కరుణమ్మది (అసలు పేరు కాదు) రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి. 2006లో ఆమె కుటుంబం ‘ఇందిరమ్మ ఇల్లు మొదలెట్టింది. ఇంటికి దశలవారీగా రూ.31,200 సాయం, ఉపాధి హామీపథకం కింద 40 పనిదినాలు వాడుకుంటే వేతనం అందిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఆమె కుటుంబం ఇంటికి పునాదులేసుకుంది. కానీ సగం పూర్తికాకముందే అప్పు చేయాల్సిన స్థితికి నెట్టబడింది.2007 జనవరిలో కరుణమ్మను కలిసినప్పుడు- పొదుపు సంఘానికి రూ.19,150 చెల్లించాల్సివుందని తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, 2026 మార్చిలో ఆమెను మరోసారికలిశాను. ఇల్లు చూపిస్తూ ‘కూలోల్లను పెట్టలా. మేమే కష్టపడ్డం అన్నది. 2010 నాటికి ఇంటినిర్మాణం పూర్తయింది. అదనంగా రూ.80 వేల వరకూ ఖర్చయింది. అప్పు తీర్చడానికి ఆమె భర్తఎడ్లు అమ్మేశాడు. ఇంటిపై ‘ఉపాధి పనిదినాలు వాడుకున్న తమ కుటుంబానికి వేతనం కూడాచెల్లించలేదని వాళ్లబ్బాయి చెప్పాడు. దళితవాడకు చెందిన మరో మహిళ కూడా తమకు కూలి అందలేదని తెలిపింది. కొన్నేళ్ల కిందట పని ప్రదేశంలో కరుణమ్మ గాయపడింది. గడ్డపార తాకడంతో రూ.1500 వరకూ ఖర్చయింది. ‘గవర్నమెంటు దవాఖానకి పోయిన పైసలొస్తయని. రెండుమార్లు మండలాఫీసుకి తిరిగిన. బిల్లు ఇయ్యలె. చెయ్యి నుంచి పెట్టుకున్న.
వారం పని మానేసిన అని తెలిపింది. కోలుకున్నాక ఆమె పనికి పోయింది, కానీ అప్పటికే ‘పని బంద్ చేసిన్రు. ‘ఇక్కడ భూముల్లేక రైతులు పని చెప్తలేరు. రెండేళ్ల సంది పని చేయల. ఎన్నడూ వందరోజులుచేయలే అని చెప్పింది కరుణమ్మ. కానీ గత ఆర్థిక సంవత్సరంలో ఆమె వంద పనిదినాలూ వాడుకున్నదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం లింగంపల్లిలో వంద రోజులుపూర్తి చేసిన 24 కుటుంబాల్లో నాలుగు ఎస్సీ కమ్యూనిటీకి చెందినవి. కానీ ఎస్సీ కుటుంబాల్లో ఎవ్వరూ వంద రోజులు చేయలేదంటున్నారు ఫీల్డ్ అసిస్టెంట్. అధికారిక గణాంకాలకూ అసలు పరిస్థితులకూ మధ్య పొంతన లేదు.బకాయి రాలేదు…వ్యక్తిగత పనుల్లో ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా) మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే, రాణి కథ వాటి అమలుతీరులోని అంతరాలను బయటపెడుతోంది. ఆమె కుటుంబం ఉపాధి పథకం కింద మరుగుదొడ్డికట్టించుకుంది. ‘మూడు నాలుగు ఏళ్లయినా బకాయి రాలేదు. ఆరు వేల రూపాయలు రావాలి.అడిగి అడిగి ఊరుకున్నం’ అంటుంది రాణి.2009 మార్చి 2013 ఫిబ్రవరి మధ్య రాణి కుటుంబం సగటున ఏడాదికి 53 పనిదినాలు వాడుకున్నట్టు జాబ్ కార్డు నమోదులు చూపిస్తున్నాయి.
కాలక్రమంలో పని అవకాశాలు మరింత తగ్గుతూ వచ్చాయని రాణి మాటలూ ప్రభుత్వ రికా ర్డులూ కలిపి పరిశీలించినప్పుడు అర్థమయ్యింది. ఆమె పేరు మీద 2020ఉ21లో తొమ్మిది రోజులు, 2021-22లో ఒక్కరోజు పని మాత్రమే నమోదైంది. తదుపరి సంవత్సరం 23 పని దినాలు వాడుకున్నప్పటికీ, ఆ తర్వాత రెండేళ్లు ఎలాంటి నమోదులూ లేవు.‘మాకు భూమీ లేదూ ఏమీ లేదూ’ అంటున్న రాణి గత ఆర్థిక సంవత్సరంలో ఐదు రోజులుమాత్రమే పని చేసి రూ.1009 కూలి పొందింది. గ్రూపుగా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పని అడిగినా లేదని చెప్పారని ఆమె వివరించింది. అధికారిక డ్యాష్‌బోర్డు ప్రకారం లింగంపల్లిలో మొత్తం పని దినాల్లో ఎస్సీల వాటా 18.62 శాతం. అయితే ఇంత పరిమిత స్థాయిలోనైనా ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారన్న అనుమానం కలుగుతోంది పై ఉదంతాలను గమనించినప్పుడు. పని దినాల కేటాయింపు, బకాయిల చెల్లింపు, పని నిరాకరణ వంటి అంశాలపై గ్రామస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తగల వాతావరణం ఉన్నప్పుడు, సామాజిక తనిఖీలు ఇందుకు వేదికలు కాగలిగినప్పుడు కొంతమేరకు మార్పు వచ్చే అవకాశముంటుంది. కానీ, ఈ తనిఖీలు మొక్కుబడిగా జరుగుతు న్నాయని, మంచాలలో 2025 జూన్‌లో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ప్రజల భాగస్వామ్యం లేకుండానే ముగిసిందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
కుంట తవ్వితే కూలి గిట్టుబాటు కాదు..2023 మేలో లింగంపల్లిలో సేద్యపు కుంట తవ్విన రాచకొండ శేఖర్‌కు వారానికొకలా వేతనం వచ్చింది. నరేగా ఎంఐఎస్ మస్టర్ల ప్రకారం ఒక వారంలో అతడికి నమోదైన గరిష్ట దినసరి కూలి రూ.123. మరో వారంలో అది రూ.49కి పడిపోయింది. ఇంకో రెండు వారాలు 63,59 రూపాయల చొప్పున నమోదైంది. మొత్తం 16 పని దినాలకు అతడు పొందిన సగటు దినసరి వేతనం రూ.73.83 మాత్రమే. మే చివరి వారానికి అతడి గ్రూపులోని కూలీలు ఒకటి రెండు రోజులకుమించి పని చేయలేకపోయారు. కూలి డబ్బు బండి పెట్రోలుకే సరిపోయిందని శేఖర్ చెప్పాడు.‘మట్టి మోసుడు, తవ్వుడు.. లోతులోకి ఎల్లి మీదికి ఎత్తుకు రావాలి మన్ను. గట్టిగ తవ్వితే గింత కూడా పేడ ఎల్లది’ అని ఇదే కాలంలో పని చేసిన ఉద్దగిరి యాదమ్మ సేద్యపు కుంట తవ్వకం అనుభవాలను వివరించింది. ఈ పనికి కూలి తక్కువ పడిందని ఆమెతో సహా పలువురు మహిళలు తెలిపారు. ఇదే కాలంలో మంచాల మండలంలోని తాళ్లపల్లి గూడ (207), అస్మత్పూర్ (142.06), ఎల్లమ్మ తండా (83.01) గ్రామాల్లో సేద్యపు కుంటలు తవ్విన కూలీలకు లభించిన గరిష్ట వేతనమూ తక్కువే. సగటు లెక్క తీస్తే వాస్తవ ఆదాయం మరింత దిగదుడుపుగా కనిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన నోటిఫైడ్ వేతనం (రూ.272) పొందిన కూలీలు నేను పరిశీలించిన మస్టర్లలో కనిపించలేదు.
అయితే, కొలత ప్రకారం పని – పని ప్రకారం పేమెంట్ జరుగుతుందని, అదే సంవత్సరంలో ‘హైయెస్ట్’ వేతనం నమోదైన గ్రామాలు కూడా వున్నాయని తెలిపారు మంచాల మండల ఇంజినీరింగ్ కన్సల్టెంట్ విమల సునిగంటి.ఫామ్ పాండ్ పనులు చాలా కష్టమైనవని, ఎంత తవ్వినా కూలి తక్కువగానే వుండటంతో కొందరు కార్మికులు ఆ పనిలో కొనసాగలేకపోతుంటారని లిబ్టెక్ ఇండియా సీనియర్ పరిశోధకులు చక్రధర్ బుద్ధా చెప్పారు. ఆయన అందించిన వివరాల ప్రకారం మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయాక కార్మికుల కోసం రాష్ట్రాలు తమ పరిధిలో చర్యలు చేపట్టగల వెసులుబాటు తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ఎంఐఎస్ వెబ్సైట్లు ఉన్నపుడు.. నోటిఫైడ్ వేతనం కంటే చాలా తక్కువ కూలి నమోదైతేకార్మికులను మళ్లీ పనికి తీసుకొచ్చి పని పూర్తి చేయించి, దానికి అనుగుణంగా మస్టర్లలో మార్పులు చేసి మెరుగైన వేతనం వచ్చేలా చేసేవారు. ఎన్ఎంఎంఎస్, ఆధార్ ఆధారిత చెల్లింపుల వంటి సాంకేతిక వ్యవస్థలు వచ్చిన తర్వాత దిగువ స్థాయి అధికారుల చేతులు కట్టేసినట్టయ్యిందని కూడా చక్రధర్ వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలోనే మండలంలోని రంగాపూర్ తనదైన మార్గాలను వెతుక్కుంది.
గట్టి నేలను తవ్వడం కష్టమైన చోట్ల ట్యాంకర్ నీళ్లు పోయించి గుంతలు తవ్విస్తున్నామని చెప్పారు ఆ ఊరి సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ. పనులు ఎంపిక సమయంలో ‘వెహికల్ పోతదా పోదా’ అనేది చూసుకుంటున్నారు. ఈ తరహా పద్ధతులు కూలీలకు పని సులభం చేయడంలో కొంతవరకు సహాయపడొచ్చు. అయితే, ఇలాంటి కఠినమైన తవ్వకం పనులకు గిట్టుబాటు కూలి లభించేలా విధానస్థాయిలో చొరవ అవసరమని పై అనుభవాలు గుర్తు చేస్తున్నాయి.పొలం లేదు.. పని లేదు.. ఎకరం భూమి, రెండు బర్రెలతో కుటుంబాన్ని పోషిస్తున్న ఒంటరి మహిళ యాదమ్మ.. పనిస్తే చేస్తా అంటుంది. ‘ఇప్పడు పని గురించి తెలియదు. దరఖాస్తు చేసుకోవాలని తెలియదు. అప్పుడు గ్రూపు లీడర్ రాసేది అన్నదో మహిళ. ఆమెలా మరో నలుగురైదుగురు కార్మికులు కూడా శ్రమశక్తి గ్రూపులను గుర్తు చేసుకున్నారు. పని అవసరం ఉన్నప్పటికీ, దాన్ని హక్కుగా డిమాండ్ చేయాలనే అవగాహన వారి మాటల్లో పెద్దగా కనిపించలేదు. చట్టం వచ్చిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా గ్రామాభివృద్ధి- జీవనోపాధులకు ఉపయోగ పడగల పనులు చేయించుకునేందుకు వున్న అవకాశాల తాలూకు సమాచారం చాలామందికి చేరలేదు.
పని కోసం, జీవిక కోసం సంఘటిత నిర్మాణాలు ఎందుకు అవసరమో పై మహిళల అనుభవాలు గుర్తు చేస్తున్నాయి. గ్రామీణ జీవనో పాధుల కల్పనలో నరేగా కీలకంగా నిలిచింది. అయితే కరుణమ్మ, రాణి వంటి వారి జీవిత కథలు, అవినీతి నియంత్రణలో వైఫల్యాలు, గిట్టుబాటు కూలి రాకపోవడాలు.. ఇవన్నీ ఉపాధి హామీ వ్యవస్థలో సరిదిద్దవలసిన అంశాలను గుర్తు చేస్తున్నాయి. వీటిపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం చట్టాన్నే రద్దు చేసింది. నరేగా మూల సూత్రాలకు భిన్నమైన కొత్త చట్టం తెచ్చింది. అయితే, చట్టాలు మారినా గ్రామీణ కార్మికుల జీవనోపాధి భద్రత, గిట్టుబాటు కూలి వంటి ప్రశ్నలు అలాగే మిగిలి వుంటాయి. కార్మికుల స్వరం బలపడేలా చేయడం, పని కోసం డిమాండ్ చేయగల సామర్థ్యాన్ని పెంచడం, అమలులో కనిపించే లోపాలపై ప్రభుత్వాలను జవాబు దారిగా నిలబెట్టడం ఇకపై మరింత కీలకంగా మారనుంది. ఈ దిశగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, గ్రామీణ సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నరేగా అనుభవాలు గుర్తు చేస్తున్నాయి.
ఉదయలక్ష్మి వడ్లమూడి 9866420288



