశాడు. రియాన్‌ పరాగ్‌ (26, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం రాణించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్‌ పేసర్‌ ప్రఫుల్ హింగే (3/54) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చతికిల పడింది. అభిషేక్‌ శర్మ (0), ట్రావిశ్‌ హెడ్‌ (17), ఇషాన్‌ కిషన్‌ (33), రవిచంద్రన్‌ స్మరణ్‌ (1), హెన్రిచ్‌ క్లాసెన్‌ (18) దారుణంగా విఫలమయ్యారు. నితీశ్‌ కుమార్ రెడ్డి (38, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సలీల్‌ అరోరా (35, 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. శివాంగ్‌ కుమార్ (27, 24 బంతుల్లో 3 ఫోర్లు) ఆఖర్లో సన్‌రైజర్స్‌ పోరాటాన్ని కొనసాగించాడు. 19.2 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 196 పరుగులకు ఆలౌటైంది. వీరోచిత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఏకపక్షం చేసిన వైభవ్‌ సూర్యవంశీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

సన్‌రైజర్స్‌ చతికిల
సన్‌రైజర్స్‌ లక్ష్యం 244 పరుగులు. భీకర బ్యాటింగ్‌ లైనప్‌కు ఇది పెద్ద కష్టమేమీ కాదు. కానీ జోఫ్రా ఆర్చర్ (3/58) సన్‌రైజర్స్‌ టాప్‌ ఆర్డర్‌ను లేపేశాడు. అభిషేక్‌ శర్మ (0), ట్రావిశ్ హెడ్‌ (17, 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) సహా ఇషాన్‌ కిషన్‌ (33, 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లను ఆర్చర్‌ అవుట్‌ చేశాడు. దీంతో 57 పరుగులకే హైదరాబాద్‌ 4 వికెట్లు కోల్పోయింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (18, 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) వరుస బౌండరీలతో జోరందుకున్నా.. అనవసర షాట్‌కు వెళ్లి వికెట్‌ కోల్పోయాడు. క్లాసెన్‌ నిష్ర్కమణతో సన్‌రైజర్స్‌ పరాజయం ఖరారైంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సలీల్‌ అరోరా, శివాంగ్‌ కుమార్‌లు సన్‌రైజర్స్‌కు గౌరవప్రద ఓటమి అందించారు. రవీంద్ర జడేజా, బర్గర్‌, సుశాంత్‌ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. 19.2 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 196 పరుగులకు ఆలౌటైంది. దీంతో రాయల్స్‌ 47 పరుగుల తేడాతో ఎలిమినేటర్‌లో గెలుపొంది క్వాలిఫయర్‌2కు చేరుకుంది. గత ఏడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌పై రాయల్స్‌కు ఇదే తొలి విజయం.

వైభవ్‌ ఆకాశమే హద్దుగా..
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై టాస్‌ నెగ్గిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్‌ (29, 29 బంతుల్లో 4 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా.. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (97) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వైభవ్‌ మెరుపులతో 3.2 ఓవర్లలోనే రాయల్స్‌ 50 పరుగుల మార్క్‌ అందుకుంది. 8 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 16 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన వైభవ్‌ సూర్యవంశీ సన్‌రైజర్స్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పవర్‌ప్లేలో 80/0తో నిలిచిన రాజస్తాన్‌ సూర్యవంశీ ధనాధన్‌తో రికార్డు స్కోరు దిశగా సాగింది. మరో ఐదు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో దండయాత్ర చేసిన వైభవ్‌ 29 బంతుల్లోనే 97 పరుగులు పిండుకున్నాడు. ఆల్‌టైమ్ రికార్డు సెంచరీకి చేరువైన వైభవ్‌ను ప్రఫుల్‌ హింగే అవుట్ చేయటంతో సన్‌రైజర్స్‌ ఊపిరీ పీల్చుకుంది. వైభవ్‌ అవుటయ్యే సరికి రాయల్స్‌ 8 ఓవర్లలో 125/1తో నిలిచింది. సూర్యవంశీ అందించిన అదిరే ఆరంభాన్ని మిడిల్‌ ఆర్డర్‌ సద్వినియోగం చేసుకుంది. ధ్రువ్‌ జురెల్‌ (50) అర్థ సెంచరీతో చెలరేగగా.. రియాన్‌ పరాగ్‌ (26, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ షో చేశాడు. ఓ దశలో 270-280 పరుగులు చేసేలా కనిపించిన రాయల్స్‌ను డెత్‌ ఓవర్లలో వెనక్కి లాగారు. సన్‌రైజర్స్‌ బౌలర్లు ఆఖర్లో సమిష్టిగా రాణించి పరుగుల వరదకు అడ్డుకట్ట వేశారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు రాజస్తాన్‌ 243 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో ప్రఫుల్‌ హింగే (3/54) మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. ఈషన్‌ మలింగ (1/40), శివాంగ్‌ కుమార్‌ (1/19), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1/12) రాణించారు.

సంక్షిప్త స్కోరు వివరాలు :
రాజస్తాన్‌ రాయల్స్‌ : 243/8 (వైభవ్‌ సూర్యవంశీ 97, ధ్రువ్‌ జురెల్‌ 50, ప్రఫుల్ హింగే 3/54, నితీశ్‌ కుమార్‌ 1/12, శివాంగ్‌ కుమార్‌ 1/19)
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : 196/10 (నితీశ్‌ కుమార్‌ రెడ్డి 38, సలీల్‌ అరోరా 35, ఇషాన్‌ కిషన్‌ 33, జోఫ్రా ఆర్చర్‌ 3/54, రవీంద్ర జడేజా 2/21)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -