Friday, May 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅప్రకటిత నియంతృత్వం!

అప్రకటిత నియంతృత్వం!

- Advertisement -

భారతదేశ రాజకీయ ముఖ చిత్రం ప్రస్తుతం ఒక అప్రకటిత నియంతృత్వ ధోరణి వైపు వేగంగా నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయం, ప్రశ్నించే ప్రతిపక్షం ప్రాణాధారాలు. కానీ, నేటి నయా-రాజకీయ నమూనాలో విమర్శను విద్రో హంగా, ప్రశ్నను నేరంగా చూస్తున్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులకు, ప్రజా వ్యతిరేక విధానాలకు లొంగకుండా నిలబడే ఏకైక సిద్ధాంతపరమైన గొంతుక ‘వామపక్షం’. అందుకే, కమ్యూనిస్టు పార్టీల ఉనికిని, వారి నైతిక పునాదులను దెబ్బతీయడమే అధికార వర్గాల ప్రధాన అజెండాగా మారింది. ఇది కేవలం ఒక పార్టీపై జరుగుతున్న దాడి కాదు, సామాన్యుడి తరఫున మాట్లాడే ‘నైతిక రాజకీయం’పై జరుగుతున్న వ్యవస్థీకృత, ఫ్యాబ్రికేటెడ్ (కల్పిత) దాడి. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లు బాహాటంగా ఎంతగా విమర్శించుకు న్నప్పటికీ, వామపక్షాలను అణచివేయాలనే విషయంలో వారిద్దరి వైఖరిలో పెద్ద తేడా లేదు. నయా-ఉదారవాద ఆర్థిక విధానాలను నెత్తిన మోస్తున్న ఈ రెండు పార్టీలకు, శ్రమజీవుల పక్షాన నిలిచే ఎరుపు జెండా ఎప్పుడూ ఒక సింహస్వప్నమే. ​కార్పొరేట్ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తూ, దేశ సంపదను ప్రయివేటుపరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను పార్లమెంటు లోపలా, వెలుపలా గట్టిగా నిలదీసేది వామపక్షాలే. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను (ఈడి,సిబిఐ) రాజకీయ ప్రతీకార ఆయుధాలుగా మార్చి, కమ్యూనిస్టు నాయకత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. మరోవైపు, జాతీయ వేదికలపై రాజ్యాంగ రక్షణ, లౌకికవాదం గురించి మాట్లాడే కాంగ్రెస్, కేరళం వంటి రాష్ట్రాల్లో వామపక్ష (ఎల్‌‌డిఎఫ్‌)ను బలహీనపరిచేందుకు స్థానిక మితవాద, మతతత్వ శక్తులతో చేతులు కలపడానికి కూడా వెను‌కాడలేదు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనం. అధికార కేంద్రం ఎవరి చేతిలో ఉన్నా, తమ ఆర్థిక ప్రయోజనాలకు అడ్డుపడే వామపక్ష శ్రేణులను ఒంటరిని చేయడమే ఈ రెండు శక్తుల ఉమ్మడి వ్యూహం.

ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ముందుగా వామపక్ష నేతలపై ఈడీ ద్వారా నిరూపణ కాని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఆ తర్వాత, సదరు దర్యాప్తునకు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని లేదా లీకులను తమ అనుకూల ఐటీ సెల్స్‌కు చేరవేస్తున్నారు. ఈ లీకుల ఆధారంగా సోషల్ మీడి యాలో సదరు నాయకుడిని ఒక పెద్ద నేరగాడిగా చిత్రీకరిస్తూ ‘డిజిటల్ విచారణ’ మొదలు పెడుతున్నారు. కోర్టుల్లో నేరం నిరూపణ కాకపోయినా, ప్రజల దృష్టిలో వామపక్షాల నైతికతను దెబ్బతీయడమే ఈ ఈడీ-డిజిటల్ కూటమి అసలు లక్ష్యం. కేరళం మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష అగ్రనేత పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు చెందిన ఐటీ కంపెనీ వ్యవహారంలో ఈడి రంగంలోకి దిగిన తీరు దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఒక ప్రయివేట్ కంపెనీతో జరిగిన సాధారణ వ్యాపార లావాదేవీలను సైతం ‘భారీ మనీలాండరింగ్’ కుంభకోణంగా చిత్రీకరిస్తూ ఐటీ సెల్స్ హోరెత్తించాయి. ఎలాంటి పక్కా ఆధారాలు లేకపోయినా ప్రభుత్వ అధినేత ప్రతిష్టను మసకబార్చడానికి ఈడీ విచారణను ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. కేరళలోని బలిష్టమైన సహకార బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బ తీయడానికి కరుణావనూర్ సహకార బ్యాంకులో జరిగిన కొన్ని స్థానిక అక్రమాలను వాడుకున్నారు. మొత్తం కేరళలోని సహకార రంగమంతా అవినీతి మయం అయిపోయిందంటూ వేలాది తప్పుడు గ్రాఫిక్స్, ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వ్యవస్థపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందడమే దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం.

కేరళలో అప్పటి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను అప్రతిష్ట పాలు చేయడానికి ఈడీ లీకులను సోషల్ మీడియాలో భారీ కుంభకోణాలుగా ప్రచారం చేయడం, పశ్చిమ బెంగాల్లో తృణమూల్, బీజేపీలు మీడియాను వాడుకుంటూ, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టు కార్యకర్తలను హింసా వాదులుగా చిత్రించడం, త్రిపురలోనూ వామపక్ష శ్రేణులపై జరుగుతున్న భౌతిక దాడుల నిజాలను డిజిటల్ వేదికలపై రాకుండా తొక్కిపెడుతూ, తప్పుడు ప్రత్యా మ్నాయ కథనాలను వైరల్ చేయడం లాంటి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అధికార బలం, కార్పొరేట్ ధనం, ఐటీ సెల్స్ మాయాజాలం, ఈడి లాంటి సంస్థల అండతో తాత్కాలికంగా పోరాటాన్ని బలహీనపరచవచ్చేమో కానీ, దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో ఉన్న సిద్ధాంత స్ఫూర్తిని తుడిచి పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. విమర్శలను స్వీకరించలేని పాలకులు నియంతృత్వ పోకడల వైపు వెళ్తున్నారనడానికి ప్రతిపక్షాలపై, ముఖ్యంగా వామ పక్షాలపై జరుగుతున్న ఈ ‘ఫ్యాబ్రికేటెడ్’ దాడులు, అక్రమ ఈడీ కేసులే సజీవ సాక్ష్యం. ​ఇది కేవలం కమ్యూనిస్టుల సమస్య మాత్రమే కాదు, దేశంలో ఇంకా మిగిలి ఉన్న ప్రజాస్వామ్య స్వేచ్ఛకు, పౌర హక్కులకు సంబంధించిన సమస్య. సోషల్ మీడియా స్క్రీన్ల వెనుక దాగి ఉన్న కార్పొరేట్ రాజకీయాల కుట్రలను, పెయిడ్ కథనాలను సాధారణ ప్రజలు అర్థం చేసుకోవాలి. లైకులు, షేర్ల వెనుక ఉన్న నిజానిజాలను గ్రహించాలి. సామాన్యుడు తన తరఫున నిలబడే ఏకైక గొంతుకను కాపాడుకోవాలి.​

యం.చుక్కయ్య
94903 00733

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -