కాలుష్య రహిత రవాణాయే లక్ష్యం :
ఈవీ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం
రాష్ర్టవ్యాప్తంగా 1050 బస్సులు సేవలందిస్తున్నాయని వాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ గుర్తింపు సంఘానికి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికైన సంఘంతో కలిసి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కాలుష్య రహిత రవాణాయే లక్ష్యంగా ఈవీ బస్సులు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత ప్రజా రవాణాను పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో ముందడుగు వేసిందన్నారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా బుధవారం కూకట్‌పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మరో ఢిల్లీలా మారకూడదనే ఉద్దేశంతోనే పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌లోనే 540 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని గుర్తుచేశారు.
కార్మికులకు పీఆర్‌సీ అమలుతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి రెండో మంగళవారం ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నట్టు వివరించారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ ఈవీ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండ్లల్లో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని ప్రయాణాన్ని అందిస్తున్నామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే, ప్రయాణికులకు సురక్షితమైన, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయనీ, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్,కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కలెక్టర్ మనుచౌదరి టికెట్ తీసుకుని నూతన బస్సుల్లో ప్రయాణించారు. వీరితోపాటు ఆర్టీసీ ఈడీ లు సిహెచ్.వెంకన్న, రాజశేఖర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



