పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026`ను టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు.ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. 5 నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను ఔత్సాహిక దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పంపవచ్చు. ఎంట్రీలను జూన్ 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. జ్యూరీ ఎంపిక చేసిన విజేతలకు జూన్ 21న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అవార్డులు ప్రదానం చేయనున్నారు.ఈ సందర్భంగా డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ,’తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తున్నాం. ఇకపై ప్రతి ఏడాది దీన్ని నిర్వహిస్తాం. ఈ ఫెస్టివల్‌లో బెస్ట్ స్టోరీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ కో-ఆర్టిస్ట్ వంటి తదితర దాదాపు 20 విభాగాల్లో అవార్డులు అందజేస్తాం. కొత్త ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను` అని అన్నారు.’కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడంలో డా. రామకృష్ణ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయం. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఫెస్టివల్ నిర్వహించడం గొప్ప విషయం` అని టీఎఫ్‌సీసీ వైస్ ఛైర్మన్ గురురాజ్, టీఎఫ్‌సీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్సాఖాన్, టీఎఫ్‌సీసీ వైస్ ఛైర్మన్ అల్లా భక్షు, టీఎఫ్‌సీసీ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ ప్రకాశ్ గౌడ్ కొనియాడారు.



