ఉద్యోగాలు లేక గ్రాడ్యుయేట్ల అవస్థలు • పట్టభద్రుల్లో 40 శాతం పైగా నిరుద్యోగులే
గాజా : ఇజ్రాయిల్ దురాక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో నిరుద్యోగం కోరలు చాచింది. విశ్వ విద్యాలయాల్లో డిగ్రీలు పూర్తి చేసిన వారికి కూడా అక్కడ ఉపాధి దక్కడం లేదు. దీంతో అక్కడి యువత తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, జీతాల బకాయిలు, వలసలు పాలస్తీనా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ల అవకాశాలను కుచించివేస్తున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం, ప్రభుత్వ రంగ నియామకాలు లేకపోవడం, మరోవైపు నైపుణ్యం కలిగిన కార్మికులు అధిక సంఖ్యలో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తుండటంతో.. అక్కడే ఉన్న పాలస్తీనా విశ్వవిద్యాలయ పట్టభద్రులు ఉద్యోగావకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలస్తీనా ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎంఎఎస్) గణాంకాల ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో డిప్లమా చేసిన యువ పాలస్తీనియన్లలో 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అక్టోబర్ 2023లో ఉన్న నిరుద్యోగం కంటే ఇప్పుడు రెట్టింపు పెరిగింది. 2024 ప్రారంభంలో 35.2 శాతం గరిష్ట స్థాయికి చేరుకుని, 2025 చివరి నాటికి 27.5 శాతానికి తగ్గింది. గాజాపై యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇజ్రాయెల్‌లో ఉపాధి పొందుతున్న వెస్ట్ బ్యాంక్‌కు చెందిన 1,15,000 మంది పాలస్తీనియన్ల పని అనుమతులను ఇజ్రాయిల్ నిలిపివేయడంతో ఈ సంక్షోభం తీవ్రమైంది. ఇక అప్పటి నుంచి ఇజ్రాయిల్ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగవకాశాల్ని కల్పించింది. ఉద్యోగ అవకాశాలు క్షీణించడం విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో అనిశ్చితిని పెంచింది. గ్రాడ్యుయేషన్ సమీపిస్తున్న కొద్దీ చాలా మంది విద్యార్థులు తమ డిగ్రీల విలువను ప్రశ్నిస్తున్నారని బెత్లెహెం విశ్వవిద్యాలయ అకాడెమిక్, కెరీర్ సలహాదారు ఎనాస్ ఎలియాస్ అన్నారు.



