Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంఆర్‌టీఐ చట్టానికి సవరణలు

ఆర్‌టీఐ చట్టానికి సవరణలు

- Advertisement -

ఆర్థిక సర్వే ప్రతిపాదన

న్యూఢిల్లీ : ఆర్‌టీఐ చట్టాన్ని సవరించాలని ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. ఫైల్‌ నోటింగ్స్‌, ఆంతరంగిక చర్చల రికార్డులు, ముసాయిదా పత్రాలు వంటి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని సూచించింది. 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సవరణలనే ముందుకు తెచ్చింది. అయితే వాటిని పార్లమెంట్‌ ముందు ఉంచేందుకు అవసరమైన మెజారిటీని సంపాదించలేక పోయింది. ఆ సమయంలో ఎన్డీఏ… ముఖ్యంగా బీజేపీ ఈ సవరణలను తీవ్రంగా వ్యతిరేకించింది. పౌర సమాజం కూడా యూపీఏ చర్యపై నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఎన్డీఏకు చట్టసభలో అవసరమైన మెజారిటీ ఉండడంతో తిరిగి ఆ సవరణలను తెరపైకి తెచ్చింది.

ఆధారాలు లేకుండా… కారణాలు చూపకుండా..
అధికార యంత్రాంగానికి సంబంధించిన ముసాయిదా పత్రాలు, అంతరంగిక ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రికార్డులు ఎన్ని పర్యాయాలు బహిర్గతమయ్యాయనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అంతేకాదు… అవి బహిర్గతం అవడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలకు ఏ విధంగా భంగం వాటిల్లిందో కూడా చెప్పలేకపోతోంది. నిర్దిష్టమైన ఆధారాలు, కారణాలు చూపకుండానే తాను ఒకనాడు వ్యతిరేకించిన సవరణలనే ఎన్డీఏ ఇప్పుడు ముందుకు తీసుకొస్తోంది. రహస్య చర్చల సమాచారం బయటికి పొక్కకుండా చూడడం, నిర్ణయాల ప్రక్రియను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశమని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం చెప్పింది. జవాబుదారీతనాన్ని, సమర్ధవంతమైన పాలనను సమతూకం చేయడమే లక్ష్యమని తెలిపింది. అనేక ప్రపంచ దేశాలలో ఇదే పద్ధతి అమలులో ఉన్నదని అంటూ తన వైఖరిని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది.

ఇతర దేశాల్లోనూ…
అధికార యంత్రాంగానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వాలు వ్యతిరేకించడం కొత్తేమీ కాదు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, స్కాట్లాండ్‌ వంటి దేశాలు తమ సమాచార స్వేచ్ఛ చట్టాలలో ఇలాంటి నిబంధనలను చేర్చాయి. అయితే వాటిని చాలా అరుదుగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఒకవేళ నిబంధనలను అమలు చేసినప్పటికీ అవి కఠినతరమైన న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి.

ప్రభుత్వం ఏం చెబుతోందంటే…
‘ఇప్పటికి రెండు దశాబ్దాలు గడిచాయి. ఆర్‌టీఐ చట్టాన్ని పున్ణపరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ చర్య దాని స్ఫూర్తిని నీరుకార్చడానికి కాదు. ప్రపంచంలో అమలులో ఉన్న అత్యుత్తమ విధానాలను మనం కూడా అవలంబించాలి. గత అనుభవాలు నేర్పిన పాఠాల దృష్ట్యా మార్పులు తప్పనిసరి అవుతున్నాయి. ఆర్‌టీఐ చట్టం ఏ ఉద్దేశంతో అయితే అమలులోకి వచ్చిందో దానిని దృఢంగా ముందుకు తీసుకుపోవడానికే ఈ సవరణలు’ అని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఏదైనా ఒక అంశంపై అధికార యంత్రాంగం తుది నిర్ణయం తీసుకునే వరకూ దానికి సంబంధించిన మేధోమధన నోట్స్‌, కార్యాచరణ పత్రాలు, ముసాయిదా వ్యాఖ్యలను గోప్యంగా ఉంచడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వీసు రికార్డులు, బదిలీలు, కాన్ఫిడెన్షియల్‌ స్టాఫ్‌ రిపోర్టులను బహిర్గతం చేయకుండా కాపాడడం కూడా ఈ సవరణల్లో భాగమేనని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -